72 Bible Verses About Seeking God

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Seeking God
  1. 4 యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను.

    5 ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు.

    6 అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను.

    7 యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు.

    8 ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను.

  2. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు. 14 అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’

  3. 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  4. 1 ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.

    2 ఇశ్రాయేలు కన్య కూలిపోయింది.

    ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు.

    లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.

    3 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,

    “ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.

    వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”

    4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “నన్ను వెతికి జీవించండి.

    5 బేతేలును ఆశ్రయించవద్దు.

    గిల్గాలులో అడుగు పెట్టవద్దు.

    బెయేర్షెబాకు పోవద్దు.

    గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు.

    బేతేలుకు ఇక దుఖమే.”

    6 యెహోవాను ఆశ్రయించి జీవించండి.

    లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు.

    అది దహించి వేస్తుంది.

    బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.

  5. 3 ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.

    4 యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.

  6. 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.

    7 భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి.

    వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.

    8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.

    9 “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

  7. 10 ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి.

    యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.

    11 యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి.

    ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.

  8. 1 విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం. 2 మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు. 3 విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.

    4 విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.

    5 విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. “దేవుడు తీసుకువెళ్ళాడు కనుక అతడు కనిపించలేదు.” దేవుడు తీసుకువెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.

    7 విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.

    8 దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. 9 విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.

    10 ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. 11 విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది.

    12 అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు.

    13 వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు. 14 ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. 15 ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. 16 కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు.

  9. 27 అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు. 28 అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. 29 అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.

    30 ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు 31 మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.

  10. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

    12 “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే. 13 ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. 14 జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.

  11. 12 మీ కోసం నీతి విత్తనం వేయండి.

    నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి.

    ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి.

    ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ,

    యెహోవాను వెదకడానికి ఇదే అదను.

  12. 17 దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు. 18 అతడు వారితో “మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా? మీ సరిహద్డులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా? దేశనివాసులను ఆయన నా వశం చేశాడు. యెహోవా భయం వల్ల, ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయింది.

    19 కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి” అన్నాడు.

  13. 2 వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు.

    3 ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు.

  14. 1 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడు దర్యావేషు కల్దీయులపై రాజయ్యాడు. 2 అతని పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలు అనే నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయాకు ఇచ్చిన వాక్కు రాసి ఉన్న గ్రంథాలు చదువుతున్నాను. యెరూషలేము విడిచిపెట్టబడిన స్థితిలో ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి కావచ్చాయని గ్రహించాను.

    3 అప్పుడు నేను గోనెపట్ట కట్టుకుని, ఉపవాసముండి, ధూళిలో కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన దేవుని వైపుకు నా ముఖం తిప్పుకున్నాను.

    4 నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి మా పాపాలు ఒప్పుకున్నాను. “ప్రభూ, మహాత్మ్యం, మహా శక్తి గల దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి పట్ల నీ నిబంధనను నీ కృపను నీవు జ్ఞాపకం చేసుకుంటావు.

  15. 8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.

    9 యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.

    10 సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.

  16. 22 తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు. 23 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. 25 పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? 26 కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.

    28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.

    32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.

  17. 24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.

    26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,

  18. 4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

    5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.

  19. 2 ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.

    3 వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.

  20. 9 సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.

  21. 10 దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే,

    “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.

    11 గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.

    12 అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు.

    మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.

  22. 21 అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను. 22 ఆయన్ను వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గానీ, ఆయనను తిరస్కరించే వారి పైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకొంటుందని మేము రాజుతో చెప్పాం. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది.

    23 ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు.

  23. 1 సిగ్గుమాలిన ప్రజలారా, రండి. గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతోంది.

    2 విధి నిర్ణయం కాకమునుపే,

    యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే,

    మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి. 3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి.

    మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.

  24. 5 నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో.

    6 నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు.

  25. 17 నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.

  26. 21 కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

    22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

    25 తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

    26 యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.

  27. 4 దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.

  28. దావీదు కీర్తన.

    1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.

    2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

    3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

    5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

    6 ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. సెలా.

  29. 32 దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.

  30. 1 ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కొడుకైన అజర్యా మీదికి వచ్చినపుడు అతడు ఆసా ముందుకు వెళ్లి ఈ విధంగా ప్రకటించాడు. 2 “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. 3 చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి.

    4 అయితే తమ బాధల్లో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన్ని వెదకారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు.

  31. 12 వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో తమ పూర్వీకుల దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేస్తామనీ, 13 పిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, అందరిలో ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దగ్గర విచారణ చేయని వారికందరికీ మరణశిక్ష విధిస్తామనీ తీర్మానం చేసుకున్నారు. 14 వారు పెద్దగా కేకలు వేస్తూ మేళాలతో, బాకా నాదంతో, కొమ్ము బూరశబ్దాలతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు.

    15 ఈ విధంగా ప్రమాణం చేసుకోగా యూదావారంతా సంతోషించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి, పూర్ణమనస్సుతో ఆయనను వెతకడం వలన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం లేకుండా వారికి శాంతినిచ్చాడు.

  32. 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.

  33. 18 ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు, 19 “పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.” 20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.

  34. 2 ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు. 3 అన్యదేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పాడుచేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతాస్తంభాలను కొట్టి వేయించాడు. 4 వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలనీ ధర్మశాస్త్రాన్నీ, ఆజ్ఞలనూ పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు. 5 ఉన్నత స్థలాలనూ సూర్య దేవతా స్తంభాలనూ యూదా వారి పట్టాణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది.

    6 ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాలను కట్టించాడు.

    7 అతడు యూదా వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు “మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.”

    కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు.

  35. 10 యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.

  36. 5 దుష్టులు న్యాయమేదో గ్రహించరు. యెహోవాను ఆశ్రయించే వారికి అన్నీ తెలుసు.

  37. 9 అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది. 10 అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను.

    11 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? 12 గుడ్డు అడిగితే తేలునిస్తాడా? 13 కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.

  38. 16 ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్నవారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేముకు వచ్చారు.

  39. 3 యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ 4 బయలు దేవుళ్ళను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి, ఇశ్రాయేలువారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు. 5 కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది. 6 యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుని, ఉన్నత స్థలాలనూ దేవతా స్తంభాలనూ యూదాలో నుండి తీసివేశాడు.

  40. 44 “పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.

    45 “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. 46 అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.

  41. 10 నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

  42. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

    26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

    28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  43. 4 నిన్ను వెతికే వారంతా నీలో ఆనందించి సంతోషిస్తారు గాక. నీ రక్షణను ప్రేమించే వారంతా దేవునికే మహిమ కలగాలి అని ఎప్పుడూ చెప్పుకుంటారు గాక.

    5 నేను పేదవాణ్ణి. అక్కరలో ఉన్నవాణ్ణి. నన్ను రక్షించడానికి వేగమే రా. నాకు సహాయం నువ్వే. నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయవద్దు.

  44. 16 నీ కోసం చూసే వాళ్ళంతా నీలో సంతోషించి, ఆనందిస్తారు గాక! నీ రక్షణను ప్రేమించే వాళ్ళంతా “యెహోవాకు స్తుతి” అని చెబుతారు గాక!

  45. 5 దేవుని మాట వినేలా సలహాలిచ్చిన జెకర్యా రోజుల్లో ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లజేశాడు.

  46. 8 అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.

    9 ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.

  47. 1 “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా

    సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ,

    అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ!

  48. 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు.

  49. 26 బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.

  50. 4 “నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి,

    బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.

    5 మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను,

    యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.

    6 యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”

  51. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.

  52. 45 నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.

  53. 30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  54. 4 ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు.

    5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.

  55. 1 సైన్యాలకు అధిపతియైన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నా దూతను పంపుతున్నాను. అతడు నాకు ముందుగా దారి సిద్ధం చేస్తాడు. ఆ తరువాత మీరు వెతుకుతూ ఉన్న ఆ ప్రభువు, అంటే మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఆయన వస్తున్నాడు.

  56. 1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

    2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?

    5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.

    11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.

  57. 1 అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.

    2 “అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను.

    రక్షణ దినాన మీకు సాయం చేశాను,”

    అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.

  58. 21 దేవుని మందిర సేవకోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెతికి అనుసరించాడు. హృదయపూర్వకంగా అనులు జరిగించాడు గనక వర్ధిల్లాడు.

  59. 8 న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము.

    నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి.

    9 రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను.

    నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు.

  60. 7 తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా? 8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”

    9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  61. 6 మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు, 7 ఎవరైనా సరే, భూమి ఈ చివరి నుండి ఆ చివర వరకూ మీకు దగ్గరైనా, దూరమైనా, మీరు, మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే 8 వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారి మీద దయ చూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి. 9 వారిని చంపడానికి ప్రజలందరి కంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి. 10 రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.

  62. 5 యెహోషాపాతు “ముందు యెహోవా ఇష్టాన్ని తెలుసుకుందాం” అన్నాడు.

  63. 1 ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. 2 అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్‌ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.

    3 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. 4 యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.

  64. 1 యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు. 3 తన పాలన 8 వ సంవత్సరంలో తానింకా బాలుడుగా ఉండగానే అతడు తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. తన 12 వ ఏట అతడు ఉన్నత పూజాస్థలాలనూ అషేరా దేవతాస్తంభాలనూ పడగొట్టి, చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ తీసివేసి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేయడం మొదలు పెట్టాడు.

    4 అతడు చూస్తుండగానే ప్రజలు బయలు దేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూప వేదికలను నరికివేశారు. అషేరా దేవత స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలనూ, పోతవిగ్రహాలనూ పగలగొట్టి పొడి చేసేశారు. వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు. 5 ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేశాడు.

    6 అలాగే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టు పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు. 7 అతడు బలిపీఠాలనూ అషేరా దేవత స్తంభాలనూ పడగొట్టి చెక్కిన విగ్రహాలను పొడి చేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న ధూపవేదికలను నరికి వేసి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

  65. 19 వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా?

    బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?

  66. 8 “కాబట్టి మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి, మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి.

  67. 94 నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.

  68. 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

    18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

    20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు.

  69. 13 సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. 14 మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

  70. 155 భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.

  71. 22 “శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది. 23 నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!

    24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

  72. 44 తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను.