38 Bible Verses About Witchcraft

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Witchcraft
  1. 9 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు. 10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, 11 ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు. 12 వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.

    13 మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. 14 మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.

  2. 16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

    18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  3. 18 మంత్రగత్తెను బతకనివ్వకూడదు.

  4. 12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను.

    జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.

  5. 22 అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. 23 తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.

    24 అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.

  6. 6 బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

  7. 18 ఇదిగో, నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు.

    సీయోను కొండ మీద నివసించే సేనల ప్రభువు యెహోవా మూలంగా సూచనలుగా, మహత్కార్యాలుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.

    19 వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా?

    బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?

    20 ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి.

    వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.

    21 అలాటి వారు ఇబ్బంది పడుతూ ఆకలితో దేశమంతా తిరుగులాడుతారు.

    ఆకలేసి కోపపడతారు. తమ ముఖాలు ఆకాశం వైపుకు ఎత్తి తమ రాజును, తమ దేవుణ్ణి దూషిస్తారు.

    22 భూమి వైపు తేరి చూసి, దురవస్థ, అంధకారం, భరించరాని వేదన అనుభవిస్తారు. ఇతరులు వారిని వారు గాఢాంధకార దేశంలోకి తోలివేస్తారు.

  8. 10 నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు.

    నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి.

    11 వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు.

    కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు.

    నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది.

    12 నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు.

    ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో.

    13 నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు.

    జ్యోతిష్యులనూ, నక్షత్రాలు చూసి, నెలలు లెక్కించి శకునాలు చెప్పేవారినీ పిలిచి,

    నీకు జరగబోయేవి నీ మీదికి రాకుండా తప్పించి నిన్ను రక్షిస్తారేమో ఆలోచించు.

    14 వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది.

    అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు.

    అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు.

    15 నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు.

    నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు.

    నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు.

  9. 21 కాబట్టి యెహోరాము “నా రథాన్ని సిద్ధం చేయండి” అన్నాడు. అతని రథాన్ని సిద్ధం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోరామూ, యూదా రాజు అహజ్యా తమ రథాలపై బయల్దేరి యెహూను కలుసుకోడానికి వెళ్ళారు. యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన భూమి దగ్గర అతణ్ణి ఎదుర్కున్నారు. 22 అప్పుడు యెహోరాము యెహూతో “యెహూ, శాంతి భావంతో ఉన్నావా?” అని అడిగాడు. దానికి యెహూ “నీ తల్లి యెజెబెలు వ్యభిచారం, మంత్రవిద్యలు ఇంత మితిమీరిపోయి ఉండగా ఇక శాంతి భావం ఎక్కడది?” అన్నాడు.

  10. 9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు. 10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు. 11 అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట వినేవారు.

    12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు. 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.

  11. 31 చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.

  12. 26 మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను.

    27 పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”

  13. 9 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు. 10 మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరు నాశనమవుతారు.

  14. 4 ఇందుకు కారణం, అది మంత్ర విద్యలో ఆరితేరిన అందమైన వేశ్య జరిగించిన కామ క్రీడలే. ఆమె తన జారత్వంతో జాతులను అమ్మేసింది. తన ఇంద్రజాలంతో మనుషులను వశపరచుకుంది. 5 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.

  15. 17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది. 18 విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.

    19 అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది. 20 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది.

  16. 6 యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు. 7 అప్పుడు సౌలు “నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను” అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు “అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది” అని అతనితో చెప్పారు.

    8 సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో “మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు” అని కోరాడు. 9 ఆ స్త్రీ, అలాగే “సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడే వారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు” అని అతనితో అంది.

    10 అప్పుడు సౌలు “దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే, 11 ఆ స్త్రీ “నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి” అని అడిగింది. అతడు “సమూయేలును రప్పించాలి” అని కోరాడు. 12 ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి “నీవు సౌలువి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు” అని సౌలును అడిగితే, 13 రాజు “నువ్వు భయపడవద్దు. నీకు ఏమి కనబడిందో చెప్పు” అని ఆమెను అడిగితే “దేవుళ్ళలో ఒకడు భూమిలోనుండి పైకి రావడం నేను చూస్తున్నాను” అని చెప్పింది.

    14 రాజు “అతడు ఏ రూపంలో ఉన్నాడు” అని అడిగాడు. ఆమె “దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అని చెబితే, సౌలు, అతడు సమూయేలు అని గ్రహించి సాగిలపడి నమస్కారం చేశాడు.

  17. 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  18. 11 అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. 12 వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.

  19. 26 రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు.

    శకునాలు చూడకూడదు.

    మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.

  20. 6 చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.

  21. 9 పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి.

    నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి.

  22. 16 మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.

    17 ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. 18 ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.

    19 ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.

  23. 13 సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. 14 మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

  24. 2 తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు.

  25. 14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

    15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

  26. 20 ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు. 21 అలాగే వారు సాగిస్తున్న నరహత్యలనూ, మాయమంత్రాలనూ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేదు.

  27. 23 దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.”

  28. 3 సమూయేలు చనిపోయినపుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి, అతని సొంత పట్టణమైన రమాలో అతణ్ణి పాతిపెట్టారు. సౌలు, చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు.

  29. 17 ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు.

  30. 1 ఇది ఐగుప్తు దేశాన్ని గూర్చిన దైవ ప్రకటన.

    చూడండి! యెహోవా వడిగా పరిగెత్తే మేఘంపై స్వారీ చేస్తూ ఐగుప్తుకి వస్తున్నాడు.

    ఐగుప్తు విగ్రహాలు ఆయన సమక్షంలో కంపిస్తున్నాయి. ఐగుప్తు ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి.

    2 “నేను ఐగుప్తు ప్రజలకు వ్యతిరేకంగా ఐగుప్తు ప్రజలను రేపుతాను. సోదరుడికి వ్యతిరేకంగా సోదరుడూ, పొరుగువాడికి వ్యతిరేకంగా పొరుగువాడూ పోరాటం చేస్తారు.

    పట్టణంతో పట్టణం, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేస్తాయి.

    3 ఐగుప్తు ప్రజల ఆత్మస్థైర్యం క్షీణిస్తుంది. నేను వాళ్ళ ఆలోచనలను నాశనం చేస్తాను.

    వాళ్ళు ఆలోచన కోసం విగ్రహాల దగ్గరికీ, ఆత్మలతో మాట్లాడే వాళ్ళ దగ్గరికీ, కర్ణ పిశాచం ఉన్న వాళ్ళ దగ్గరికీ, సోదె చెప్పేవాళ్ల దగ్గరికీ వెళ్తారు.

    4 నేను ఐగుప్తు ప్రజలను క్రూరుడైన యజమాని చేతికి అప్పగిస్తాను. పీడించే రాజు వాళ్ళని పరిపాలిస్తాడు.”

    ఇది సేనల ప్రభువు అయిన యెహోవా చేస్తున్న ప్రకటన.

  31. 20 యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.

    21 నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది. 22 ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. 23 జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. 24 అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు.

  32. 17 నరపుత్రుడా, తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవచనం పలికే ఇశ్రాయేలు ప్రజల కూతుళ్ళకు విరోధంగా ప్రవచించు. 18 ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ప్రజలను ఉచ్చులోకి లాగేందుకు తమ చేతుల నిండా తాయెత్తులు కట్టుకుని తమ తలలపై రకరకాల ముసుగులు వేసుకునే స్త్రీలకు బాధ. నా ప్రజల ప్రాణాలను ఉచ్చులోకి లాగుతూ మీ ప్రాణాలను కాపాడుకోగలరా?

    19 చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.

    20 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. పక్షులకు వల విసిరినట్టుగా ప్రజల ప్రాణాలకు ఉచ్చు వేయడానికి మీరు ఉపయోగించే తాయెత్తులకి నేను వ్యతిరేకం. వాటిని మీ చేతులనుండి నేను కచ్చితంగా తెంపి వేస్తాను. పక్షులను పట్టినట్టు మీరు వల వేసి పట్టిన ప్రజలను నేను విడిపిస్తాను. 21 వాళ్ళు ఇకపై మీ చేతుల్లో బందీలుగా ఉండకుండాా నేను మీ ముసుగులను చింపి వాళ్ళని విడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

    22 నీతిగల వ్యక్తి నిరుత్సాహపడాలని నేను కోరుకోను. కానీ మీరు మీ అబద్దాల చేత నీతిగల వ్యక్తులను నిరుత్సాహపరిచారు. దుర్మార్గుడు తన పాపం వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకోకుండా మీరు వాడి దుర్మార్గతను ప్రోత్సహించారు. 23 కాబట్టి మీరు ఇకనుండి అబద్ధపు దర్శనాలు చూడరు. జోస్యాలూ చెప్పరు. నా ప్రజలను నేను మీ స్వాధీనం నుండి విడిపిస్తాను. అప్పుడు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

  33. 6 వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్‌ యేసు అనే ఒకణ్ణి చూశారు. 7 ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.

    8 అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి 10 అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. 12 అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.

  34. 5 యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు. 6 అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి. 7 ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.

  35. 6 అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

  36. 9 అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.

  37. 2 గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.

  38. 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.

    నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.