16 Bible Verses About The Rapture

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About The Rapture
  1. 13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.

    15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.

    18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.

  2. 29 “ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి. 30 అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు. 31 ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.

    32 “అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు. 33 అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 34 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 35 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

    36 “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు. 37 నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది. 38 జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. 39 జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.

    40 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది. 42 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.

  3. 1 సోదరులారా, ఇకపోతే ప్రసాదించే కృప మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడడం గురించీ ఒక విన్నపం. 2 క్రీస్తు రాక జరిగిపోయిందని ఎవరైనా తనకు ఆత్మ వెల్లడించాడని గానీ, ఒక మనిషి మాట చేత గానీ, లేదా మేము రాసినట్టుగా ఏదైనా ఉత్తరం చేత గానీ మీకు తెలిస్తే తొందరపడి యేసు ప్రభువు వచ్చేశాడని నమ్మి మీ మనసుల్లో కలవరపడవద్దని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

    3 ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు. 4 వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.

    5 మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా? 6 వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు. 7 అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు.

  4. 1 సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు. 2 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.

    4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. 5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. 6 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. 7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. 8 విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.

    9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.

  5. 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.

    51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,

    “విజయం మరణాన్ని మింగివేసింది”

    అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

    55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

  6. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను.

  7. 7 “కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.

    8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు. 9 ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.

    10 ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి, 11 “గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.

  8. 10 అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి. 11 ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?

    12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.

    14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.

  9. 7 చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు.

    ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు.

    భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.

  10. 20 ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. 21 ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు.

    22 ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు. 23 వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు. 24 ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు. 25 అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి.

    26 “నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది. 27 నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.

    28 లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. 29 అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.

    30 “అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. 31 ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు.

    34 నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది. 35 ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.”

    36 అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. 37 దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.

  11. 1 “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు. 2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.

    3 బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.

  12. 27 “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.

  13. 21 ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.

    22 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.

    23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.

    24 “ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో,

    సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.

    25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి.

    ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.

    26 అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. 27 అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”

  14. 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.

  15. 32 అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.

    34 “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. 35 కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. 36 ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త! 37 నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”

  16. 34 “తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి. 35 ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది. 36 కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.