52 Bible Verses About Pornography

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Pornography
  1. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.

  2. 16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

    18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  3. 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు. 12 దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.

    13 ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. 14 దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు.

    15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16 వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

    19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  4. 13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

  5. 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

    3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన. 4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు. 5 మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం. 6 పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.

  6. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  7. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  8. 3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.

    4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.

    8 కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు.

  9. 11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.

    13 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. 14 రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి.

  10. బేత్‌

    9 యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

    10 నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

    11 నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

  11. 8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.

  12. 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

    5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.

  13. 12 రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం. 13 పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం. 14 చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

  14. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  15. 1 నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?

    2 అలా చేస్తే పైనున్న దేవుని ఆజ్ఞ ఏమౌతుంది? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని వారసత్వం ఏమౌతుంది?

    3 ఆపద అనేది దుర్మార్గులకేననీ, విపత్తు దుష్టత్వం జరిగించే వారికేననీ నేను భావించే వాణ్ణి.

    4 ఆయనకు నా ప్రవర్తన తెలుసు గదా. ఆయన నా అడుగు జాడలన్నిటినీ లెక్కబెడతాడు గదా.

  16. 12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  17. 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. 4 మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.

    5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.

    7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు.

  18. 21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

  19. 19 అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.

    20 ధనవంతుల ఇంట్లో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి. 21 ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు.

    22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.

  20. 5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

    8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  21. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

  22. 1 వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.

    2 ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది. 3 ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి “ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు” అని చెప్పాడు. 4 దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.

    5 కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది.

  23. 32 వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.

    33 వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.

  24. 25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

    28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. 30 మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.

    31 “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”

  25. 10 ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.

    11 ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

    12 కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. 13 మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.

    14 మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.

  26. 3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం. 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. 5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.

  27. 11 పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. 12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

  28. 16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.

  29. 14 వ్యభిచారం చెయ్యకూడదు.

  30. 37 పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.

  31. 22 “శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది. 23 నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!

  32. 1 క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2 ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3 యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు. 4 వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.

    5 బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి.

  33. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

    7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

    8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

  34. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  35. 20 కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో.

    21 నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.

    22 అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.

    23 అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.

    24 నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.

    25 నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.

  36. 1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.

    3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  37. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.

  38. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  39. 5 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే. 6 కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

    7 “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. 8 నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. 9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.

  40. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

  41. 5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.

  42. 21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.

    22 ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.

  43. 3 వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను.

    4 మూర్ఖంగా ఆలోచించేవాడు నాకు దూరంగా ఉండాలి. దుష్టకార్యాలంటే నాకు అసహ్యం.

    5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.

    6 దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.

    7 మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

  44. 18 నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.

    19 ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.

    20 కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?

    21 మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.

  45. 26 కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి.

    27 వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట.

    28 దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది.

  46. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది.

  47. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

  48. 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.

    8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  49. 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.

  50. 9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. 10 అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.

    11 ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు.

  51. 1 స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.

  52. 7 అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.