52 Bible Verses About Revival

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Revival
  1. 2 నీ ప్రజల పాపాలు క్షమించావు, వారి పాపాలన్నీ కప్పివేశావు. సెలా.

    3 నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు.

    4 మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని ఉద్ధరించు. మా మీద నీ కోపం చాలించు.

    5 మా మీద కలకాలం కోపంగా ఉంటావా? తరతరాలుగా నీ కోపం సాగిస్తావా?

    6 నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?

    7 యెహోవా, నీ కృప మాకు చూపించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు.

  2. 17 నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు.

    18 అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం.

    19 యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.

  3. 15 ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.

  4. 2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను.

    యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు.

    ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి.

    కోపంలో కనికరం మరచిపోవద్దు.

  5. 7 నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను.

    8 నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు.

    9 నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.

    10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

    11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

    12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.

    13 అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు.

  6. 1 మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి.

    ఆయన మనలను చీల్చివేశాడు.

    ఆయనే మనలను స్వస్థపరుస్తాడు.

    ఆయన మనలను గాయపరిచాడు.

    ఆయనే మనకు కట్లు కడతాడు.

    2 రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు.

    మనం ఆయన సముఖంలో బ్రతికేలా,

    మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.

    3 యెహోవాను తెలుసుకుందాం రండి.

    యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి.

    పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం.

    వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.

    4 ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి?

    యూదా, నిన్నేమి చెయ్యాలి?

    ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.

    5 కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను.

    నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను.

    నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి.

    6 నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను.

    దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.

  7. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  8. 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

  9. 7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.

  10. 19 కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి. 20 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు. 21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం.

  11. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  12. 107 యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.

  13. 1 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.

    2 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి.

    మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు.

    అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.

  14. 7 “అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. 9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. 11 ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.

  15. 9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు జీవంతోనే ఉన్నాను గాని, ఆజ్ఞ రావడంతోనే పాపానికి మళ్ళీ జీవం వచ్చి నేను చనిపోయాను.

  16. 4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

  17. 3 యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు. 4 యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.

    5 ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.

    6 యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు. 7 వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు. 8 హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.

  18. దాలెత్‌

    25 నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.

  19. 1 “దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి.

    రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి.

    2 తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు?

    నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి.

    3 శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు.

    నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను.

  20. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు. 14 అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’

  21. 37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.

  22. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

  23. 1 “సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గానీ నువ్వు చచ్చిన వాడివే. 2 జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు. 3 కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే ఆచరించి పశ్చాత్తాప పడు. నువ్వు మేలుకొనక పోతే, నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు.

    4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు. 5 జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను. 6 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”

  24. 11 ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు.

    12 వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది.

  25. 7 యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. 8 అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.

  26. 1 హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. 2 అతడు తన పూర్వీకుడు దావీదు చేసిన ప్రకారం యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. 3 అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగుచేసి, 4 యాజకులనూ లేవీయులనూ పిలిపించి, తూర్పువైపున రాజవీధిలో వారిని సమకూర్చి 5 వారికిలా ఆజ్ఞాపించాడు. “లేవీయులారా, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసికెళ్ళండి.”

  27. 15 యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు.

    16 అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.

  28. ద్వితీయ పరిచ్ఛేదము

    ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం.

    1 జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది.

    2 నా ప్రాణం దేవుని కోసం, సజీవుడైన దేవుని కోసం తీవ్రమైన దాహంతో ఉంది. దేవుని సమక్షంలోకి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సమక్షంలో నేను ఎప్పుడు కనిపిస్తాను?

  29. 14 రాజ భవనాన్ని విడిచి పెట్టేస్తారు. జనసమ్మర్దమైన పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది.

    కొండ, నిఘా గోపురాలు ఇక ఎప్పటికీ గుహల్లా ఉంటాయి.

    అవి అడవి గాడిదలు ఆనందించే స్థలంగానూ, పశువులు మేసే స్థలంగానూ ఉంటాయి. దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ ఇలా జరుగుతుంది.

    15 తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిగా ఉంటుంది. ఫలభరితమైన భూమి అరణ్యంలా ఉంటుంది.

    16 అప్పుడు న్యాయం అరణ్యంలో నివసిస్తుంది. ఫలభరితమైన భూమిలో నీతి ఉంటుంది.

    17 నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.

  30. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  31. 12 యెహోవా ఇలా అంటున్నాడు,

    “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ

    హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”

    13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.

    త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.

    శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.

    కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక

    మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

  32. 15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.

    16 మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.

    17 ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు.

    అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18 నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు.

  33. 8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.

  34. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

  35. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

    11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.

    12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.

  36. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

    19 దేవుని ఆత్మను ఆర్పవద్దు.

    20 ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

    21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.

  37. 27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.

  38. 1 అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి, 2 యూదా వాళ్ళందర్నీ, యెరూషలేము కాపురస్థులందర్నీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్లైనా, గొప్ప వాళ్లైనా, ప్రజలందర్నీ పిలిచి, యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో దొరకిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు.

    3 రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, ఈ గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు.

    4 రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.

  39. ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన.

    1 దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.

    2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

    3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

    4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

  40. 34 నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.

    35 నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.

    36 నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.

    37 పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.

  41. 40 నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు.

  42. 149 నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.

  43. 5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.

    నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.

    6 అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు.

    7 “ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.

  44. 7 నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”

  45. 33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  46. 40 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.

  47. 19 వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. 20 దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను.

  48. 20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. 21 అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు.

    22 “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. 23 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. 24 నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.

  49. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  50. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.

  51. 4 అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు. 5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను.

  52. 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

    18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

    20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు. 21 నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.

    22 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”