114 Bible Verses About Fools

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Fools
  1. 7 బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.

    8 వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

    9 మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.

    10 ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.

  2. ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన.

    1 దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు.

    2 వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు.

    3 ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు.

    4 యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా?

    5 వాళ్ళు భయంతో వణికిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుల సభతో ఉన్నాడు.

    6 యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు.

  3. 1 దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు.

    2 జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, 3 నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, 4 ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.

    5 తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.

    6 వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.

    7 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.

    8 కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.

    9 అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.

  4. 11 పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు.

    12 జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి.

    అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి.

    13 వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి,

    వెర్రితనంతో ముగుస్తాయి.

    14 ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు.

    మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు?

    15 మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు.

  5. 6 బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.

    7 మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.

  6. 10 బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం.

    11 తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం.

    12 తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.

  7. 19 కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.

    20 జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.

  8. 5 వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.

    6 మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం.

    7 అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.

  9. 15 మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు.

  10. 1 నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము చేసే పనులు దుర్మార్గమైనవని తెలుసుకోకుండా బుద్ధిహీనుల్లాగా బలులు అర్పించడం కంటే దానికి దగ్గరగా వెళ్లి మాటలు వినడం మంచిది.

    2 దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో.

    దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు,

    కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.

    3 విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి.

    ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు.

    4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు.

  11. 2 మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.

    3 దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి.

  12. 23 మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు.

    24 మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.

    25 సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు.

  13. 11 బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.

  14. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

    26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

    28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  15. 26 తన మనస్సులోని ఆలోచనలను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు.

  16. 20 జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది.

    21 జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది.

    22 “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?

  17. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

    8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.

    9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. 10 మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. 11 నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.

  18. 18 అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

    19 వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.

  19. 9 కోపించడానికి తొందరపడవద్దు.

    మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది.

  20. 18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. 19 దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది. 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.

    22 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23 అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. 24 అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25 ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.

    26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

    30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

  21. 28 అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను.

    29 జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది.

    30 వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు.

    31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు.

    32 ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది.

    33 నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”

  22. 1 పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది.

    కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది.

    2 జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది,

    మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది.

    3 మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు.

  23. ప్రధాన సంగీతకారుని కోసం. మహలతు రాగంలో దావీదు రాసిన దైవధ్యానం.

    1 దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.

  24. 3 కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.

  25. 8 జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

  26. 16 తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది. 17 అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. 18 నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను. 19 అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు. 20 అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు.

    21 దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు.

  27. 13 వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.

    14 జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.

  28. 24 వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి.

    25 బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు.

  29. 16 “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.

    17 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా? 18 అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.

    19 అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? 20 బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 21 అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.

    23 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.

    24 అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. 25 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.

    26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.

    27 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. 28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.

  30. 35 జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.

  31. 24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”

  32. 5 మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.

  33. 14 జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు.

    అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను.

    15 కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను

    అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే.

    16 బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు.

    బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.

  34. 17 బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.

  35. 2 జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.

  36. 5 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు.

  37. 8 అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.

    9 జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.

  38. 16 జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.

  39. 7 జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.

  40. 29 అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు.

  41. 9 బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు.

  42. 11 వీరికి బాధ! వీరు కయీను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు.

    12 వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు. 13 సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది.

    14 ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. 15 వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.” 16 వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.

  43. 18 యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.

    19 నీ పావురం ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగింపకు. బాధలు పొందే నీ ప్రజలను ఎన్నడూ మరువకు.

    20 నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.

    21 పీడితుణ్ణి అవమానంతో మరలనియ్యకు. బాధలు పొందినవారు, దరిద్రులు నీ నామాన్ని స్తుతిస్తారు గాక.

    22 దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.

  44. 1 బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప.

  45. 22 మూర్ఖుడిని గోదుమలలోబాటు రోకలితో దంచినా వాడి మూఢత వాణ్ణి వదలిపోదు.

  46. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

  47. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.

  48. 10 కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

  49. 16 మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు.

  50. 22 అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.

    23 వివేకం ఉన్నవాడు తన ప్రతిభను దాచిపెడతాడు. తెలివితక్కువ వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని బయట పెడతారు.

  51. 20 జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.

    21 బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.

  52. 28 మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.

  53. 1 ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.

  54. 6 మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడతాడు. అతడి హృదయం దుర్మార్గం గూర్చీ, దైవరహితమైన పనులను గూర్చీ ఆలోచిస్తుంది.

    అతడు యెహోవాను గూర్చి తప్పుగా మాట్లాడతాడు.

    అతడు ఆకలితో ఉన్నవాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు. దాహంతో ఉన్నవాళ్ళకి నీళ్ళు లేకుండా చేస్తాడు.

  55. 6 ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.”

    7 ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది.

    8 ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.

  56. 13 బుద్ధిహీనత అనే స్త్రీ గావుకేకలు పెట్టేది. ఆమె తెలివితక్కువది, చదువు లేనిది.

    14 ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. పట్టణ ప్రముఖ వీధుల్లో కుర్చీ వేసుకుని కూర్చుంటుంది.

    15 ఆ దారిలో వెళ్ళేవాళ్ళను, తమ దారిన తాము తిన్నగా వెళ్ళేవారిని చూసి, 16 “జ్ఞానం లేనివాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి” అని వాళ్ళను పిలుస్తుంది.

    17 తెలివి లేని ఒకడు వచ్చినప్పుడు వాణ్ణి చూసి “దొంగిలించిన నీళ్లు తియ్యగా ఉంటాయి. దొంగచాటుగా తిన్న తిండి రుచిగా ఉంటుంది” అని చెబుతుంది.

    18 అయితే చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారనీ, ఆమె ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా నరక కూపంలో పడిపోతారనీ వాళ్ళు తెలుసుకోలేరు.

  57. 6 పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.

    7 దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!

    8 అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.

    9 యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.

  58. 5 జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి.

  59. 6 బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

  60. 12 మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.

  61. 13 మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం.

    14 ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే.

  62. 20 తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.

  63. 17 మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.

  64. 22 నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.

  65. 8 వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.

  66. 18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ, 20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.

    21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.

  67. 10 క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం.

  68. 2 తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.

    3 మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.

  69. 5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.

  70. 5 యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.

    6 వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.

    7 వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.

    8 బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?

  71. 16 వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.

  72. 3 గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.

  73. 17 మరీ ఎక్కువ చెడ్డగా, మూర్ఖంగా ఉండవద్దు.

    నీ సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి?

  74. 39 అది చూసి ప్రభువిలా అన్నాడు, “పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది.

    40 అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా!

  75. 16 బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా?

  76. 20 విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు.

  77. 11 సోయను అధిపతులు బొత్తిగా మూర్ఖులు. ఫరో దగ్గర ఉన్న సలహాదారుల్లో అందరికన్నా జ్ఞాని అయిన వాడు ఇచ్చిన సలహా మతిలేనిదిగా కన్పిస్తుంది. ఫరోతో “నేను జ్ఞాని కొడుకును. నేను పూర్వ కాలంలోని రాజుల సంతతి వాణ్ణి” అని నువ్వు ఎలా చెప్తావు?

    12 నీ జ్ఞానులు ఎక్కడ ఉన్నారు? సేనల ప్రభువైన యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన ప్రణాళికను వాళ్ళని చెప్పనియ్యి.

    13 సోయను అధిపతులు మూర్ఖులయ్యారు. నోపు పట్టణ అధిపతులు మోసపోయారు. ఐగుప్తు జాతులకు మూల స్తంభాలుగా ఉన్న వీళ్ళు ఐగుప్తును తప్పుదారి పట్టించారు.

  78. 21 మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.

    22 యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా?

    నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను.

    దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.

    23 ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.

    24 వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా.

    నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.

    25 అవి క్రమంగా రాకుండా చేసింది మీ దోషాలే. మీకు మేలు కలగక పోవడానికి కారణం మీ పాపాలే.

  79. 7 కానీ ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు.

  80. 21 నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.

  81. 3 మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.

  82. 24 ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.

  83. 7 అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.

  84. 5 మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు.

  85. 10 వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.

  86. 1 జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.

  87. 9 మూర్ఖుని ఆలోచన పాప భూయిష్టం. అపహాసకులను మనుషులు చీదరించుకుంటారు.

  88. 8 బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం.

  89. 3 రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.

  90. 8 మూర్ఖుల కంటే జ్ఞానుల గొప్పతనం ఏమిటి?

    ఇతరుల ముందు ఎలా జీవించాలో తెలిసిన బీదవాడి గొప్పతనం ఏమిటి?

  91. 6 ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది.

    ఇది కూడా నిష్ప్రయోజనం.

  92. 11 కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.”

  93. 32 అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.

    34 “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. 35 కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. 36 ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!

  94. 17 ఆలోచనలు చెప్పేవాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేనివాళ్ళని ఆయన రుజువు చేస్తాడు.

  95. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  96. 29 తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు.

  97. 12 ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

  98. 15 తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.

  99. 33 తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.

  100. 14 తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.

  101. 22 తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.

  102. 21 బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు.

  103. 13 సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.

  104. 10 బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు.

  105. 7 మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు.

  106. 22 అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు,

  107. 19 వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే.

  108. 4 జ్ఞానులు తమ దృష్టిని దుఃఖంలో ఉన్నవారి ఇంటి మీద ఉంచుతారు.

    అయితే మూర్ఖుల ఆలోచనలన్నీ విందులు చేసుకొనే వారి ఇళ్ళపై ఉంటాయి.

  109. 5 మూర్ఖుణ్ణి ఇకమీదట గౌరవనీయుడని చెప్పరు. మోసగాణ్ణి నియమబద్ధమైన వ్యక్తి అని చెప్పరు.

  110. 19 “భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.

  111. 39 తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా?

  112. 46 నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు?

    47 “నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి. 48 వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది. 49 అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ ఇంటి నాశనం ఎంతో దయనీయం.”

  113. 24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.

    26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. 27 ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.

  114. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

    13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.