99 Bible Verses About God's Promises

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Promises
  1. 1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు. 2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!

    3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

  2. 18 అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం. 19 నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు. 20 దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.

    21 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి 22 మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.

  3. 23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.

  4. 1 దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, వారు దైవ భక్తికి అనుగుణమైన సత్యం గురించిన ఎరుకలో నిలకడగా ఉండేలా, 2 అబద్ధమాడలేని దేవుడు కాలానికి ముందే వాగ్దానం చేసిన శాశ్వత జీవం గురించిన నిశ్చయతలో పౌలు అనే నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపొస్తలుణ్ణి. 3 సరైన సమయంలో ఆయన ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించిన సందేశం వలన తన వాక్కును వెల్లడి చేశాడు.

  5. 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు. 14 “నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు. 15 ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.

    16 సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

    18 అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు. 19 ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది. 20 మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.

  6. 29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  7. 13 అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది. 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది. 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.

    16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి. 18 అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు. 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. 20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. 21 దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. 22 అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. 23 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు, 24 మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనలను కూడా నీతిమంతులుగా ఎంచడానికి మన కోసం కూడా రాసి ఉంది. 25 ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.

  8. 56 “తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.

  9. 12 అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే 13 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.

    14 ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు. 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు. 16 మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”

  10. 1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”

  11. ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం.

    1 యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.

    2 నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.

    3 నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.

    4 శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా.

  12. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.

  13. 14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో, 15 అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి.

    16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

  14. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

  15. 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.

    14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.

  16. 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.

    32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.

    33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  17. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.

  18. 6 ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.

  19. 1 విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం. 2 మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు. 3 విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.

    4 విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.

    5 విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. “దేవుడు తీసుకువెళ్ళాడు కనుక అతడు కనిపించలేదు.” దేవుడు తీసుకువెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.

    7 విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.

    8 దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. 9 విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.

    10 ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. 11 విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది.

    12 అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు.

    13 వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు. 14 ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. 15 ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. 16 కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు.

    17 విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. 18 “ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు. 19 దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.

    20 విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు. 21 విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు.

    22 విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు.

    23 విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు.

    24 విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు. 25 కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు. 26 ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు.

    27 విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు. 28 విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు.

    29 విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది.

    30 విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి.

    31 విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు.

    32 ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు.

    33 విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.

    34 అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు.

    35 స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు.

    36 ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు.

    37 వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు.

    38 అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. 39 వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. 40 మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.

  20. 24 మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలో అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు. 25 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు.

  21. 12 నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. 13 అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను. 14 అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.

    15 అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను. 16 నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”

  22. 1 ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.

  23. 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.

  24. 13 మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది. 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  25. 1 క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.

  26. 22 దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా? 23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.

    24 ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. 25 ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.

    27 “గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు.

    ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.

    ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.

    28 సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు. 29 అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది. 30 అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.” 31 అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.

  27. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

  28. 1 అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు.

    2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. “నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు. నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు. 3 ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.

    4 నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. 5 ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు” అని అతనికి చెప్పాడు.

  29. 43 యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు. 44 యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు. 45 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.

  30. 2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

  31. 4 ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5 యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”

  32. 29 ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. 30 అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు. 31 ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు. 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”

    33 “‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’

    అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది. 34 ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా,

    ‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’

    అని చెప్పాడు.

  33. 35 కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.

    37 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు.

    ఆయన ఆలస్యం చేయడు.

    38 నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు.

    అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.”

    39 అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కానీ ఆత్మను కాపాడుకోడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.

  34. 12 అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13 యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

    14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.

  35. 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

    మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

    ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

    ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

  36. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  37. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

    11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.

    నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు

    12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.

    నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.

  38. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.

  39. 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

  40. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

  41. 5 నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?

  42. 6 మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. 7 అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా. 8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

    9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి. 10 ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు. 11 కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి.

  43. 6 అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణను బట్టి నన్నిక్కడ విమర్శకు గురి చేస్తూ నిలబెట్టారు. 7 మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.

  44. 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.

  45. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.

    5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు.

  46. 1 ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను. 2 పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.

    3 ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు. 4 “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.

  47. 8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

  48. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

  49. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  50. 25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.

  51. 1 అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి.

  52. 45 ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.

  53. 12 తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. 13 వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.

  54. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  55. 31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? 33 దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. 34 ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.

    35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  56. 11 అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు. 12 మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు.

    13 ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే 14 ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి!

    15 ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకంటే, మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు ఆయన వాగ్దానం చేసిన తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది.

  57. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.

  58. 7 యెహోవా అబ్రాముతో “నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.

  59. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

  60. 8 ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా?

  61. 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  62. 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.

  63. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  64. 24 మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు. 25 సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి. 26 పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి. 27 సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను. 28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!

  65. 11 “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.

    12 కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం.

    ఆయన ఎవరో మనకు తెలియదు అంటే

    ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.

    13 ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి,

    మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,”

    అనే మాటలు నమ్మదగినవి.

  66. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.

  67. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

    18 దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు.

  68. 8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.

  69. 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  70. 9 అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది. 10 అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను.

    11 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? 12 గుడ్డు అడిగితే తేలునిస్తాడా? 13 కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.

  71. 36 కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”

  72. 13 “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. 14 మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

    16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17 ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18 నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను.

  73. 11 కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.

  74. 8 తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,

    9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

    10 వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,

    11 కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.

  75. 3 తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.

  76. 67 అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,

    68 “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.

    ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.

    69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.

    70-73 మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు.

    దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.

    ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను,

    అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు.

    74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది,

    పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో,

    పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ,

    భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే,

    మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.

    76-78 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు.

    మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి,

    వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా,

    ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.

    79 మన పాదాలను శాంతి మార్గంలో

    నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది.

    ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”

  77. 49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.

  78. 36 కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు.

  79. 17 అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.

  80. 4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

  81. 5 జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.

  82. 15 యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు 16 “నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. 17 నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.

    18 నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”

  83. 14 మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు.

  84. 10 అప్పుడు యెహోవా మోషేతో “యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు, 11 వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.

    12 కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను. 13 అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు” అన్నాడు.

  85. 4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సోదరులకు వాగ్దానం చేసిన ప్రకారం వారికి నెమ్మది కలగజేశాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడు మోషే, యొర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలోని మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి.

  86. 35 అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది

    36 చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.

  87. 18 యెహోవా ఇలా అంటున్నాడు.

    “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”

    “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,

    అవి మంచులా తెల్లగా అవుతాయి.

    కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

  88. 24 అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.

  89. 25 మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.

    26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27 అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు.

    28 “దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29 అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.

  90. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.

  91. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  92. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

  93. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  94. 17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు.

  95. 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు.

  96. 3 అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.

  97. 12 నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను.

    వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”

  98. 25 మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?

    26 ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.” 27 “మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది. 28 కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం. 29 ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.

  99. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.