47 Bible Verses About Loyalty

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Loyalty
  1. 15 అప్పుడు నయోమి “చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు” అని రూతుతో చెప్పింది. 16 అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. 17 నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.

  2. 5 నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను.

  3. 17 స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

  4. 22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

  5. 6 మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. 7 అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా. 8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

    9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి. 10 ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు.

  6. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

  7. 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.

    15 “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  8. 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.

    28 “మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా? 29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే, 30 చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.

    31 “అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా? 32 తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా! 33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.

  9. 1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. 2 కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు. 3 పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు. 4 వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు. 5 కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.

  10. 14 కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన్ని నిష్కపటంగా నమ్మకంగా సేవించండి. యూఫ్రటీసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి. 15 యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు.

  11. 22 ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను.

    నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.

    23 ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి.

    ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.

    24 ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను.

    పాపానికి దూరంగా ఉన్నాను.

  12. 33 అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు. 34 యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు. 35 పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.

  13. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి.

  14. 24 ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.

  15. 9 “ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను.

    అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను.

    10 పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.

  16. 10 అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.

    11 “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.

    12 కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం.

    ఆయన ఎవరో మనకు తెలియదు అంటే

    ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.

    13 ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి,

    మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,”

    అనే మాటలు నమ్మదగినవి.

  17. 1 దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు. 2 ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.

    3 యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. 4 యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

  18. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

  19. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  20. 23 ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.

    24 దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.

  21. 4 పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.

    5 ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.

    6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.

  22. 7 నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు.

    అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.

  23. 23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.

  24. 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.

  25. 18 “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో,

    పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను.

    దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను.

    వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.

    19 నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

    నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

    20 యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.

  26. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  27. 13 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. 14 రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి.

  28. 21 నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.

  29. 3 శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు.

    నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను.

  30. 33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.

    34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

  31. 29 అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా.

  32. 10 ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.

  33. 14 అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను.

    15 అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.

    16 దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను.

  34. 6 నేను నమ్మదగిన వాణ్ణి అని చాలామంది చెప్పుకుంటారు. అయితే నమ్మదగిన వాడు ఎవరికి కనిపిస్తాడు?

  35. 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

    సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.

    యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

    2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

    హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.

    ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

    3 కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.

    దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు.

    సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.

  36. 42 దానికి ప్రభువు ఇలా అన్నాడు, “సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటిపై నియమించే నమ్మకమైన, బుద్ధిగల నిర్వాహకుడెవడు? 43 యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు. 44 అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతణ్ణి ఉంచుతాడని మీకు చెబుతున్నాను.

    45 అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే 46 వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు. 47 తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే సేవకుడికి చాలా దెబ్బలు తగులుతాయి. 48 దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.

  37. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు.

  38. 15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.

    16 మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.

    17 ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు.

    అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు.

  39. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

  40. 1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి. 2 నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం.

  41. 3 అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.

  42. 1 “నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన 2 అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే 3 మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

  43. 10 నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

    11 యెహోవా, నా కోసం నువ్వు కనికరంతో చేసే పనులను నా నుండి దూరం చేయకు. నీ నిబంధన కృప, నీ విశ్వసనీయత ఎప్పుడూ నన్ను కాపాడనీ.

  44. 28 నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.

  45. 2 “యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను.

  46. 57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను” అని ఆయనతో అన్నాడు. 58 అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు.

    59 ఆయన మరో వ్యక్తిని చూసి “నా వెంట రా” అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు. 60 అందుకాయన, “చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అని అతనితో చెప్పాడు.

    61 మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు. 62 దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.

  47. 5 దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు. 6 కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.