87 Bible Verses About Miracles
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
18 ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు. 19 అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
20-21 అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. 22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు. 24 “వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు. 25 ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది. 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
27 యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. 28 యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు. 29 అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు. 30 వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు. 31 కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
32 ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. 33 దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు.
-
5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు. 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు. 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
-
33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి, 34 “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే 35 వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.
36 యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది. 37 ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు. 38 లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.
39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. 40 పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది. 41 అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
42 ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.
-
11 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి. 13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.
14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు. 15 అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది. 16 ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.
17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది. 18 విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
-
1 అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు.
2 యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు.
3 అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.
4 అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.
5 ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు.
6 తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.
7 తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది.
-
32 ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు. 33 కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు. 34 అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీదా, తన కళ్ళు వాడి కళ్ళ మీదా తన చేతులు వాడి చేతుల మీదా ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది.
35 తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. 36 అప్పుడు ఎలీషా గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలుచుకురా” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె గది లోపలికి వచ్చింది. ఎలీషా ఆమెతో “నీ కొడుకుని ఎత్తుకో” అన్నాడు. 37 అప్పుడు ఆమె అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది.
38 ఎలీషా తిరిగి గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు ఆ దేశంలో కరువు నెలకుని ఉంది. ప్రవక్తల సమాజం వారు అతని ముందు కూర్చుని ఉన్నారు. అప్పుడు అతడు “పొయ్యి మీద పెద్ద వంట పాత్ర పెట్టి వీళ్ళకు ఆహరం సిద్ధం చెయ్యి” అని తన సేవకుడికి ఆదేశించాడు. 39 వారిలో ఒకడు కూరగాయల కోసం పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చేదు ద్రాక్షచెట్టును చూశాడు. చేదు కూరగాయలను కోసుకుని తన అంగీ నిండా నింపుకుని తీసుకుని వచ్చాడు. వాటి స్వభావం వాళ్ళకి తెలియలేదు. వారు వాటిని ముక్కలు చేసి పులుసులో వేశారు.
40 భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని “దేవుని మనిషీ, పాత్రలో విషం ఉంది” అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు. 41 కానీ ఎలీషా “కొంచెం పిండి తీసుకు రండి” అన్నాడు. పాత్రలో అతడు ఆ పిండి వేసి “భోజనానికి దీన్ని వడ్డించండి” అన్నాడు. ఇక ఆ పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది.
42 తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు. 43 అయితే అతని సేవకుడు “ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?” అన్నాడు. దానికి అతడు “వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే ‘వారు తినగా ఇంకా మిగులుతాయి’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు. 44 కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.
-
23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. 24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. 26 యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. 27 శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు. 29 ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు.
30 వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. 31 “నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి. 32 యేసు “సరే, పో” అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి.
33 ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు.
-
22 “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు. 23 దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.
-
1 యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
2-3 క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు. 4 యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. 5 గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. 6 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు.
-
8 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే 9 నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.” 10 మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.
11 అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. 12 వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది. 13 అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.
-
30 యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. 31 కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
-
3 పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
-
3 అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. 4 ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు. 5 కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. 6 వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు.
7 పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు.
8 ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. 9 ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు.
-
8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, 9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. 10 ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. 11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
-
24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు. 25 ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
-
18 అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు. 19 దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు. 20 అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు. 21 అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి. 22 ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.
-
46 యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు. 48 యేసు అతడితో ఇలా అన్నాడు, “సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.” 49 అందుకా అధికారి, “ప్రభూ, నా కొడుకు చావక ముందే రా” అని వేడుకున్నాడు. 50 యేసు అతడితో, “నువ్వు వెళ్ళు. నీ కొడుకు బతుకుతాడు” అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళి పోయాడు.
51 అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు. 52 “ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు. 53 ‘నీ కొడుకు బతికి ఉన్నాడు’ అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు.
-
11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 12 వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.
13 వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.
-
8 అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. 9 అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి, 10 “లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.
-
29 ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, 30 నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ 31 వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
-
17 ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. 18 ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
-
22 మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు. 23 మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది.
24 ప్రజలు మోషే మీద సణుగుతూ “మేమేమీ తాగాలి?” అన్నారు. 25 మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు, 26 “మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”
27 తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.
-
23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. 24 వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. 25 యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. 26 ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
27 ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. 28 ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
29 సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. 31 ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
32 సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33 ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. 34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
-
1 అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 2 ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, 3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది. 4 దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.
-
20 అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.
-
1 మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. 2 ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.
3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. 4 యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5 ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది. 6 యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. 7 యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. 8 అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.
9 ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, 10 “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.
11 యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
-
20 అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.
-
5 అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. 6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. 7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.
-
23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు. 24 తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. 25 అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు.
26 తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు. 27 రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు.
28 నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు. 29 కనుక ఇప్పుడు నేనిచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఏ ప్రజల్లో గానీ, ఏ ప్రాంతంలో గానీ, ఏ భాష మాట్లాడేవాళ్ళలో గానీ ఎవరైనా షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళ దేవుణ్ణి అవమానపరిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. వాళ్ళ గృహాలను సమూల నాశనం చేయిస్తాను. వాళ్ళ దేవుడు రక్షించినట్టు మరి ఏ దేవుడూ రక్షించలేడు.”
-
14 మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు. 15 ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.
16 యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు. 17 ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. 18 ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు.
19 అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు. 20 వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.
21 యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. 22 ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.
23 యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
25 యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు. 26 ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. 27 కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
28 యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు. 29 ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.
-
1 మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. 2 పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు. 3 పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
4 పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు. 5 అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. 6 అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని 7 వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. 8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.
9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు. 10 ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
-
8 అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి 10 అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. 12 అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
-
6 అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు. 7 కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు.
8 మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా “పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు” అని మోషేకు చెప్పాడు. 9 కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
-
3 అదే రోజు అతడు ఒక సూచన ఇచ్చాడు. “ఈ బలిపీఠం బద్దలై దానిమీదున్న బూడిద ఒలికి పోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే” అన్నాడు.
4 బేతేలులోని బలిపీఠాన్ని గురించి ఆ దైవ సేవకుడు ప్రకటించిన మాట యరొబామురాజు విని, బలిపీఠం మీదనుండి తన చెయ్యి చాపి “అతన్ని పట్టుకోండి” అన్నాడు. అతడు చాపిన చెయ్యి చచ్చుబడి పోయింది. అతడు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు. 5 యెహోవా మాట ప్రకారం దైవసేవకుడి మాట ప్రకారం బలిపీఠం బద్దలై, దాని మీద నుండి బూడిద ఒలికి పోయింది.
6 అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.
7 అప్పుడు రాజు “నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. నీకు బహుమతి ఇస్తాను” అని ఆ దైవసేవకుడితో చెప్పాడు.
-
14 తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు. 15 యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.
16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,
“ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు.
మన రోగాలను భరించాడు.”
-
16 నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. 17 చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. 18 నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”
19 అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. 20 అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. 21 మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. 22 సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి.
23 ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. 24 తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. 25 ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు “రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
26 యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. 27 మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. 28 నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు.
29 అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. 30 ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. 31 తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు.
-
6 అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యొర్దానుకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు.
7 తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు. 8 అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.
9 వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. “నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు.” అందుకు ఎలీషా “నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి” అన్నాడు. 10 అందుకు ఏలీయా “నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు” అన్నాడు.
11 వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 12 ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు.
ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు.
13 ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. 14 నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.
-
1 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. 2 ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. 3 యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది. 4 అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు.
-
13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
-
10 ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు.
11 నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. “ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. 12 ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?” అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.
13 అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి “అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా” అన్నారు. 14 అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.
-
20 వారు ఆయన దగ్గరికి వచ్చి, “‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు. 21 అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
22 అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది.
-
47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు. 48 అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు. 49 ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు. 50 ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు. 51 దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.
-
1 ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. 2 ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు. 3 అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. 4 పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు. 5 ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.
6 ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు. 7 “సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు.
-
23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. 24 ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు. 25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.
-
38 అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు, 39 “వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.
40 యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. 41 నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
42 తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
-
29 యేసు అక్కడ నుండి బయలుదేరి, గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. 30 ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను, ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు. 31 మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
-
16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు. 17 అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు. 18 అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. 19 వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు. 20 అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు. 21 ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
-
32 దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు. 33 మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా?
34 మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా? 35 అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు. 36 మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.
-
19 తరువాత ఆ పట్టణంలో మనుషులు ఎలీషాతో “మా గోడు వినండి. మా యజమానులైన మీరు చూస్తున్నట్లు ఈ పట్టణ ప్రాంతం మనోహరంగా ఉంది. కానీ ఇక్కడి నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది” అన్నారు. 20 దానికి ఎలీషా “ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు.
21 అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.” 22 అందుచేత ఎలీషా పలికిన మాట ప్రకారం ఆ నీళ్ళు ఈ రోజు వరకూ ఆరోగ్యకరంగా ఉన్నాయి.
-
5 ఒకడు కొమ్మ కొడుతున్నప్పుడు వాడి గొడ్డలి ఊడి కింద నీళ్ళలో పడిపోయింది. వాడు “అయ్యో, నా ప్రభూ, అది అరువు తెచ్చిన గొడ్డలి” అంటూ కేకలు పెట్టాడు.
6 అప్పుడు దేవుని మనిషి “అదెక్కడ పడింది?” అని అడిగాడు. వాడు అతనికి అది పడిన ప్రాంతం చూపించాడు. అప్పుడతడు ఒక చిన్న కొమ్మని కొట్టి దాన్ని నీళ్ళలో వేశాడు. అప్పుడు ఆ ఇనుప గొడ్డలి నీళ్ళలో తేలి పైకి వచ్చింది. 7 ఎలీషా “దాన్ని పైకి తియ్యి” అన్నాడు. వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు.
-
18 సిరియా సైన్యం ఎలీషాకి దగ్గరగా వచ్చారు. అప్పుడు ఎలీషా “ఈ సైన్యానికి గుడ్డితనం కలుగజెయ్యి” అని యెహోవాను ప్రార్థించాడు. ఎలీషా అడిగినట్టే యెహోవా వాళ్లకు గుడ్డితనం కలుగజేశాడు. 19 అప్పుడు ఎలీషా వాళ్ళతో “మీరు వెళ్ళాల్సిన దారి ఇది కాదు. ఇది పట్టణమూ కాదు. మీరు వెదికే మనిషి దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను, నా వెనకాలే రండి” అని చెప్పి వాళ్ళను షోమ్రోను పట్టణంలోకి తీసుకు వెళ్ళాడు.
20 వారు షోమ్రోనులోకి వచ్చిన తరువాత ఎలీషా “యెహోవా, వీళ్ళు చూడాలి. వీళ్ళ కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వాళ్ళ కళ్ళు తెరిచాడు. తాము షోమ్రోనులో ఉన్నామని వాళ్లకర్థమైంది. 21 అప్పుడు ఇశ్రాయేలు రాజు వాళ్ళను చూసి “నా తండ్రీ, వీళ్ళను చంపమంటావా, చంపెయ్యనా?” అని ఎలీషాని అడిగాడు.
22 అప్పుడు ఎలీషా “నీవు వాళ్ళని చంపకూడదు. నీ వింటినీ, కత్తినీ ప్రయోగించి బందీలుగా పట్టుకున్న వాళ్ళను ఎలా చంపుతావు? వాళ్లకు రొట్టె, నీళ్ళూ ఇవ్వు. వారు తిని తాగి తమ రాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు” అన్నాడు. 23 కాబట్టి రాజు వాళ్ళ కోసం విందు చేయించి అనేక రకాల భోజన పదార్థాలను తయారు చేయించాడు. వారు తిని తాగిన తరువాత వాళ్ళను తిరిగి తమ రాజు దగ్గరికి పంపించి వేశాడు. ఆ తరువాత సిరియా సైన్యం చాలా కాలం వరకూ ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టలేదు.
-
20 తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు. 21 కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.
-
36 శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. 37 అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. 38 పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. 39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
40 అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. 41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.
-
2 అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు.
-
15 పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు. 16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
-
28 అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు. 29 మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు. 30 కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు.
31 మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది. 32 భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
33 వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు. 34 వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు. 35 అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.
-
7 అప్పుడు యెహోవా మోషేతో, 8 “నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు. 9 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు.
10 తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు. 11 అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి.
-
13 సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.”
14 కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. 15 అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే 16 పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. 17 ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.
-
13 అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. 14 భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” 15 అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. 16 యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
-
20 అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు. 21 ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి “ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి” అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు.
22 అప్పుడు ఏలీయా “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. 23 మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను. 24 తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు” అన్నాడు. ప్రజలంతా “ఆ మాట బాగుంది” అని జవాబిచ్చారు.
25 అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి “మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు” అన్నాడు. 26 వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు.
27 మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు. 28 వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు. 29 ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు.
30 అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు. 31 “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు. 32 ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు. 33 కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు.
34 తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు. 35 అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు.
36 సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. 37 యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు.
38 అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది. 39 ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు. 40 అప్పుడు ఏలీయా “బయలు దేవుడి ప్రవక్తలందర్నీ పట్టుకోండి. ఎవర్నీ వదలొద్దు” అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసికెళ్ళి చంపేశాడు.
-
9 అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. 10 అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.
11 ఆహాజు రాజు మరో యాభై మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. 12 అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.
-
9 “తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు.
10 అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు. 11 ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
-
20 అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు. 21 “అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.
22 తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను. 23 కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! 24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”
-
22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. 23 యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు. 24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు. 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు. 26 యేసు అతనిని పంపివేస్తూ, “నీవు ఊరిలోకి వెళ్ళవద్దు” అని అతనితో చెప్పాడు.
-
11 ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.
13 ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. 14 ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
16 అందరూ భయంతో నిండిపోయి, “మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు.
-
12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. 13 ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు.
14 అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు. 15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. 16 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. 17 వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.
-
1 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు. 2 అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు. 3 అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా?” అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు. 4 వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు. 5 “మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా?” అని వారిని అడిగాడు. 6 ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు.
-
19 “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు. 20 లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు. 21 ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి. 22 ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
23 “అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి. 24 ‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.
25 దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. 26 అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది,’ అన్నాడు.
27-28 అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు. 29 అందుకు అబ్రాహాము, ‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు. 30 అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. 31 అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు.
-
47 అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే, 48 మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు.
-
12 ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.
13 అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. 14 అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.
15 “వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.”
16 హీబ్రూ భాషలో ‘హర్ మెగిద్దోన్’ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
-
10 అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
11 అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది. 12 శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? 14 యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
-
29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది. 30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు. 31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.
32 యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు. 33 వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. 34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
-
9 పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.
10 అప్పుడు పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడుకుని కౌగలించుకుని, “మీరిక గాభరా పడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు బతికే ఉన్నాడు” అని వారితో చెప్పాడు. 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకూ వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు. 12 సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
-
22 ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.
-
5 అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు. 6 అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.
-
2 దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది.
3 అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. 4 అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు.
5 ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. 6 ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది.
7 అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.
-
14 నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.
-
58 వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
-
40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. 41 యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
43 ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, 44 “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. 45 కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
-
34 మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. 35 ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. 36 పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. 37 దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
-
28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
-
5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
-
12 యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు,
“సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో.
చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”
13 “ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు,
చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా.
సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి
ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
14 యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
-
16 మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి. 17 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” 18 సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.
-
24 వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, “మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?” అని అడిగారు. 25 అతడు, “అవును, చెల్లిస్తాడు” అన్నాడు. అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, “సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?” అని అడిగాడు. 26 అతడు, “బయటివాళ్ళ దగ్గరే” అని చెప్పాడు. యేసు, “అలాగైతే కొడుకులు స్వతంత్రులే. 27 అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.
-
29 ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు.
-
17 ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.
18 తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. 20 అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు.
21 అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. 22 మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు.
Shows Read in context, Share and Copy.