72 Bible Verses About Life

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Life
  1. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.

  2. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  3. 20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. 21 అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం. 22 అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  4. 7 దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.

  5. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  6. 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

  7. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  8. 24 కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు.

  9. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

  10. 25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.

  11. 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.

    18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది.

  12. 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు.

  13. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

  14. 1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

    2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

    3 అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

    4 అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

    5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  15. 20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.

  16. 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం ఆ వ్యక్తి నమ్మలేదు.

    11 ఆ సాక్ష్యం ఇదే, దేవుడు మనకు శాశ్వత జీవం ఇచ్చాడు. ఈ జీవం తన కుమారుడిలో ఉంది. 12 కుమారుడు ఉన్నవాడికి జీవం ఉంది. దేవుని కుమారుడు లేని వాడికి జీవం లేదు.

  17. 27 పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు.

  18. 3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.

    4 నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను.

  19. 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.

  20. 6 నేత పనివాడి చేతిలోని నాడెలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి.

    7 నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచీ కనబడదు.

  21. 8 అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!

    9 అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను.

    10 ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు.

    11 జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.

  22. 16 బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు.

    బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.

    17 ఇదంతా చూస్తే సూర్యుని కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధ పడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది.

    18 సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరవాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను. 19 వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే. 20 కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.

    21 ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది. 22 సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? 23 అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.

  23. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  24. 1 “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు. 2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.

    3 బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.

  25. 1 ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. 2 ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.

    3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. 4 ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది. 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.

  26. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

    4 అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.

    5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. 7 నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు అదొక విడ్డూరంగా భావించవద్దు. 8 గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”

  27. 36 కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”

  28. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

    10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

  29. 24 అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి. 25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?

  30. 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”

  31. 5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.

  32. 3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. 4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.

    5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.

  33. 4 యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.

    5 ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.

    6 నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.

  34. 35 దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.

  35. 25 తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.

  36. 3 క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?

    4 తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5 ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6 ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. 7 చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.

    8 మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. 9 చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. 10 ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.

    11 ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

  37. 8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.

  38. 13 ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. 14 మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు.

  39. 13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.

  40. 14 మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.

  41. 47 నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?

  42. 13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

    14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

    15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

    16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

  43. 14 కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు.

  44. 28 నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.

  45. 16 దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.

  46. 12 నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.

  47. 6 మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే.

    పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.

    7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.

    కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

    8 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,

    మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ

    వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.

    పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.

    భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.

    ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

    9 తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు.

    దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు.

    బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.

  48. 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”

  49. 63 జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.

  50. 9 నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం.

  51. 39 తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

  52. 39 లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 40 అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు.

  53. 12 మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.”

  54. 28 మనం ఆయనలో బతుకుతున్నాం,

    ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

    ‘మనమాయన సంతానం,’

    అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

  55. 11 చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.

  56. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  57. 7 మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు. 8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం. 9 చనిపోయిన వారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మళ్ళీ బతికింది?

  58. 25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.

  59. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు.

  60. 21 నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.

    22 జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు.

  61. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.

  62. 29 నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు.

  63. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

  64. 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  65. 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.”

    52 యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు. 53 అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.

  66. 11 యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాము.

    12 ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి.

  67. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  68. 23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.

  69. 25 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు.

  70. 7 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”

  71. 20 దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21 దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    22 దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.

    24 దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25 దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

  72. 10 ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను. 11 ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.

    12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. 13 అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది.

    14 కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి ‘మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను’ అని ఆదేశించాను.