77 Bible Verses About Missions
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
-
1 అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.
2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.
4 కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు. 5 వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
-
11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15 ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.
-
4 ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5 యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”
6 వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన, 7 “కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.
-
15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
17 “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”
-
44 తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.
46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.
-
2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.
3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4 నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.
5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.
-
1 ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.
2 వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి. 3 మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను.
-
35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు. 37 ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. 38 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.
-
19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 20 ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.
21 అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22 ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23 మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
-
36 కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు.
37 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. 38 అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు. 39 ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.
40 పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి, 41 సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.
-
8 అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను.
అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.
9 ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు.
ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.
10 వారు కళ్ళతో చూసి, చెవులతో విని,
హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని,
స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి,
వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు.
11 “ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,
12 యెహోవా ప్రజలను దూరప్రాంతానికి తీసుకు పోయే దాకా, దేశం నిర్జనమై చవిటిపర్ర అయ్యే దాకా.”
-
6 ఇదే యెహోవా వాక్కు. “నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు. ఈ విషయం చెప్పింది నేనే అని వాళ్ళు ఆ రోజు తెలుసుకుంటారు. ఔను. నేనే.”
7 సువార్త ప్రకటిస్తూ శాంతిసమాధానాలు చాటిస్తూ శుభ సమాచారం తెస్తూ విడుదల సమాచారం తీసుకు వచ్చే వారి పాదాలు “నీ దేవుడు పరిపాలిస్తున్నాడు” అని సీయోనుతో చెప్పే వారి పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయి.
8 విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.
9 యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు.
10 అన్ని రాజ్యాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరచాడు. ప్రపంచమంతా మన దేవుని రక్షణ చూస్తారు.
-
19 స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. 20 వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. 21 ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు. 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.
23 అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.
-
14 రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
-
5 నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను. 6 అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు. 8 కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను. 9 ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
-
7 అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు సువార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు. 8 అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగజేశాడు.
9 నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు. 10 మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.
-
7 యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
8 “ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
9 చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
11 ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.”
-
14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.
17 మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. 19 మీరెలా ఉన్నారో తెలుసుకుని నాకు ప్రోత్సాహం కలిగేలా, ప్రభు యేసు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను. 20 తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు.
-
17 అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.
18 అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. 19 అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.
-
18 అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను. 20 నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను. 21 దీన్ని గురించి ఇలా రాసి ఉంది,
“ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు,
ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
-
1 ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు.
2 పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ కనుగొన్నాడు. యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి కొద్ది కాలం క్రితమే ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు. 3 వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
4 అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు.
-
1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”
-
1 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.
2 యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.
3 రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.
-
13 “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
-
1 ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు. 2 దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపాడు.
3 అప్పుడు ఆయన, “మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు. 4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి. 5 మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి” అన్నాడు.
6 వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు.
-
37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
-
4 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.
5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు. 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు. 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
-
47 “ఎందుకంటే,
‘నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చేవానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను’
అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు” అన్నారు.
-
26 అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు. 27 వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.
-
4 వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు. 5 కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ 7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
-
12 “అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు 13 రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను. 14 మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
15 అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని. 16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు, 17-18 నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.
-
18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.
20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
-
10 సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.
భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.
11 ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి.
సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు.
12 ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు.
-
1 ద్వీపాల్లారా! నా మాట వినండి. దూరంగా ఉన్న ప్రజలారా! జాగ్రత్తగా వినండి.
నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కనినప్పుడే ఆయన నా పేరుతో గుర్తు చేసుకున్నాడు.
2 ఆయన నా నోటిని పదునైన కత్తిలాగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు.
ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలాగా చేశాడు. తన అంబులపొదిలో నన్ను దాచాడు.
3 ఆయన నాతో “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి. నీలో నా ఘనత చూపిస్తాను” అని చెప్పాడు.
4 నేను వ్యర్థంగా కష్టపడి, నిష్ఫలంగా నా శక్తినంతా ఖర్చుచేశానని అనుకున్నా, నా న్యాయం యెహోవా దగ్గరే ఉంది. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది.
5 యెహోవా దృష్టికి నేను గౌరవనీయుణ్ణి.
నా దేవుడు నాకు బలం. తనకు సేవకుడుగా ఉండడానికి, తన దగ్గరికి యాకోబును మళ్ళీ రప్పించాలనీ ఇశ్రాయేలును ఆయన దగ్గరికి చేర్చేలా నన్ను గర్భంలో రూపొందించాడు.
యెహోవా ఇలా చెబుతున్నాడు.
6 “నువ్వు యాకోబు గోత్రాలను ఉద్ధరించడానికీ ఇశ్రాయేలులో తప్పించుకున్నవాళ్ళను తీసుకురావడానికీ నా సేవకుడుగా ఉండడం ఎంతో చిన్న విషయం.
నువ్వు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి నిన్ను యూదేతరులకు వెలుగుగా చేస్తాను.”
-
1 యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే 2 “నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.”
-
23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
-
1 నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు. 2 మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే, 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.
5 ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను. 6 ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో దీన్ని మీకు తెలియజేసాం. 7 మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా?
8 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.” 9 నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
10 క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 11 ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు. 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.
13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.
-
10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
-
1 యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. 2 “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.” 3 కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.
4 అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.
-
1 దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం. 2 యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది,
“ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను.
అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
3 ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి,
ఆయన దారులు తిన్నగా చేయండి’
అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
4 యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. 5 యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. 6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం. 7 యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు. 8 “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
-
35 పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. 36 విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.
37 ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే. 38 మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.
-
16 నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.
-
14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం. 15 బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.
-
11 సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. 12 మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
13 నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి. 14 అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను. 15 అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని 16 ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు. 17 నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
18 మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. 19 అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
20 నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను. 21 ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను. 22 క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ 23 “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, 24 వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.
-
9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
-
1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం, 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు. 6 ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
7 దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.
-
11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.
-
17 అప్పుడు సమూయేలు “నీ విషయంలో నువ్వు అల్పుడవుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు. 18 యెహోవా నిన్ను పంపించి ‘నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను నాశనం చెయ్యి, వారు సమూలంగా అంతమయ్యే వరకూ వారితో యుద్ధం చెయ్యి’ అని చెప్పినప్పుడు, 19 నువ్వు యెహోవా మాట వినకుండా దోచుకున్న దాన్ని ఆశించి ఆయన విషయంలో ఎందుకు తప్పు చేశావు?” అన్నాడు.
20 అప్పుడు సౌలు “అలా అనకు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన వెళ్ళి అమాలేకీయుల రాజైన అగగును మాత్రమే తీసుకు వచ్చాను కాని అమాలేకీయులందరినీ నాశనం చేశాను. 21 అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు శపితమైన గొర్రెల్లో, ఎద్దుల్లో శ్రేష్ఠమైనవాటిని తీసుకువచ్చారు” అని సమూయేలుతో చెప్పాడు.
22 అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. 23 తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.
-
38 ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
-
26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.
-
18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.
21 దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24 యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.
26 ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27 అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
-
26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.
-
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
-
14 సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.
-
27 తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.
-
18 వాళ్ళ పనులూ వాళ్ళ ఆలోచనలూ నాకు తెలుసు. అన్ని తెగలనూ వివిధ భాషలు మాట్లాడే వారినీ ఒక చోట చేర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా ఘనత చూస్తారు. 19 నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు.
-
18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.
పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు.
చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,
19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు”
అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
-
18 వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.
-
13 మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు? 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. 15 దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
16 మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. 17 కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
-
10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
-
1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.
అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.
గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,
2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.
3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.
నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.
4 పురాతన శిథిలాలను వాళ్ళు కడతారు. గతంలో పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు.
తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను మళ్ళీ నిర్మిస్తారు.
-
5 యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు. 6 ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. 7 వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8 రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.
-
16 “తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. 17 మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. 18 వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.
19 వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20 మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. 21 సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. 22 నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.
23 వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
24 గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు. 25 శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా!
-
42 తెల్లవారినప్పుడు ఆయన బయలుదేరి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయనను వెదుకుతూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయనను ఆపాలని చూశారు. 43 అయితే ఆయన, “నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాడు” అని వారితో చెప్పాడు.
-
30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”
-
30 అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి 31 ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి 32 పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. 33 వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు.
అందుకు పేతురు ఇలా అన్నాడు, 34 “దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. 35 ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. 36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. 37 యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. 38 అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
39 ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. 40 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. 41 ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.
44 పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. 46 ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. 47 అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి 48 యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
-
21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు. 22 శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.
23 ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
-
10 నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”
-
7 అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి.
నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి.
8 వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.”
9 అప్పుడు యెహోవా తన చేత్తో నా నోరు తాకి ఇలా అన్నాడు. “ఇదిగో, నేను నా మాటలు నీ నోటిలో ఉంచాను.
-
12 అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు “‘ఈ మందిరానికీ ఈ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు’ అని యెహోవా నన్ను పంపాడు.
13 కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు.
-
3 ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
4 వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి.
-
3 యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు. 4 “ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?”
5 యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి. 6 చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు. 7 మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
8 జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. 9 మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.
11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.
12 సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. 13 నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.
-
27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
-
10 దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు. 11 అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. 12 దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు.
13 అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు. 14 ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు. 15 అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. 16 ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు.
17 అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు. 18 వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.
-
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. 20 యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. 21 దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. 22 బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. 23 సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
Shows Read in context, Share and Copy.