35 Bible Verses About Studying the Bible
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. 15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.
16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
-
14 వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. 15 దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.
16 భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి. 17 పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే. 18 వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
19 అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.
-
1 కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.
2 జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, 3 తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, 4 పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, 5 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
6 యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.
-
33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
-
11 నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.
12 యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.
13 నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.
14 సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.
15 నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.
16 నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.
-
19 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు. 20 లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి. 21 ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.
-
28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?
భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.
ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.
29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.
30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.
31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
-
11 వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు. 12 అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
-
21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.
22 వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 23 ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. 24 అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. 25 కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.
-
8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు.
-
14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి. 15 మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు. 16 అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
17 కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
-
12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు.
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
-
1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.
-
39 లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 40 అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు.
-
31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.
-
4 ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.
-
23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.
-
16 మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది.
ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు.
ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు.
ఆయనను దేవదూతలు చూశారు.
దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు.
లోకం ఆయనను నమ్మింది.
మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.
-
7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
8 యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.
9 యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.
10 అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
11 వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
-
నూన్
105 నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
-
19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
-
2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
-
12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.
-
17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
-
13 నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు. 14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.
15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి. 16 నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.
-
2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.
-
1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.
2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.
-
10 కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది.
11 జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను.
12 నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు.
13 అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.
-
44 తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.
46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.
-
14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు. 15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము. 16 నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు? 17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే సదుద్దేశంతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాం.
-
11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
-
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
-
19 కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. 20 తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. 21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, 22 విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.
23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.
24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
-
1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2 అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3 కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.
Shows Read in context, Share and Copy.