60 Bible Verses About God's Provision

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Provision
  1. 19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.

  2. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

    9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.

    10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

  3. 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

    31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  4. యాత్రల కీర్తన

    1 కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?

    2 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.

    3 ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.

    4 ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.

    5 నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.

    6 పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.

    7 ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.

    8 ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.

  5. 4 నువ్వు ముసలివాడివయ్యే వరకూ, నీ తల వెండ్రుకలు తెల్లగా అయ్యే వరకూ నిన్ను మోసేవాణ్ణి నేనే.

    నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకునే వాణ్ణీ, నిన్ను మోస్తూ రక్షించేవాణ్ణీ కూడా నేనే.

  6. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

  7. 6 అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.

    7 ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు. 8 దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు.

  8. 13 అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 14 అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.

  9. 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.

  10. 13 అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. 14 నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

    16 మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.” 17 ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.

    18 వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.

  11. 3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.

    4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు. 5 అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. 6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు.

  12. 4 కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు? 5 ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి. 6 ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు.

  13. 31 అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి. 32 కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.

  14. 7 ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”

  15. 13 కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే, 14 మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు. 15 మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.

    16 మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి. 17 లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.

  16. 8 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,

    మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ

    వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.

    పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.

    భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.

    ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

  17. 9 తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు.

    దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు.

    బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.

  18. 6 అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.

  19. 8 యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు. 9 నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.”

    10 కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. 11 ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. 12 అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది.

    13 అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. 14 భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” 15 అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. 16 యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.

  20. 5 అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. 6 ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.

    7 యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. 8 అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.

  21. 42 తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు. 43 అయితే అతని సేవకుడు “ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?” అన్నాడు. దానికి అతడు “వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే ‘వారు తినగా ఇంకా మిగులుతాయి’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు. 44 కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.

  22. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.

  23. 12 ఎందుకంటే యెహోవా, నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు.

  24. 9 నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.

    10 దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.

    11 సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.

    12 అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.

    13 గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.

  25. 5 తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.

  26. 9 యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.

    10 ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.

    11 నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.

    12 నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.

    13 నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.

  27. 27 తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.

    28 నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.

  28. 9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

  29. 5 తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.

  30. 7 భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.

  31. 12 బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.

  32. 14 కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.

  33. 16 నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.

  34. 5 యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.

    6 ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.

    7 దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.

    8 యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.

    9 ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

    10 యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, ఆయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.

  35. 7 కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.

    8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.

    9 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.

    10 గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు.

    11 తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం.

  36. 26 నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెన జల్లులివే. 27 పళ్ళ చెట్లు కాయలు కాస్తాయి. భూమి పంట ఇస్తుంది. నా గొర్రెలు వాటి ప్రాంతాల్లో క్షేమంగా ఉంటాయి. నేను వారి కాడికట్లను తెంపి వారిని బందీలుగా చేసినవారి చేతిలో నుంచి వారిని విడిపించేటప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.

    28 ఇకపై వారు ఇతర రాజ్యాలకు దోపిడీగా ఉండరు. క్రూర జంతువులు వారిని మింగివేయవు! వాళ్ళు ఎవరికీ భయపడకుండా క్షేమంగా నివసిస్తారు. 29 వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు.

  37. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  38. 38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”

  39. 12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. 13 ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు.

    14 అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు. 15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. 16 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. 17 వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.

  40. 22 తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు. 23 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. 25 పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? 26 కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.

    28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.

  41. 21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.

  42. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  43. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  44. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.

  45. 3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

  46. 24 మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. 25 ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

  47. 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.

  48. 18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.

  49. 24 ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం.

  50. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

  51. 5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

  52. 10 సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.

  53. 9 దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.

  54. 11 యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.

  55. 21 నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.

  56. 29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

  57. 9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది.

  58. 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.

  59. 5 ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.

  60. 1 “ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి,

    నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.

    2 వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు.

    విగ్రహాలకు ధూపం వేశారు.

    3 ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే.

    వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే.

    నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు.

    4 మానవత్వపు బంధంతో వారిని నడిపించాను.

    స్నేహబంధాలతో తోడుకుపోయాను.

    వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను.

    వంగి వారికి అన్నం తినిపించాను.