67 Bible Verses About Compassion

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Compassion
  1. 35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు. 37 ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. 38 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.

  2. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  3. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  4. 30 అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.

    31 అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు. 32 ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు. 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. 34 అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.

    35 మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు. 36 అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు. 37 దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.

  5. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  6. 13 యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు. 14 యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.

  7. 29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది. 30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు. 31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.

    32 యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు. 33 వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. 34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.

  8. 30 అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.

    31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. 32 అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.

    34 పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.

  9. 11 ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.

    13 ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. 14 ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.

  10. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.

  11. 8 యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,

    9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.

    సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి.

    ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.

    10 వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”

  12. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

    5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.

  13. 40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. 41 యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.

    43 ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, 44 “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. 45 కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.

  14. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

    3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.

  15. 15 అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.

  16. 13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.

    14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.

    15 మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.

    16 దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.

    17 యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.

    18 వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.

  17. 15 స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.

    16 చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.

  18. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  19. 17 పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

  20. 20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.

  21. 8 యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.

    9 యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.

  22. 32 అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో” అన్నాడు. 33 ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు. 34 యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు.

    35 అప్పుడు యేసు “నేల మీద కూర్చోండి” అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి, 36 ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు. 37 వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.

  23. 5 ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. 6 పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది.

  24. 8 యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.

  25. 15 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి.

  26. 3 కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

    4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.

    5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.

  27. 22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

  28. 33 ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు. 34 వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు. 35 యేసు ఏడ్చాడు. 36 అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు. 37 వారిలో కొంతమంది, “ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?” అన్నారు.

    38 యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది. 39 యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది. 40 యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు.

    41 కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. 42 నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు.

    43 ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు. 44 అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు.

  29. 1 “నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన 2 అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే 3 మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

    4 చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు.

  30. 18 అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు.

    యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.

  31. 41 ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు. 42 “నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు. 43 ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు. 44 నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు.

  32. 38 అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.

  33. 31 ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.

    32 ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.

    33 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.

    34 దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,

    35 మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,

    36 ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?

  34. 11 అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు.

    12 నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.

    13 అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.

    14 అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.

  35. 13 బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు.

    ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.

  36. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  37. 3 మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి.

  38. 11 చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.

  39. 20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. 22 అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. 23 అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.

  40. 1 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. 2 ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. 3 యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది. 4 అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు.

  41. 14 కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. 15 అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.” 16 కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.

  42. 17 ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ 18 మీ దేవుడైన యెహోవా దృష్టికి సరైన దాన్ని చేస్తూ, ఆయన మాట వినాలి. యెహోవా తన కోపం నుండి మళ్లుకుని మిమ్మల్ని కనికరించి, దయ చూపి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన విధంగా మిమ్మల్ని విస్తరింపజేయాలంటే నాశనం చేయాల్సిన దానిలో కొంచెమైనా మీ దగ్గర ఉంచుకోకూడదు.

  43. 9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”

  44. 15 పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు.

    నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి?

    మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి.

    16 అయితే మా తండ్రివి నువ్వే.

    అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా,

    యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా.

  45. 18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.

    నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.

    నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.

    నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.

    19 నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.

    నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.

    మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.

    20 నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.

    పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.

  46. 42 శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”

  47. 11 తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు.

    12 వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతణ్ణి చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదికి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. 13 అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.

  48. 25 బాధలో ఉన్న వారి కోసం నేను ఏడవ లేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఖించ లేదా?

  49. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

  50. 2 అతడు అజ్ఞానుల విషయంలోనూ, దారి తప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే అతణ్ణి కూడా అలాంటి బలహీనతలు చుట్టుముట్టి ఉంటాయి గనక

  51. 15 పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్ళు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన యెరికోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళారు.

  52. 156 యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.

  53. 21 పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.

  54. 16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.

    మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.

    మీ దుష్టత్వం మానండి.”

    17 మంచి చెయ్యడం నేర్చుకోండి.

    న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.

    తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.

    వితంతువు పక్షాన నిలబడండి.

  55. 14 యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను. 15 ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.”

  56. 1 అప్పుడు యెహోవా నాకు తన వాక్కు ఇచ్చి, 2 “నరపుత్రుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన పనులు దానికి తెలియజేసి, నువ్వు ఇలా ప్రకటించు, 3 ప్రభువైన యెహోవా యెరూషలేము గురించి ఇలా అంటున్నాడు, నీ ఆరంభం, నీ పుట్టుక కనాను ప్రదేశంలో జరిగింది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.

    4 నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు. 5 ఈ పనుల్లో ఒక్కటైనా నీ పట్ల చెయ్యాలని ఎవరికీ కనికరం కలగలేదు. నీ పట్ల జాలి పడినవాడు ఒక్కడూ లేడు. నువ్వు పుట్టిన రోజే నీ మీద ద్వేషంతో నిన్ను ఆరుబయట పొలంలో విసిరేశారు.

    6 కాని నేను నీ దగ్గరికి వచ్చి, నీ రక్తంలోనే పొర్లుతున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లుతున్న నీతో, ‘బ్రతుకు’ అని చెప్పాను. 7 పొలంలో నాటిన ఒక మొక్క ఎదిగినట్టు నువ్వు ఎదిగేలా చేశాను. నువ్వు వృద్ధి పొంది గొప్పదానివై రత్నాలు పొదిగిన ఆభరణం అయ్యావు. నువ్వు నగ్నంగా వస్త్రహీనంగా ఉన్నా, నీ రొమ్ములు బిగువుగా, నీ తలవెంట్రుకలు ఒత్తుగా పెరిగాయి.

    8 మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూశాను. చూడు! ప్రేమ కలిగించే ప్రాయం నీకు వచ్చింది గనక నా వస్త్రంతో నీ నగ్నత్వాన్ని కప్పాను. ఆ తరవాత నేను నీతో ఒప్పందం చేశాను.” ఇది ప్రభువైన యెహోవా చేసిన ప్రకటన. “అప్పుడు నువ్వు నా దానివయ్యావు.

    9 కాబట్టి నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతా తుడిచి, నిన్ను నూనెతో అభిషేకం చేసి, 10 బుటాదారీ పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి, నీ పాదాలకు తోలు చెప్పులు తొడిగాను. సన్నని నారబట్టతో నిన్ను చుట్టి, పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను. 11 తరువాత ఆభరణాలతో నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలు తొడిగి నీ మెడలో గొలుసు వేసి, 12 నీ చెవులకూ, ముక్కుకూ పోగులు పెట్టి, నీ తల మీద కిరీటం పెట్టాను.

    13 ఈ విధంగా బంగారంతో, వెండితో నేను నిన్ను అలంకరించి, సన్న నార, పట్టు, బుటాదారీ పని ఉన్న బట్టలు నీకు ధరింపజేశాను. నువ్వు మెత్తని గోదుమ పిండి, తేనె, నూనె ఆహారంగా తిని, అత్యంత సౌందర్యరాశివైన రాణివయ్యావు. 14 నేను నీకిచ్చిన ఘనతతో నీ అందం పరిపూర్ణం అయింది. దేశదేశాల్లో నీ కీర్తి ప్రచురం అయ్యింది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  57. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  58. 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.

    24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.

    28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.

    31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.

    35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.

  59. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

  60. 6 యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 7 ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.

  61. 7 కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను.

    8 కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను.

    నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.

  62. 14 కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు.

  63. 13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.

    త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.

    శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.

    కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక

    మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

  64. 12 “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.

  65. 41 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.

  66. 11 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ 12 ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. 13 “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. 14 ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.

    15 వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి 16 బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. 17 అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? 18 దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు. 19 “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.

  67. 20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”