72 Bible Verses About God's Forgiveness

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Forgiveness
  1. 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.

    “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.

    10 నీ రాజ్యం వస్తుంది గాక.

    పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.

    11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.

    12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.

    13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”

    14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.

  2. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

    8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  3. 5 యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.

    6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, 7 “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” 8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? 9 ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి 11 ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు. 12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.

  4. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.

  5. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

    30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  6. 37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.

  7. 18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.

    నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.

    నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.

    నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.

    19 నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.

    నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.

    మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.

    20 నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.

    పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.

  8. 15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.

    18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.

    20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”

    21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.

  9. 8 యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.

    9 ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.

    10 మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.

    11 భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.

    12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.

    13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.

    14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.

  10. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

  11. 25 ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.

    26 ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో.

  12. 33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.

    34 అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.

  13. 25 అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

  14. దావీదు రాసిన కీర్తన, మస్కిల్. దైవధ్యానం.

    1 తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి.

    2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.

    3 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.

    4 పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.

    5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

    6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.

    7 నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.

  15. 3 యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.

    4 అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు.

  16. 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

    37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.

  17. 13 ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

  18. 5 యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.

    6 యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 7 ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.

  19. 16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.

    మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.

    మీ దుష్టత్వం మానండి.”

    17 మంచి చెయ్యడం నేర్చుకోండి.

    న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.

    తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.

    వితంతువు పక్షాన నిలబడండి.

    18 యెహోవా ఇలా అంటున్నాడు.

    “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”

    “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,

    అవి మంచులా తెల్లగా అవుతాయి.

    కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

    19 మీరు ఇష్టపడి నాకు లోబడితే,

    మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.

    20 తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,

    కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.”

    యెహోవా నోరు ఈ మాట పలికింది.

  20. 13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి. 14 మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. 15 విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.

    16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.

  21. 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.

    32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.

    33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  22. 39 ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. 40 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. 41 ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.

  23. 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

  24. 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.

    7 భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి.

    వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.

  25. 26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.

  26. 47 దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు.

    48 తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 49 అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు. 50 అప్పుడు ఆయన, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.

  27. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.

  28. 19 కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి. 20 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు. 21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం.

  29. 17 తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. 18 ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.

  30. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

  31. 5 ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.

  32. 38 కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.

    39 మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి.

  33. 8 ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు,

    “చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో

    నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.

    9 ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని

    బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది.

    ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు.

    నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.”

    10 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు,

    “ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది.

    వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను.

    అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను.

    నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.

    11 ‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ

    తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు.

    ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ

    అందరూ నన్ను తెలుసుకుంటారు.

    12 నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను.

    వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”

  34. 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.

    24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.

    28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.

    31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.

    35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.

  35. 9 ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.

  36. 13 అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.

  37. 21 అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22 ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23 మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.

  38. 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.

  39. 44 తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.

    46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.

  40. 22 ధర్మశాస్త్రం ప్రకారం, దాదాపు వస్తువులన్నీ రక్తం వల్ల శుద్ధి అవుతాయి. రక్తం చిందించకపోతే పాపాలకు క్షమాపణ కలగదు.

  41. 17 ‘యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు. 18 దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు’ అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక. 19 ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు” అన్నాడు. 20 యెహోవా “నీ కోరిక ప్రకారం నేను క్షమించాను. 21 కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు, 22 ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు. 23 కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు.

  42. 20 యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 21 శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు 22 యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23 ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? 24 అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు.

    తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. 25 వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.

  43. 13 ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. 14 మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు. 15 ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ ఓడించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు.

    16 కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. 17 ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది.

  44. 23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. 24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.

  45. 31 “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. 32 మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.

  46. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు.

  47. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.

  48. ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన.

    1 దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.

    2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

    3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

    4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

    5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.

  49. 2 కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు. 3 ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు.

    4 యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు? 5 ‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా? 6 అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.

  50. 1 “నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన 2 అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే 3 మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

    4 చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు. 5 మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు.

    6 మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.

    7 మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు. 8 మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు.

    9 మీ యెహోవా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు. 10 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.

    11 ఇవ్వాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవడం అసాధ్యమూ కాదు. 12 ‘మనం విని, దాని ప్రకారం చేయడం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని మీరు భావించడానికి అది ఆకాశంలో ఉండేది కాదు. 13 ‘మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు. 14 మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది.

  51. 7 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.

  52. 4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.

  53. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  54. 12 ప్రియమైన చిన్నపిల్లలారా! క్రీస్తు నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.

  55. 16 అయితే వారూ మా పూర్వికులూ గర్వంతో, నీ ఆజ్ఞలకు లోబడకుండా వాటిని పెడచెవిన పెట్టారు. 17 వారు విధేయత చూపకుండా తమ మనస్సులు కఠినపరచుకుని, వారి మధ్య నువ్వు చేసిన అద్భుతాలను మరచిపోయారు. వారు బానిసలుగా గడిపిన దేశానికి తిరిగి వెళ్ళడానికి ఒక అధికారిని నియమించమని కోరుకుని నీపై తిరుగుబాటు చేశారు. అయితే నీవు దయ, కనికరం ఉన్న దేవుడివి. సహనం, అమితమైన జాలి చూపించే వాడివి. వారి అపరాధాలు క్షమించి వారిని విడిచిపెట్టకుండా కాపాడుతూ వచ్చావు.

  56. 17 ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది.

    నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు.

    నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు.

  57. 13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.

    త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.

    శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.

    కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక

    మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

  58. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  59. 3 అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు. 4 యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది,

    “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.

    ఆయన బాటలు తిన్నగా చేయండి.

    5 ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి.

    వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.

    6 ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”

  60. 22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.

  61. 15 అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని. 16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు, 17-18 నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

  62. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం.

  63. 3 మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు.

  64. 28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29 కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30 ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.

  65. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

  66. 32 అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు” అని బతిమాలుకున్నాడు.

  67. 9 దేవా, మా రక్షకా! నీ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా మాకు సాయం చెయ్యి. నీ నామాన్ని బట్టి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించు.

  68. 20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

  69. 4 యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.

  70. 7 ఎలా అంటే,

    “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,

    తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.

  71. 4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

  72. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.