69 Bible Verses About Submission to God
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
-
1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.
3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
-
11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.
13 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. 14 రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి. 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.
16 స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి. 17 అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.
18 సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.
19 ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. 21 దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు.
22 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.
ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.
ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.
24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.
-
1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. 2 కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు. 3 పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు. 4 వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు. 5 కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.
6 ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు. 7 ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
8 ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. 9 ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
-
1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.
6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.
దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.
7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.
బానిస రూపం తీసుకున్నాడు.
మానవుల పోలికలో కనిపించాడు.
ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.
8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,
తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.
9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,
భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,
ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,
దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,
అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.
12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.
-
1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది. 2-3 “నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.
-
18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.
19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు. 20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.
21 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండేలా వారిని రెచ్చగొట్టవద్దు.
22 దాసులారా, మనుషులను మెప్పించాలని చూసే వారిలా పైకి కనిపించాలని కాకుండా ప్రభువుకు భయపడుతూ చిత్తశుద్ధితో అన్ని విషయాల్లో మీ ఇహలోక యజమానులకు లోబడి ఉండండి.
23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు. 25 అక్రమం చేసేవాడికి తాను చేసిన అక్రమానికి తగిన శాస్తి జరుగుతుంది. ఎలాంటి పక్షపాతం ఉండదు.
-
13 ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. 14 జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.
15 “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
-
27 సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు. 28 ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
29 అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా. 30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”
-
1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి.
-
16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.
19 మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.
-
6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. 9 దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.
-
1 భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2 ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.
3 జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4 వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.
-
1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
-
22 వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 23 ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. 24 అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. 25 కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.
26 తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. 27 తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.
-
39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.
-
41 వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు. 42 “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”
-
23 ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.
24 ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. 25 ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. 26 చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం. 27 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా. 28 సమస్తమూ కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.
-
13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.
15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.
-
22 అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. 23 తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.
24 అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.
-
1 యెహోవా ఇలా చెబుతున్నాడు,
“ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?
2 వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు.
“ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.
-
18 అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. 19 అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
-
6 యెహోవాకు నేనేం తీసుకురాను?
మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను?
దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?
7 వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా?
నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా?
నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?
8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.
ఆయన నిన్ను కోరేదేంటంటే,
న్యాయంగా ప్రవర్తించు.
కనికరాన్ని ప్రేమించు.
వినయంగా నీ దేవునితో నడువు.
-
35 ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. 36 ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.
-
5 ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.
-
13 ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే.
నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి.
మానవులంతా చేయాల్సింది ఇదే.
14 ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ,
అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.
-
23 ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”
24 అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు. 25 మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను. 26 అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.
-
28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”
-
25 గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు, 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
-
27 అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
28 నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు. 29 పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. 30 ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”
31 పై నుండి వచ్చిన వాడు అందరికంటే పైవాడే. భూమి నుండి వచ్చిన వాడు భూసంబంధి గనక భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు.
-
19 కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
-
38 ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. 39 ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”
-
15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.
-
19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.
-
2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.
3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
-
9 ఇనపదండంతో నువ్వు వాళ్ళను నలగగొడతావు, మట్టి కుండలాగా వాళ్ళను ముక్కలు చెక్కలు చేస్తావు.
10 కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి.
11 భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి.
12 దేవుడు కుమారుని పక్షం చేరండి. అప్పుడు దేవుడు మీపై కోపించడు. ఆయన కోపం త్వరగా రగులుకున్నప్పుడు మీరు చనిపోరు. దేవునిలో ఆశ్రయం పొందినవాళ్ళు ధన్యులు.
-
9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.
10 నీ రాజ్యం వస్తుంది గాక.
పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
-
14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.
15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.
18 సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ,
-
1 క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2 ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3 యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు. 4 వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.
5 బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి. 6 అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది.
-
15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.
-
19 ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. 20 మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”
-
10 నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
-
34 ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
-
33 యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.
-
27 ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం,
మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి.
ఆయన రాజ్యం నిత్యం నిలిచేది.
అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు.
ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.
-
17 సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.
18 యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? 19 ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. 20 ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. 21 ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు.
-
35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, 36 “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.
37 అందుకు యేసు,
“‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.
38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.
40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.
-
49 ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు. 50 ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు.
-
10 అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.
11 యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. 12 అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు.
-
3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.
-
1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
-
22 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. 23 క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు. 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. 30 మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
-
8 దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు.
-
7 హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. 8 కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
9 ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? 10 మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
11 అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
-
3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.
-
50 నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.
-
33 వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు. 34 అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు. 35 యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
-
46 నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు?
-
7 “మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు. 8 పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు.
9 తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా? 10 అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”
-
21 నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు.
-
1 సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన. 2 దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు. 3 అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు.
-
26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
-
5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.
-
19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.
20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే. 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.
-
22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు. 23 ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.
-
12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.
14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.
-
12 సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి. 13 వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
-
5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.
6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.
Shows Read in context, Share and Copy.