84 Bible Verses About Following God

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Following God
  1. 18 యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వారు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వారు చేపలు పట్టేవారు. 19 యేసు వారితో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని పిలిచాడు. 20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.

    21 యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వారు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు. 22 వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు.

  2. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.

  3. 21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.

    24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”

  4. 18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.

    19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు. 20 అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు. 21 ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు. 22 అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.

    23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.

  5. 57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను” అని ఆయనతో అన్నాడు. 58 అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు.

    59 ఆయన మరో వ్యక్తిని చూసి “నా వెంట రా” అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు. 60 అందుకాయన, “చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అని అతనితో చెప్పాడు.

    61 మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు. 62 దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.

  6. 26 నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.

  7. 13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.

    14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.

    15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.

    16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.

  8. 1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”

    4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.

  9. 10 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు. 14 అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’

  10. 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?

    38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

  11. 52 యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు. 53 అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. 54 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను. 55 నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం. 56 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను. 57 సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు. 58 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” 59 ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.

    60 ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. 61 తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా? 62 మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు? 63 జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం. 64 కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు. 65 ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.

    66 ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.

    67 అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు. 68 సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. 69 నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.

  12. 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. 21 దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు.

    22 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.

    ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.

    23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.

    ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.

    24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.

  13. 24 అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి. 25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?

    27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.

  14. 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

  15. 12 మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.”

  16. 7 అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే. 8 నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.

    9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

    11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. 12 జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. 13 జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.

    14 నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15 నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. 16 ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.

    17 నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”

  17. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.

    9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు. 11 మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.

  18. 1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి. 2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.

  19. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

    12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. 14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

    17 మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.

  20. 9 యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు. 10 యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు.

    11 పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు. 12 యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. 13 నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.

  21. 18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  22. 16 ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. 17 యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. 18 వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.

    19 ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. 20 వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.

  23. 23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి, 24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు. 25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం?

  24. 3 మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.

    4 ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు. 5 ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా. 6 మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.

  25. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  26. 37 నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38 తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. 39 తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

  27. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

    11 కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.

  28. 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

  29. 22 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.

  30. 2 అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు. 3 కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.

  31. 22 అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.

  32. 5 అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వికులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు.

    6 అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయన్ను వెంబడించడంలో వెనుతిరగకుండా, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. 7 కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు. అతని మీద తిరగబడ్డాడు.

  33. 23 ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”

  34. 3 కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది.

  35. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  36. 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

    18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.

    20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

    23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. 26 యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.

    27 అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా 28 యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.

    29 నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”

  37. 27 ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు. 28 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.

  38. 28 దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

  39. 25 గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు, 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.

    28 “మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా? 29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే, 30 చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.

    31 “అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా? 32 తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా! 33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.

  40. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

  41. 19 అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.

  42. 27 సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు. 28 ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.

    29 అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా. 30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”

  43. 19 ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది.

  44. 7 ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు. 8 ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు. 9 మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు. 10 ఈ విధంగా ఆయన పరిపూర్ణుడయ్యాడు, తనకు విధేయులైన వారందరి శాశ్వత రక్షణకు కారణమయ్యాడు.

  45. 1 విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం. 2 మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు. 3 విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.

    4 విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.

    5 విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. “దేవుడు తీసుకువెళ్ళాడు కనుక అతడు కనిపించలేదు.” దేవుడు తీసుకువెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.

    7 విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.

    8 దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. 9 విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.

    10 ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. 11 విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది.

    12 అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు.

    13 వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు. 14 ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. 15 ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. 16 కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు.

    17 విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. 18 “ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు. 19 దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.

    20 విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు. 21 విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు.

    22 విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు.

    23 విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు.

    24 విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు. 25 కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు. 26 ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు.

    27 విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు. 28 విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు.

    29 విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది.

    30 విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి.

    31 విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు.

    32 ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు.

    33 విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.

    34 అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు.

    35 స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు.

    36 ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు.

    37 వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు.

    38 అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. 39 వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. 40 మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.

  46. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  47. 24 నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను.

  48. 11 ఇరవై సంవత్సరాలకు మించి, ఐగుప్తుదేశం నుండి వచ్చిన మనుషుల్లో యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన కెనెజీయుడు, యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప 12 మరి ఎవ్వడూ పూర్ణమనస్సుతో నన్ను అనుసరించలేదు కాబట్టి నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని మరి ఎవరూ చూడనే చూడరు, అని శపథం చేశాడు.

  49. 8 నాతో వచ్చిన నా సోదరులు ప్రజల హృదయాలు హడలిపోయేలా చేసినా నేను మాత్రం నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. 9 ఆ రోజు మోషే నాతో ప్రమాణపూర్వకంగా ‘నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకూ నీ సంతానానికీ ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉంటుంది’ అన్నాడు.

  50. 28 పేతురు ఆయనతో, “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు. 29 అందుకు యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు. 30 ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు. 31 కాని, మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు” అన్నాడు.

  51. 34 ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను.

    మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి, 35 ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. 36 ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.

  52. 19 ఆయన తల్లీ సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు. 20 అప్పుడు, “నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ సోదరులూ వచ్చి బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు. 21 అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ” అన్నాడు.

  53. 12 యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? 13 మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14 బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15 నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.

    16 నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17 ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.

  54. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

  55. 3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.

  56. 3 నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.

  57. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  58. 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  59. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

  60. 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు.

  61. 1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. 2 కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు. 3 పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు. 4 వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు. 5 కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.

    6 ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు. 7 ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.

  62. 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.

    20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.

  63. 20 గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు 21 ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక! తన దృష్టిలో ప్రీతికరమైన దాన్ని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక! ఆ యేసు క్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమెన్.

  64. 33 మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”

  65. బేత్‌

    9 యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

    10 నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

    11 నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

  66. 43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  67. 52 అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. 53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? 54 నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.

  68. 14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.

  69. 1 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు. 2 ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.

    3 పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.

    4 ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు. 5 సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. 6 వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి. 7 వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి.

    8 సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు. 9 ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.

    10 వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. 11 వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.

  70. 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.

  71. 43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45 ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.

  72. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.

  73. 1 మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే. 2 ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. 3 అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. 4 తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. 5 వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.

  74. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.

  75. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

  76. 21 నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు.

  77. 23 యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.

  78. 37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.

  79. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  80. 16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

    18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

    25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.

  81. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  82. 18 క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. 19 ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. 20 ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.

    21 దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే. 22 ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.

  83. 4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. 5 అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 6 ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.

    7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. 8 మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.

    9 క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. 10 ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. 11 అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

  84. 1 తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి. 2 అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.

    3 వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు. 4 వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు. 5 అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.