44 Bible Verses About Marriage
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
22 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. 23 క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు. 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. 30 మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
31 “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు” 32 ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను. 33 చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
-
18 దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. 19 దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. 20 అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.
23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.
మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.
24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. 25 అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.
-
1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.
3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి. 6 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.
7 ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.
8 నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను. 9 అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.
10 ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు. 11 ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
12 మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. 13 అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. 14 అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.
15 అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. 16 మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?
-
4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, 5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.
7 అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.
10 ఆయన శిష్యులు, “భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది” అని ఆయనతో అన్నారు. 11 అందుకు యేసు, “దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించ లేరు. 12 తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక” అని వారితో చెప్పాడు.
-
1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.
-
18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.
19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు.
-
6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.
“హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”
7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.
పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.
కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.
ఆయనకు మహిమ ఆపాదించుదాం.”
8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు.
ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.
9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
-
1 భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2 ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.
3 జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4 వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.
-
9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.
కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.
10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.
అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.
11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!
12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.
అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.
మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?
-
27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
31 “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
-
4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.
-
5 నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు.
-
7 అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు.
-
13 మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.
14 ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా. 15 ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.
16 ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.
-
1 సోదరులారా, ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంత వరకే అధికారం చెలాయిస్తుందని మీకు తెలియదా? ధర్మశాస్త్రం తెలిసిన మీతో మాట్లాడుతున్నాను. 2 వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది. 3 కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుణ్ణి కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుణ్ణి పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.
-
8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.
-
19 నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.
నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.
20 యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.
-
2 “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. 3 ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.
4 అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. 5 కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. 6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.
7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
-
32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది. 35 మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
-
22 భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.
-
6 నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో.
ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది.
మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది.
దాని మంటలు ఎగిసి పడతాయి.
అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.
7 ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు.
వరదలు దాన్ని ముంచలేవు.
ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ.
-
9 అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి. 10 ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
11 పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. 12 ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు. 13 వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.
14 కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.
-
10 సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
11 ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు.
12 ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు.
-
13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.
-
7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ.
-
18 “భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
-
8 అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. 9 స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. 10 కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి.
11 అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు. 12 ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి.
-
1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి. 2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.
3 మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు.
-
15 నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.
16 నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?
17 పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.
18 నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.
19 ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.
-
2 మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే,
-
32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
-
22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు. 23 కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే 24 ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి.
-
11 “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. 12 రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. 13 కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. 14 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”
-
15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16 వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.
-
2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
-
19 అందుకు లాబాను “ఆమెని పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు” అని చెప్పాడు. 20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.
-
16 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
నా ప్రియుడు నా వాడు.
నేను అతని దాన్ని.
లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
-
14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
-
2 మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నేర్పించాము. మీరూ ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము. 3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.
4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
-
14 ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే.
-
9 దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం.
-
24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.
26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
-
28 ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
-
12 పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి.
Shows Read in context, Share and Copy.