84 Bible Verses About Growing in Faith
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
7 అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి. 8 దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది. 9 “ఆరోహణమయ్యాడు” అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా. 10 అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
-
1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2 అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3 కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.
4 మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి. 5 ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.
6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది,
“నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను.
అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.
ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”
7 కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి,
“ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.”
8 అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది.
వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.
-
11 దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం. 12 ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు. 13 కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేని వాడుగా ఉన్నాడు. 14 దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
-
14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి. 15 మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు. 16 అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
17 కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.
-
1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు. 2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.
5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు. 10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు. 11 దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది.
-
2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.
5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8 అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.
-
16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.
-
16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
-
1 కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ, 2 బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. 3 ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం.
4-5 తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. 6 ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.
7 ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. 8 అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది.
9 ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం. 10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.
11 మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12 మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
-
1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
-
4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
-
5 నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నా ఆత్మలో మీతోనే ఉన్నాను. మంచి క్రమంలో సాగే మీ ప్రవర్తననూ, క్రీస్తుపై మీకున్న బలమైన విశ్వాసాన్నీ చూసి సంతోషిస్తున్నాను.
6 మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి. 7 ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి. ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి. మీకు బోధించిన రీతిగానే విశ్వాసంలో వేరు పారి ఉండండి. కృతజ్ఞతలు చెల్లించడంలో పొంగిపొరలుతూ ఉండండి.
-
1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
-
2 తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృపాసమాధానాలు మీకు కలుగు గాక.
3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది.
-
4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది.
-
9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.
12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13 ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.
-
18 అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు. 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. 20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. 21 దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. 22 అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు.
-
8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.
-
28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.
-
12 వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. 13 సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను. 14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.
15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
-
10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.
-
22 వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 23 ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. 24 అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. 25 కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.
-
12 ప్రియమైన చిన్నపిల్లలారా! క్రీస్తు నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.
13 తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.
14 చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను.
తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను.
యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.
15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.
-
22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. 23 అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. 24 ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? 25 మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
-
3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.
4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. 6 రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.
7 నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. 8 మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. 9 మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు.
-
ప్రథమ పరిచ్ఛేదము
1 దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.
2 అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.
3 అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.
-
1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. 2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు. 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?
4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా
-
27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
-
4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. 5 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు. 6 వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. 7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. 8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, 9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. 10 ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. 11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
-
11 ఈ సంగతులు ఆదేశించి నేర్పు. 12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు. 14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.
15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి.
-
11 మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక!
12 మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. 13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!
-
17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.
18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
19 దేవుని ఆత్మను ఆర్పవద్దు.
20 ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
22 ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
-
10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు.
-
24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
-
20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.
-
48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
-
4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.
6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7-8 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.
-
6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.
9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.
-
12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.
-
7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.
-
11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.
14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.
-
5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, 6 “ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. 7 “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. 8 ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. 9 నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు.
10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను.
-
20 అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.
-
22 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. 23 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. 24 అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
-
4 ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం. 5 మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి, 6 ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక.
-
6 నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే. 7 కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.
-
14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.
-
17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే. 18 అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను.
19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి. 20 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?
21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? 22 అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.
24 మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూశారు.
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
-
2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.
-
6 నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.
-
16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
-
23 యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
-
5 అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు.
-
33 పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.’ 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.
-
11-12 మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.
-
19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
-
10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
-
9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.
10 నీ రాజ్యం వస్తుంది గాక.
పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.
12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”
-
28 పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. 29 యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30 గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.
-
28 అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
-
31 “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32 నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”
-
10 సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు. 11 వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
-
1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. 2 ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. 3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు.
-
20 సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి.
-
1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
-
9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన 11 అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.
-
28 మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. 29 దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.
-
5 కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు.
“నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు.
ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
6 ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. 7 హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. 8 కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
9 ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? 10 మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
11 అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
-
12 నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.
13 వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.
14 యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.
-
21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
-
23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,
-
27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.
28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా.
-
27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
-
24 మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.
-
2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు.
-
21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు. 22 శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.
-
3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.
-
1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.
-
15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన 16 మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం.
-
19 కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు. 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు. 21 ఆయన వల్లనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.
-
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
-
14 వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. 15 దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.
16 భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి. 17 పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే. 18 వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
19 అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.
-
1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
Shows Read in context, Share and Copy.