86 Bible Verses About Boasting

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Boasting
  1. 26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

    30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

  2. 23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.

    24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.

    అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”

    25 యెహోవా చెప్పేదేమంటే “అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను. 26 అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”

  3. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  4. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  5. 13 అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.

    14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. 15 కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.

    16 ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక. 17 నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. 18 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్‌.

  6. 1 రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?

    2 నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.

  7. 12 తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నట్టు.

    13 మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దుల్లోనే ఉంటాం. 14 మేము మీ దగ్గరికి వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే. 15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన 16 మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం. 17 అయితే, “అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి.” 18 ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.

  8. 6 సోదరీ సోదరులారా, “రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు” అనే మాట అర్థం మీరు గ్రహించాలని ఈ మాటలు మీ మేలు కోసం నాకూ అపొల్లోకూ ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవీగ కూడదని ఈ విధంగా వివరించాను.

    7 ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు? 8 ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే! ఇప్పటికే ధనవంతులయ్యారంటనే! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటనే! అయినా, మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు!

  9. 2 తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి.

    3 దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు.

    4 దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.

    5 అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు.

    6 నేను ఎన్నడూ ఓడిపోను, తరతరాల వరకూ విరోధాన్ని చూడను, అని అతడు తన మనసులో అనుకుంటాడు.

  10. 12 సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు. 13 ఎందుకంటే అతడు,

    “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.

    14 పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు.

    15 నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా?

    ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.

    16 కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.

  11. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

  12. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

    27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. 28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.

  13. 18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ, 20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.

    21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.

  14. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  15. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  16. 16 మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్ధిహీనుడిగానే చేర్చుకోండి. 17 గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్ధిహీనుడిలా చెబుతున్నాను. 18 చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను. 19 తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు. 20 ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు. 21 వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే-బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను-నేనూ అతిశయిస్తాను.

  17. 1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, 3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. 4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. 5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.

  18. 14 ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.

  19. 28 పైన చెప్పిన విషయాలన్నీ రాజైన నెబుకద్నెజరుకు సంభవించాయి. 29 ఒక సంవత్సర కాలం గడచిన తరువాత అతడు తన రాజధాని పట్టణం బబులోనులోని ఒక నగరంలో సంచరించాడు. 30 అతడు దాన్ని చూస్తూ. “ఈ బబులోను నగరం మహా విశాలమైన పట్టణం. నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావ ఘనతలను చూపించుకోవడానికి దీన్ని నా రాజధాని నగరంగా కట్టించుకున్నాను” అని తనలో తాను అనుకున్నాడు.

    31 ఈ మాటలు రాజు నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం “రాజువైన నెబుకద్నెజర్, ఈ ప్రకటన నీ కోసమే. నీ రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది. 32 రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది.

    33 ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి.

  20. 17 అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి వేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటు కట్టి, ఒలీవ చెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే, 18 నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు. 19 అందుకు, “ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటు కట్టడానికే” అని నీవు చెప్పవచ్చు. 20 నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు. 21 ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా!

  21. 2 నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!

  22. 18 ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.

  23. 1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.

    3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. 5 మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.

    6 నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  24. 28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  25. 1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,

    “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.

    యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది.

    నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.

    నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

    2 యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు.

    నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు

    మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.

    3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది.

    మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే.

    కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు.

    అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.

  26. 13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.

  27. 17 నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా? 18 ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా? 19 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి, 20 బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా? 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా? 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా? 24 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా.

  28. 1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

    3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.

  29. 6 నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు.

    7 మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే.

    8 మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సెలా.

  30. 3 ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు. 4 వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.

  31. 3 యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?

    4 వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.

  32. 2 గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.

  33. 15 అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను. 16 ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను. 17 కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది. 18 అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.

  34. 12 మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము. 13 మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు. 14 మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం.

  35. 5 హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.

  36. 12 తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.

  37. 1 కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది? 2 అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు. 3 లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.” 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.

    5 కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు.

  38. 5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.

  39. 23 ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.

  40. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  41. 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.

  42. 30 అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను.

  43. 34 ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.

  44. 4 అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.

  45. 11 నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి.

    12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?

    13 నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను,

    14 మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. 15 అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.

  46. 5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. 6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.

    7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.

  47. 9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు. 10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు.

  48. 25 అయితే హిజ్కియా గర్వించి తనకు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది.

  49. 2 అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు.

    3 యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.

    4 మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.

  50. 10 నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు.

    నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి.

    11 వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు.

    కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు.

    నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది.

  51. 49 “చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు. 50 వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను.

  52. 1 అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. 2 నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 3 నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!

    4 నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు. 5 నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.

    6 కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 7 నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు. 8 వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు. 9 నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు. 10 నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”

  53. 3 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు.

  54. 5 అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి!

  55. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  56. 7 ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది.

    అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి.

    ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను.

    సంతాపం చూడనే చూడను” అనుకుంది.

    8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి.

    దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.”

  57. 14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు. 15 ఆయన వారితో ఇలా అన్నాడు. “మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.

  58. 30 మేము గంటగంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకుని బతకడం ఎందుకు?

    31 సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, “నేను ప్రతి దినం చనిపోతున్నాను.”

  59. 13 సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. 14 ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.

    16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

    18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

    25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

  60. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  61. 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

  62. 5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.

  63. 11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. 13 మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

    14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

    15 బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. 16 చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. 17 అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

    18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే. 19 మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. 20 యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”

  64. 4 అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను.

    5 విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను.

    6 తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు.

  65. 6 యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.

  66. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  67. 25 గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.

  68. 11 మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు.

    మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు.

    ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.

    12 గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు.

  69. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  70. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

  71. 6 మీరు గర్వంతో మిడిసిపడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా! 7 మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది. 8 కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం.

  72. 11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. 12 మాకు మేమే మీ ఎదుట మళ్ళీ మెప్పించుకోవడం లేదు, హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయమై మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాము.

  73. 19 ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా! 20 నిజంగా మా మహిమా ఆనందమూ మీరే.

  74. 19 మీ బల గర్వాన్ని భంగపరచి, ఆకాశాన్ని ఇనుములాగా భూమిని ఇత్తడిలాగా చేస్తాను.

  75. 5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.

  76. 10 గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.

  77. 24 అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.

  78. 31 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “అహంకారీ, నేను నీకు విరోధంగా ఉన్నాను.

    నిన్ను శిక్షించే రోజూ, సమయమూ వచ్చాయి.

    32 అహంకారి తడబడి కింద పడతాడు. వాణ్ణి ఎవరూ పైకి లేపరు.

    నేను అతడి పట్టణాల్లో అగ్ని రాజేస్తాను. అతని చుట్టూ ఉన్నదాన్ని అది మింగి వేస్తుంది.”

  79. 8 నేను దాని కొమ్ములను కనిపెట్టి చూస్తుంటే ఒక చిన్న కొమ్ము వాటి మధ్య మొలిచింది. దానికి చోటు ఇవ్వడానికి ఆ కొమ్ముల్లో మూడింటిని పీకి వేశారు. ఈ కొమ్ముకు మనిషి కళ్ళ వంటి కళ్ళు, గర్వంగా మాటలాడే నోరు ఉన్నాయి.

  80. 21 నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు. 22 ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు. 23 అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.

  81. 16 ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.

  82. 7 మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా?

    8 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.” 9 నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.

    10 క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 11 ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు. 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.

    13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు.

  83. 1 నేను అతిశయించాలి, అయితే దాని వలన ప్రయోజనమేమీ రాదు. ప్రభువు దర్శనాలూ ప్రత్యక్షతలూ మీకు తెలియజేస్తాను.

  84. 17 ఈ మనుషులు నీళ్ళులేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటి వారు. గాడాంధకారం వీరి కోసం సిద్ధంగా ఉంది.

    18 వారు పనికిమాలిన గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వారు చెడు మార్గంలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని తమ శరీర సంబంధమైన చెడు కోరికలతో వెనుదిరిగేలా ప్రేరేపిస్తారు.

    19 వారే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు.

  85. 14 ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. 15 వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.” 16 వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.

  86. 14 “లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

    ఆమేన్‌ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే, 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

    18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

    20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు. 21 నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.

    22 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”