79 Bible Verses About Birthdays

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Birthdays
  1. 1 ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు. 2 ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య. 3 అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు.

    4 యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు. 5 తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు.

    6 వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. 7 ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు.

    8 ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు 9 ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.

    10 అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను. 11 దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 12 మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు. 13 ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి,

    14 “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ.

    ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!”

    అంటూ దేవుణ్ణి స్తుతించారు.

    15 ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని 16 త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు. 17 ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు.

    18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. 19 మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది. 20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.

  2. 20 మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు. 21 గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు. 22 యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు. 23 అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరచిపోయాడు.

  3. 11 నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.

    12 నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.

    13 నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.

    14 అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను.

    15 అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.

    16 దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను.

  4. 18 యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. 19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.

    20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

    22-23 “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.

    ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే

    ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు”

    అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. 24 యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. 25 అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.

  5. 6 హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు. 8 తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది. 9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు. 10 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.

    11 వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.

  6. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

    18 దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు.

  7. 13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

    14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

    15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

    16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

  8. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  9. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

    4 అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.

    5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. 7 నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు అదొక విడ్డూరంగా భావించవద్దు. 8 గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”

  10. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.

  11. 4 అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్ళలో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా ఆహ్వానించేవాళ్ళు. 5 వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించే వాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతి రోజూ యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు.

  12. 12 కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.

  13. 21 కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

    22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

  14. 10 కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది.

    11 జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను.

    12 నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు.

    13 అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.

  15. 6 ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.

    7 ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.

  16. 6 నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.

    7 నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.

    8 నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.

  17. 11 నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.

  18. 15 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

  19. 4 నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక.

  20. 4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

    5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

    6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

  21. 24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.

    25 యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.

  22. 5 “నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.

    జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.”

  23. 11 జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.

  24. 8 ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి.

    అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి.

    అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే.

    9 యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు.

    నీ యువదశలో మనసారా సంతోషించు.

    నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు.

    అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో.

    10 నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి.

    నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు.

    ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.

  25. 11 సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.

  26. 1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, 2 “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు.

  27. 21 స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.

  28. 4 యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.

    5 ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.

  29. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  30. 1 పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు.

    ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు.

  31. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

  32. 4 యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను.

    5 ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు.

    6 అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను.

    7 యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు.

  33. 31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  34. 12 నీడలాగా తమ జీవితాలను వ్యర్థంగా గడిపేసే మనుషులకు తమకేది మంచిదో ఎవరికి తెలుసు?

    వారు పోయిన తరువాత ఏమి జరుగుతుందో వారికి ఎవరు చెప్పగలరు?

  35. 5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి. 6 ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు.

  36. 15 ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. 16 “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు. 17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. 18 ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.

    19 అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు. 20 మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది.

  37. 9 ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు.

    10 గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి.

  38. 9 వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది.

    10 ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. 11 ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు.

  39. 13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

  40. 1 ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు. 2 యోబు ఇలా అన్నాడు.

    3 నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.

    4 ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు.

  41. 9 కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?

    10 మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.

    11 దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.

    12 కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను. 13 ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.

    14 దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.

  42. 7 ప్రసవవేదన పడకముందే ఆమె పిల్లను కనింది.

    నొప్పులు రాకముందే కొడుకును కనింది.

    8 అలాంటి సంగతి ఎవరైనా విన్నారా? అలాంటివి ఎవరైనా చూశారా?

    ఒక్క రోజులో దేశం పుడుతుందా? ఒక్క క్షణంలో ఒక రాజ్యాన్ని స్థాపించగలమా?

    అయినా సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె బిడ్డలను కనింది. 9 నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు.

    “పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు.

    10 యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి.

    ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి.

    11 ఆదరణకరమైన ఆమె చనుపాలు మీరు కుడిచి తృప్తి పడతారు. ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.

    12 యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను.

    రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను.

    మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు.

  43. 14 నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.

    15 ‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక.

    16 ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక!

    17 యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.

    18 కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”

  44. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

    3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.

  45. 31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

  46. 4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

  47. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.

  48. 15 చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను. 16 మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

    17 అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే 18 మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను. 19 ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. 20 మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

  49. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  50. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  51. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.

  52. 2 యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు.

    నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు

    మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.

    3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది.

    మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే.

    కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు.

    అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.

    4 పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు.

    తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.

    5 తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు.

    ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు.

    గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది.

    ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.

    6 మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే.

    పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.

    7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.

    కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

  53. 1 స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు.

  54. 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

  55. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

  56. ప్రథమ పరిచ్ఛేదము

    1 దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.

    2 అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.

    3 అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.

  57. 14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? 15 క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి? 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.

    “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”

    17 కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు”

    అని ప్రభువు చెబుతున్నాడు.

    18 “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను,

    మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు”

    అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.

  58. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  59. 16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  60. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది.

  61. 7 దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.

  62. 7 రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు “నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు” అని అబ్నేరును ప్రశ్నించాడు.

  63. ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన

    1 యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు.

    2 నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు.

    3 నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు.

    4 యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు.

    5 నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు.

  64. 24 అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను.

  65. 3 “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

  66. 3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. 5 సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. 6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.

  67. 7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు.

  68. 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

    3 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.

  69. 8 నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు.

    9 ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా?

    10 ఒకడు పాలు ఒలకబోసినట్టు నువ్వు నన్ను ఒలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు.

    11 మాంసం, చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు, నరాలతో నన్ను రూపొందించావు.

    12 నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు.

  70. 5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.

  71. 5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

  72. 15 యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.

  73. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  74. 4 నువ్వు ముసలివాడివయ్యే వరకూ, నీ తల వెండ్రుకలు తెల్లగా అయ్యే వరకూ నిన్ను మోసేవాణ్ణి నేనే.

    నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకునే వాణ్ణీ, నిన్ను మోస్తూ రక్షించేవాణ్ణీ కూడా నేనే.

  75. 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”

  76. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. 23 అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.

  77. 3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు.

  78. 29 ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వారందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.

  79. 3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు. 4 దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే.