53 Bible Verses About Guidance

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Guidance
  1. 1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

    2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

    3 అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

    4 అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

    5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  2. 6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.

    7 నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.

    8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.

    9 వివేకం లేని గుర్రం లాగానో, గాడిద లాగానో ఉండకు. వాటిని అదుపు చేయాలంటే కళ్ళెం ఉండాలి. అవి నువ్వు కోరిన చోటికి వెళ్ళవు.

  3. 12 మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక ‘నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను’ అని నాతో చెప్పావు కదా. 13 అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.”

    14 అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు. 15 మోషే “నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు. 16 నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు.

    17 అప్పుడు యెహోవా “నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను” అని మోషేతో చెప్పాడు.

  4. నూన్‌

    105 నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.

  5. 4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.

    5 నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.

  6. 23 అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు.

    24 నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు.

    25 పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు.

    26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.

    27 నీకు దూరంగా జరిగేవారు నశించిపోతారు. నీకు అపనమ్మకంగా ఉన్నవారందరినీ నువ్వు నాశనం చేస్తావు.

    28 నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.

  7. 1 “నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” ఇది యెహోవా వాక్కు.

    2 ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. “మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.

    3 నేను వాటిని తోలి వేసిన దేశాలన్నిటిలో నుంచి మిగిలిన నా గొర్రెలను దగ్గరికి చేరుస్తాను. వాటి మేత భూములకు వాటిని రప్పిస్తాను. అవి వృద్ధి చెంది విస్తరిస్తాయి.

    4 నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.”

  8. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

    3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి. 4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.

    6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7-8 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.

  9. 12 “నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13 అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. 14 ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. 15 నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.

  10. 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8 అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.

  11. 1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”

    4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.

  12. 10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.

    11 యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.

  13. 133 నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.

  14. 1 అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.

    2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.

    4 కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు. 5 వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.

  15. 6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ 7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.

    8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.

  16. 34 నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను” అని మోషేతో చెప్పాడు.

  17. 1 కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు. 2 అప్పుడు దావీదు యెజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలీయుడు నాబాలుకు భార్యగా ఉండి విధవరాలైన అబీగయీలు, అనే తన ఇద్దరు భార్యలను వెంట బెట్టుకుని అక్కడికి వెళ్ళాడు.

  18. 17 ప్రజలంతా ఇశ్రాయేలీయులపై రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు దావీదును చంపడానికి వారు సైన్యంతో బయలుదేరారు. ఆ వార్త తెలియగానే దావీదు సురక్షితమైన స్థలానికి వెళ్లిపోయాడు. 18 ఫిలిష్తీ సైన్యం వచ్చి రెఫాయీము లోయలో మకాం వేశారు. 19 దావీదు “నేను ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా?” అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు “బయలుదేరి వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను” అని చెప్పాడు. 20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి అక్కడ వాళ్ళను ఓడించి “జలప్రవాహాలు కొట్టుకు పోయినట్టు యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడకుండా చేశాడని” ఆ స్థలానికి బయల్పెరాజీము అని పేరు పెట్టాడు.

  19. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

  20. 8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.

    9 దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.

    10 ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.

  21. 11 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేనే స్వయంగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. 12 తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి, 13 ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.

    14 నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి. 15 నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. 16 “తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.

  22. 3 ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే.

    వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే.

    నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు.

    4 మానవత్వపు బంధంతో వారిని నడిపించాను.

    స్నేహబంధాలతో తోడుకుపోయాను.

    వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను.

    వంగి వారికి అన్నం తినిపించాను.

  23. 39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.

  24. 35 ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. 36 ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.

  25. 3 అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. 4 తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.

  26. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

    28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

  27. 13 సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. 14 మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

  28. 23 దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు.

    24 యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు.

  29. 6 పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.

  30. 11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.

    నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.

    ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.

  31. 21 పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు. 22 దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.

  32. 31 చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.

  33. 9 ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.

  34. 7 భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి.

    వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.

    8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.

    9 “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

    10 వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి.

    దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి.

    అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.

    11 ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు.

    అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.

  35. 23 యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు.

  36. 19 కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ.

    అవి ఏమైనా బోధించగలవా?

    దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.

  37. 17 దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు.

  38. 17 ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. “ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో” అనుకున్నాడు. 18 అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.

  39. 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

    3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

  40. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.

    7 అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  41. 7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది.

    8 అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!

  42. 11 యెహోవా, నీ మార్గం నాకు బోధించు. నా శత్రువుల నిమిత్తం సమతలంగా ఉన్న దారిలో నన్ను నడిపించు.

  43. 19 సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు.

    20 మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.

  44. 10 నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.

  45. 14 మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం.

  46. 12 ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

  47. 16 గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను.

    వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను.

  48. 26 ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు. 27 అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు.

    28 అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు. 29 ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు. 30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు. 31 అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.

  49. 19 పేతురు ఆ దర్శనాన్ని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఆత్మ, “చూడు, ముగ్గురు వ్యక్తులు నీ కోసం చూస్తున్నారు. 20 నీవు లేచి కిందికి దిగి వారితో పాటు వెళ్ళు. వారితో వెళ్ళడానికి సంకోచించవద్దు. వారిని నేనే పంపాను” అని అతనితో చెప్పాడు.

  50. 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.

  51. 24 ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. 25-26 దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

  52. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.

  53. 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.