108 Bible Verses About Praising God

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Praising God
  1. 1 యెహోవాను కీర్తించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన ప్రభావాన్ని గొప్పచేసే ఆకాశవిశాలాల్లో ఆయనను స్తుతించండి.

    2 ఆయన బలమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయనకున్న గొప్ప బలప్రభావాలను బట్టి ఆయనను స్తుతించండి.

    3 బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి.

    4 తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.

    5 తాళాలు మోగిస్తూ ఆయనను స్తుతించండి. గంభీరమైన ధ్వనులు చేసే తాళాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి.

    6 ప్రాణం ఉన్న ప్రతి జీవీ యెహోవాను స్తుతిస్తుంది గాక. యెహోవాను కీర్తించండి.

  2. దావీదు కీర్తన.

    1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

    2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

    3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

    4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

    5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.

  3. 15 యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  4. అబీమెలెకు సమక్షంలో పిచ్చివాడిలాగా నటించినప్పుడు అతడు దావీదును వెళ్ళగొట్టగా దావీదు రాసిన కీర్తన.

    1 అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది.

    2 నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!

    3 నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.

    4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

  5. 6 ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. 7 మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.

    8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

    9 ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  6. 6 యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!

    7 యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.

  7. 3 నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.

    4 నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.

    5 కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.

    6 రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.

  8. కృతజ్ఞత కీర్తన.

    1 ప్రపంచ ప్రజలారా, యెహోవాకు సంతోషంతో కేకలు వేయండి.

    2 ఆనందంగా యెహోవాకు సేవ చేయండి, ఆనంద గీతాలు పాడుతూ ఆయన సన్నిధికి రండి.

    3 యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించాడు. మనం ఆయన వాళ్ళం. మనం ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలం.

    4 కృతజ్ఞతతో ఆయన ద్వారాలగుండా ప్రవేశించండి. స్తుతులతో ఆయన ఆవరణాల్లోకి రండి. ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. ఆయన నామాన్ని పొగడండి.

    5 యెహోవా మంచివాడు. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయన విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది.

  9. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.

  10. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

    21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.

  11. 1 యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.

    2 ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.

    3 సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.

    4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.

    5 అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.

  12. 22 అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. 23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.

    25 మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.

  13. 14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  14. 1 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.

    2 యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.

    3 రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.

    4 యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి.

    5 జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా.

    6 ఘనతాప్రభావాలు ఆయన ముందున్నాయి. బలం, సౌందర్యం ఆయన పవిత్ర ఆలయంలో ఉన్నాయి.

    7 ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ యెహోవాకు చెల్లించండి. మహిమ, బలం యెహోవాకు చెల్లించండి.

    8 యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి.

    9 పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి.

  15. 1 యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించండి.

    2 యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలబడే వాళ్ళంతా యెహోవాను స్తుతించండి.

    3 యెహోవా మంచి వాడు. ఆయనను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించడం అత్యంత మనోహరం!

    4 యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజను తన ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.

  16. 3 రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు.

    4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి,

    “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

    5 అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు,

    గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.

    6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.

    “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”

    7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.

    పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.

    కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.

    ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

  17. 33 భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు.

    వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి.

    34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.

    ఆయనను స్తుతించండి.

    35 దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు.

    మమ్మల్ని సమకూర్చు.

    36 మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా

    నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా

    అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు

    అని ఆయన్ను బతిమాలుకోండి.

    ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా

    యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక.

    ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.

  18. 5 అప్పుడు లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా, అనే వాళ్ళు నిలబడి “సదాకాలం మీకు దేవుడుగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని కేకలు వేసి, ఈ విధంగా స్తుతులు చెల్లించారు. “సకల ఆశీర్వాదాలకు, ఘనతలకు మించిన నీ పవిత్రమైన నామానికి స్తుతులు. 6 ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

    7 దేవా, యెహోవా, అబ్రామును ఎన్నిక చేసుకుని, కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుండి అతణ్ణి బయటకు రప్పించి అతనికి అబ్రాహాము అనే పేరు పెట్టినవాడివి నువ్వే. 8 అతడు నమ్మకమైన మనస్సు గలవాడు గనక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనే వాళ్ళ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశావు.

  19. 1 నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.

    2 వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.

    3 ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.

    4 ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.

    5 ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.

  20. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.

    2 ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.

    3 సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.

  21. దావీదు రాసిన స్తుతి కీర్తన

    1 నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను.

    2 అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను.

    3 యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.

    4 ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు.

  22. 15 ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది.

  23. 1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.

  24. 10 అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను. 11 దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 12 మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు. 13 ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి,

    14 “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ.

    ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!”

    అంటూ దేవుణ్ణి స్తుతించారు.

  25. 30 దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.

    31 ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.

  26. 33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

    34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

    35 పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

  27. 1 యెహోవా, నీవే నా దేవుడివి. నేను నిన్ను ఘన పరుస్తాను. నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు అద్భుతాలు చేశావు. సత్య స్వభావాన్ననుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చావు.

  28. 1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.

    2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.

    3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

    6 రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.

    7 ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!

  29. 9 ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.

    11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. 12 వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.

    13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను.

    14 ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.

  30. ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన.

    1 యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.

    2 యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.

    3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు.

    4 యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

    5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

  31. 5 నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.

    6 నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.

    7 నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.

    8 నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.

  32. 8 ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.

    9 ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.

    10 నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.

    11 యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.

    12 ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.

    13 నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు.

  33. 1 యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.

    2 యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.

    3 ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

    4 ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.

    5 తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.

  34. 9 చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

  35. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.

    2 యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?

  36. 8 ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

  37. 10 సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.

    భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.

    11 ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి.

    సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు.

    12 ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు.

  38. 68 “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.

    ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.

    69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.

  39. 9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. 10 వీరంతా కలసి,

    “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది”

    అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.

    11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

    12 “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

  40. దావీదు కీర్తన.

    1 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!

    2 యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.

  41. ప్రధాన సంగీతకారుని కోసం

    1 సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.

    2 ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.

    3 నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

    4 లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.

  42. దావీదు కీర్తన

    1 నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.

    2 నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.

  43. 1 యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది.

  44. 37 ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. 38 “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.

  45. ప్రధాన సంగీతకారుడి కోసం. దావీదు కీర్తన

    1 యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు.

    2 భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు.

    3 తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు.

  46. 4 లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి.

    5 తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి.

    6 బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.

  47. 3 వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.

    లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.

  48. 19 ఆ రాత్రి సమయంలో దానియేలుకు దర్శనంలో ఆ కల, కల అర్థం వెల్లడైనాయి. దీన్నిబట్టి దానియేలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు, 20 “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు. 21 ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే, 22 ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. 23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.”

  49. 2 తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరునూ సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.

    3 వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ,

    “ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు.

    సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.

    4 ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?

    నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”

  50. 9 వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.

    10 రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే. 13 మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.

  51. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.

    1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.

    2 మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.

  52. 13 యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.

  53. 3 నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు.

  54. 28 అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.

  55. 7 నా హృదయం నిశ్చింతగా ఉంది. దేవా, నా హృదయం నిశ్చింతగా ఉంది. నేను పాడతాను, అవును, నేను స్తుతిగానం చేస్తాను.

    8 నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను.

    9 ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.

    10 ఎందుకంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, నీ సత్యం మేఘమండలం వరకూ వ్యాపించి ఉంది.

    11 దేవా, ఆకాశం కంటే ఉన్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం ఈ భూమి అంతటి మీదా ఉన్నతంగా కనిపిస్తుంది గాక.

  56. 19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.

    20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.

    21 యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.

    22 యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

  57. 47 యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.

    48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్‌ అందురు గాక. యెహోవాను స్తుతించండి.

  58. 23 సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి

    ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి.

    24 అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి.

    సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.

    25 యెహోవా మహా ఘనత వహించినవాడు.

    ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు.

    సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు.

    26 జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే.

    యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.

    27 ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి.

    బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి.

    28 జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి.

    మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి.

    29 యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి.

    నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి.

    పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని

    ఆయన ముందు సాగిలపడండి.

  59. విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన.

    1 యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.

    2 ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

    3 పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.

  60. 20 అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. ఎందుకంటే నేను ఏర్పరచుకొన్న ప్రజలు తాగటానికి అరణ్యంలో నీళ్ళు పుట్టిస్తున్నాను. ఎడారిలో నదులు పారజేస్తాను.

    21 నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు నా గొప్పతనాన్ని ప్రచురిస్తారు.

  61. 10 పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు

    ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు.

    యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.

    11 భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా

    రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.

  62. 11 సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.’ స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,” అని యెహోవా అంటున్నాడు.

  63. 34 ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.

    35 భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. 36 ఆ సమయంలో నాకు మళ్ళీ బుద్ది వచ్చింది. నా రాజ్యానికి గత వైభవం కలిగేలా ముందున్న ఘనత, ప్రభావాలు నాకు మళ్ళీ చేకూరాయి. నా మంత్రులు, నా క్రింది అధికారులు నా దగ్గరికి వచ్చి సమాలోచనలు జరిపారు. నా రాజ్యంపై అధికారం నాకు స్థిరపడింది. గతంలో కంటే అధికమైన ఘనత నాకు దక్కింది.

    37 ఈ విధంగా నెబుకద్నెజరు అనే నేను, పరలోకపు రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన జరిగించే కార్యాలన్నీ సత్యం, ఆయన నడిపించే విధానాలు న్యాయం. ఆయన గర్వంతో ప్రవర్తించే వాళ్ళను అణిచివేసే శక్తి గలవాడు.

  64. 52 వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53 దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.

  65. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  66. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.

  67. 24 మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. 25 ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

  68. 21 ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

  69. 4 స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను.

    నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.

  70. 46 యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక.

    47 ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.

    48 ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు.

  71. 22 నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను.

    23 యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి.

  72. 16 నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.

    17 దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.

  73. 5 మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పాదపీఠం ముందర ఆరాధించండి. ఆయన పవిత్రుడు.

    6 ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళలో సమూయేలు ఉన్నాడు. వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చాడు.

    7 మేఘస్తంభంలో నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఆయన శాసనాలను పాటించారు. ఆయన తమకిచ్చిన కట్టడను అనుసరించారు.

    8 యెహోవా మా దేవా, నువ్వు వాళ్లకు జవాబిచ్చావు. వాళ్ళ అక్రమ కార్యాలకు వాళ్ళను శిక్షించినా, నువ్వు వాళ్ళను క్షమించిన దేవుడివి.

    9 మన యెహోవా దేవుడు పవిత్రుడు, మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతం ఎదుట ఆరాధించండి.

  74. 1 యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

    2 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక.

    3 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక.

    4 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.

  75. 1 యెహోవాను స్తుతించండి. యెహోవాకు నూతన గీతం పాడండి. భక్తులు సమకూడే ప్రతిచోటా ఆయనకు స్తుతి గీతాలు పాడండి.

  76. 19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  77. 13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.

  78. 20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.

  79. 56 “తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.

  80. 13 వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది” అని స్తోత్రం చేశారు.

    14 అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేక పోయారు.

  81. 21 అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.

  82. 10 రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. 11 వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.

  83. 2 యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.

    3 స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను.

  84. 6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి.

    7 ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి.

    8 దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.

  85. 14 నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.

    15 నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.

  86. ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం.

    1 యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.

  87. 14 శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు.

    15 దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.

  88. 33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.

    34 “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు?

    ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?

    35 ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”

    36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  89. 11 పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?

  90. 10 యిత్రో “ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగు గాక.

  91. 6 ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.

  92. 17 యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.

  93. 13 యెహోవా, నా మీద దయ చూపించు. నన్ను ద్వేషించేవాళ్ళు నన్ను ఎలా పీడిస్తున్నారో చూడు. మరణద్వారం నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నువ్వే.

    14 నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను!

  94. 1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.

    2 ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

    3 ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.

    4 యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.

    5 ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.

  95. 21 నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక.

  96. 21 “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.

    24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”

  97. 1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు. 2 నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. 3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.

    4 నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను.

  98. 11 “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”

  99. 1 అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ,

    సముద్రంలో ముంచి వేశాడు.

    గొప్ప విజయం సాధించాడు.

    2 యెహోవాయే నా బలం, నా గానం,

    నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను.

    ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను.

  100. 50 కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.

  101. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన.

    1 జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి.

  102. 8 జనాల్లారా, మా దేవుణ్ణి సన్నుతించండి. స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి.

  103. 1 యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి.

  104. 164 నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.

  105. 19 ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి.

    20 లేవి వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ళంతా యెహోవాను కీర్తించండి.

    21 యెరూషలేములో నివసించే యెహోవాకు సీయోనులో స్తుతి కలుగు గాక. యెహోవాను స్తుతించండి.

  106. 1 యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు.

    2 నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను.

  107. 31 యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు. 32 దేవుడు ఆయనలో మహిమ పరచబడినట్టయితే, తనలో ఆయనను మహిమ పరుస్తాడు. వెంటనే ఆయనను మహిమ పరుస్తాడు.

  108. 11 ఈ కారణం చేత మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననూ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాము. 12 తద్వారా మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రసాదించే కృప మూలంగా మీలో మన ప్రభువైన యేసు నామం మహిమ పొందుతుంది. మీరు ఆయనలో మహిమ పొందుతారు.