42 Bible Verses About Nature
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.
28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.
-
18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.
21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.
-
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన.
1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!
2 రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.
-
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. గిత్తీత్ రాగం.
1 యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!
2 శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.
3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,
4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
5 అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.
6 నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు.
7 గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,
8 ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.
-
15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.
18 సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.
-
5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.
7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.
11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
-
19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. 23 అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.
-
10 యెహోవా పరిపాలిస్తున్నాడు. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన ప్రజలకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని రాజ్యాల్లో చెప్పండి.
11 యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక.
12 మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక.
అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక
13 లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
-
4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి, 5 భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. 6 కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి.
7 దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. 8 దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.
9 దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
-
7 అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి.
8 భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి.
9 యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు?
10 జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.
-
26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
-
1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
-
9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
-
17 అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి వేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటు కట్టి, ఒలీవ చెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే, 18 నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు. 19 అందుకు, “ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటు కట్టడానికే” అని నీవు చెప్పవచ్చు. 20 నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు. 21 ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా!
22 కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు. 23 అంతేకాక, వారు తమ అవిశ్వాసంలో కొనసాగకుండా వెనక్కి తిరిగితే వారిని తిరిగి అంటు కడతాడు. దేవుడు వారిని మళ్ళీ అంటు కట్టడానికి సమర్ధుడు. 24 ఎలాగంటే, నిన్ను ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కోసి, అసహజంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టగలిగిన వాడు సహజమైన కొమ్మలను మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టుకు అంటుకట్టగలడు కదా!
-
6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.
-
35 అయితే “చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాటి శరీరంతో వస్తారు?” అని ఒకడు అడుగుతాడు. 36 బుద్ధి హీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా, తిరిగి బతికేది! 37 నీవు పాతినది గోదుమ గింజైనా, మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతిపెడుతున్నావు గాని పైకి మొలిచే శరీరాన్ని కాదు. 38 దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. 39 అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. 40 ఆకాశంలో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు. 41 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా.
42 చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. 43 ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది. 44 ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. 45 దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. 46 మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. 47 మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. 48 మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. 49 మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.
-
29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.
-
24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,
28 మనం ఆయనలో బతుకుతున్నాం,
ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.
‘మనమాయన సంతానం,’
అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.
-
1 పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. 2 ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
4 దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.
-
15 దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.
-
14 పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు
15 అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.
16 యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.
17 అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.
18 ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.
-
26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?
27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
-
10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.
11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. 12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.
14 సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు.
-
1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. 2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు. 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?
4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా
-
6 యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు. 7 మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
8 ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు. 9 అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.
10 అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది. 11 అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.
-
12 ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. 13 ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు. 15 అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది. 16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.
-
14 పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా?
-
16 దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.
-
11 నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు.
12 దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, 13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.
14 భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. 15 అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.
16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు.
-
3 సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.
4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.
5 అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.
-
3 దేశం కేవలం వట్టిదిగా అయి పోతుంది. అది కేవలం కొల్లసొమ్ము అవుతుంది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.
4 దేశం వ్యాకులం చేత వాడిపోతున్నది. లోకంలోని గొప్పవారు క్షీణించి పోతున్నారు.
5 లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.
6 శాపం దేశాన్ని నాశనం చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిమందే ఉన్నారు.
-
8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.
9 “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.
10 వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి.
దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి.
అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.
11 ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు.
అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
12 మీరు సంతోషంగా వెళతారు. సమాధానంగా మిమ్మల్ని తీసుకు పోతారు.
మీ ముందు పర్వతాలు, కొండలు, సంతోషంగా కేకలు వేస్తాయి. మైదానాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.
13 ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి.
ఆ విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.”
-
44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.
45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు.
-
14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మనకు తెలుసు. అయితే నేను పాపానికి అమ్ముడుబోయిన శరీర సంబంధిని.
15 ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను దేనిని ఇష్టపడతానో దాన్ని కాక దేన్ని ద్వేషిస్తానో దానినే చేస్తున్నాను. 16 నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. 17 కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. 18 నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. 19 నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. 20 నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.
22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.
-
5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. 6 తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.
-
25 మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి,
26 చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి,
27 వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు?
28 వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?
29 మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు?
30 జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది.
-
24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.
25 అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.
-
5 వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.
-
6 వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది.
“నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది.
7 యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే.
8 గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.”
-
13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
-
22 మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, “సరస్సు అవతలి వైపుకు వెళ్దాం” అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు. 23 వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. 24 కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. 25 అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
-
6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ.
Shows Read in context, Share and Copy.