49 Bible Verses About Eating Meat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Eating Meat
  1. 1 దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 2 అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.

    3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. 4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.

    5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.

  2. 24 దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25 దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

    28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

    30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  3. 14 సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది. 15 నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు. 16 మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.

    17 దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం. 18 ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. 19 కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం. 20 ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు. 21 మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది. 22 ఈ విషయాల్లో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు. 23 అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.

  4. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

    4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.

  5. 1 ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. 2 “మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి. భూమి పై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి.

    3 చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు. 4 అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.

    5 పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి. 6 అలాగే కుందేలు నెమరు వేస్తుంది. కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి. 7 ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి. 8 వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం.

    9 జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు. 10 సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.

    11 అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి. 12 నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం.

    13 పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు, 14 గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ, 15 కాకి జాతిలోని ప్రతి పక్షీ, 16 కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.

    17 ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ, 18 తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు, 19 కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.

    20 రెక్కలు ఉండి నాలుగుకాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి. 21 అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు. 22 అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. 23 అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

  6. 1 ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.

    4 అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. 5 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, 6 మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.

    7 అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది. 8 భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు.

    9 అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. 10 ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? 11 తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు.

    12 ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. 13 కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.

  7. 1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. 2 ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. 3 తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. 4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.

  8. 14 అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, “నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి! 15 బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు. 16 మనిషి లోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది” అని అన్నాడు.

    17 ఆయన జనసమూహన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. 18 ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా? 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు).

    20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  9. 28 ‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’ 29 అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”

  10. 23 అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు. 24 ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి. 25 మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు. 26 ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.

    27 ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి. 28 అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు. 29 ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

    31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి. 32 యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి. 33 నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.

  11. 16 కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. 17 ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది.

    18 ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు.

    19 అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది. 20 ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి? 21 “అది పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి?

    22 ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే. 23 వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి.

  12. 36 వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37 అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38 అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? 39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40 అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.

    41 అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు.

  13. 10 ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను. 11 ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.

    12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. 13 అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది.

    14 కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి ‘మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను’ అని ఆదేశించాను.

    15 స్థానికుడైనా, మీ మధ్యలో నివసించే విదేశీయుడైనా చనిపోయిన జంతువునో లేదా మృగాలు చీల్చివేసిన జంతువునో ఆహారంగా తీసుకుంటే, అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.

  14. 19 “కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.

  15. 3 ఎల్కానా షిలోహులో సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికీ, బలులు అర్పించడానికీ ప్రతి సంవత్సరం తన ఊరినుండి అక్కడికి వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు అనే ఇద్దరు యెహోవాకు యాజకులుగా ఉన్నారు.

    4 ఎల్కానా బలి అర్పించే సమయంలో అతని భార్య పెనిన్నాకు, ఆమె కుమారులకు, కుమార్తెలకు భాగం ఇస్తూ వచ్చాడు. 5 అయితే అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం గనక యెహోవా ఆమెకు సంతానం ఇవ్వకపోయినా అతడు ఆమెకు రెండు భాగాలు ఇస్తుండేవాడు. 6 యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేయడంవల్ల ఆమె సవతి పెనిన్నా ఆమెను విసిగిస్తూ, కోపం పుట్టిస్తూ ఉండేది.

    7 ఎల్కానా ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉండేవాడు. హన్నా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను విసిగించేది. అందువల్ల ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది. 8 ఆమె భర్త ఎల్కానా “హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయడం లేదు? నీ మనసులో విచారం ఎందుకు? పదిమంది కొడుకులకన్నా నేను నీకు ఎక్కువ కాదా?” అని ఆమెతో చెబుతూ ఉండేవాడు.

  16. 9 తరువాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు. 10 అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై, 11 ఆకాశం తెరుచుకుని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు. 12 దానిలో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి.

    13 అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. 14 అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. 15 “దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది. 16 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.

  17. 20 ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు.

    21 తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది.

  18. 6 తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.

    7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.

    8 పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది.

    9 నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

  19. 3 మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు. 4 ఎద్దు, గొర్రె, మేక. 5 దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె. 6 జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు. 7 నెమరు వేసేవైనా రెండు డెక్కలు గలదైనా నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువులను తినకూడదు. అవి మీకు నిషిద్ధం. 8 అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు, వాటి శవాలను తాకకూడదు.

    9 నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు. 10 రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం.

    11 పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు. 12 మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద. 13 ఎర్ర గద్ద, నల్ల గద్ద, డేగ. 14 అన్ని రకాల కాకులు. 15 నిప్పు కోడి, నిశి డేగ, అన్ని రకాల డేగలు. 16 చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట, 17 గూడబాతు, బోడి రాబందు, గండ భేరుండం. 18 కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం. 19 ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు. 20 ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు.

    21 దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు.

  20. 8 రాజు తినే ఆహారం, తాగే ద్రాక్షారసం పుచ్చుకుని తనను తాను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిర్ణయించుకున్నాడు. వాటిని తిని, తాగి అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తమకు వడ్డించకుండా చూడమని నపుంసకుల అధికారి దగ్గర అనుమతి కోరుకున్నాడు.

    9 దేవుడు ముఖ్య అధికారికి దానియేలు పట్ల దయ, అభిమానం కలిగేలా చేశాడు. 10 ఆ అధిపతి దానియేలుతో “మీకు రాజ భోజనం, ద్రాక్షారసం వడ్డించమని నాకు ఆజ్ఞాపించిన నా యజమానియైన రాజు గురించి నేను భయపడుతున్నాను. మీతోపాటు ఉన్న ఇతర యువకుల ముఖాల కంటే మీ ముఖాలు పాలిపోయి ఉన్నట్టు రాజు కనిపెట్టినప్పుడు మీవల్ల నాకు రాజునుండి ప్రాణాపాయం కలుగుతుంది” అన్నాడు.

    11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై ముఖ్య అధికారి నియమించిన పర్యవేక్షకునితో దానియేలు మాట్లాడాడు. 12 “నీ దాసులమైన మాకు తినడానికి శాకాహారం, తాగడానికి మంచినీళ్లు మాత్రం ఇప్పించు. అలా పది రోజులపాటు ఇచ్చి మమ్మల్ని పరీక్షించు. 13 తరువాత మా ముఖాలను, రాజు నియమించిన భోజనం తిన్న ఇతర యువకుల ముఖాలను పరీక్షించి నీకు తోచినట్టు నీ దాసులమైన మా పట్ల జరిగించు.” 14 ఆ పర్యవేక్షకుడు అందుకు అంగీకరించాడు. పది రోజులపాటు వాళ్ళను పరీక్షించాడు.

    15 పది రోజుల గడిచాయి. రాజు నియమించిన భోజనం తినే యువకుల ముఖాల కంటే వీరి ముఖాలు ఆరోగ్యకరంగా కళకళలాడుతూ కనిపించాయి. 16 ఆ పర్యవేక్షకుడు రాజు వాళ్లకు ఇవ్వమని చెప్పిన మాంసాహారం, ద్రాక్షారసం స్థానంలో శాకాహారం ఇవ్వడం మొదలుపెట్టాడు. 17 ఈ నలుగురు యువకుల విషయం ఏమిటంటే, దేవుడు వారికి జ్ఞానం, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత, తెలివితేటలు అనుగ్రహించాడు. దానియేలుకు సకల విధాలైన దైవదర్శనాలకు, కలలకు అర్థాలు, భావాలు వివరించగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు.

    18 గడువు ముగిసిన తరువాత ఆ యువకులను తన ఎదుట ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. నపుంసకుల అధికారి వాళ్ళను రాజు సమక్షంలో నిలబెట్టాడు. 19 రాజు వాళ్ళను పరిశీలించాడు. వాళ్ళందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలతో సాటియైన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. కాబట్టి రాజు వాళ్ళను తన ఆస్థానంలో ఉద్యోగులుగా నియమించాడు. 20 రాజు వీళ్ళతో సంభాషించి వీళ్ళ తెలివితేటలు పరీక్షించాడు. జ్ఞానం, వివేకం ప్రదర్శించే ప్రతి విషయంలో ఈ యువకులు తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికుల కంటే, ఆత్మలను సంప్రదిస్తామని చెప్పుకునే వారి కంటే పది రెట్లు సమర్థులని రాజు గ్రహించాడు. 21 కోరెషు చక్రవర్తి పాలన మొదటి సంవత్సరం వరకూ దానియేలు అక్కడ ఉన్నాడు.

  21. 42 నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్ళపై నడిచేవైనా, అనేకమైన కాళ్ళు ఉన్నవైనా ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి.

    43 ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు. అశుద్ధం కాకూడదు. 44 ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు. 45 మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తుదేశంలో నుండి బయటకు తీసుకు వచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి.”

    46 ఇది జంతువులూ, పక్షులూ, నీళ్ళలో నివసించే ప్రాణులూ, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం. 47 ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయడం దీని ఉద్దేశం.

  22. 2 మూర్ఖంగా ఉండే ప్రజలకోసం రోజంతా నా చేతులు చాపాను.

    వాళ్ళు తమ ఆలోచనలననుసరిస్తూ చెడు దారిలో నడుస్తూ ఉన్నారు.

    3 తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు.

    వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.

    4 వాళ్ళు సమాధుల్లో కూర్చుంటారు. రాత్రంతా మేల్కొని ఉంటారు.

    తినకూడని మాంసం పులుసుతో, వాళ్ళ పాత్రల్లో పందిమాంసం తింటారు.

    5 ‘మా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. నీకంటే నేను పవిత్రుణ్ణి.’ అని వాళ్ళంటారు.

    వీళ్ళంతా నా ముక్కుల్లో పొగలాగా రోజంతా మండే నిప్పులాగా ఉన్నారు.

    6 యెహోవా ఇలా చెబుతున్నాడు. ఇది నా ఎదుట గ్రంథంలో రాసి ఉంది.

    నేను ఊరుకోను. ప్రతీకారం చేస్తాను. తప్పకుండా వీళ్ళను నేను శిక్షిస్తాను.

  23. 1 ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది. 2 అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి. 3 యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది.

    4 కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు? 5 ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి. 6 ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు.

    7 ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది. 8 ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.

    9 రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది. 10 ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.

    11 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు. 12 ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?

    13 ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు. 14 ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది. 15 నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”

    16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు. 17 అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.

    18 నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు. 19 ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు. 20 ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.”

    21 దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు. 22 ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు. 23 అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.

    24 మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు. 25 అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.

    26 ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు. 27 అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.

    28 మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు. 29 దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు. 30 అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.

    31 అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి. 32 కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.

    33 ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు. 34 మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది. 35 ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.

  24. 20 మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు. 21 నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే, 22 యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.

    23 అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. 24 మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి. 25 మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.

  25. 1 నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు.

    2 నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో.

    3 అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి.

  26. 10 ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే, 11 ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు. 12 అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, “నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు” అని ఆయనతో అన్నారు. 13 ఆయన, “పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది. 14 వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.

    15 అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు. 16 అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  27. 17 మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.”

  28. 22 ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. 23 “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ మీరు తిన కూడదు. 24 అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వునూ, అడవి మృగాలు చీల్చి వేసిన పశువు కొవ్వునూ ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.

    25 యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి. 26 అలాగే పక్షి రక్తం గానీ, జంతువు రక్తం గానీ మీ ఇళ్ళల్లో తినకూడదు. 27 ఎవడు రక్తాన్ని తింటాడో వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”

  29. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  30. 1 మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు. 2 “నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట. 3 ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి.

    4 ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి.

    5 మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. 6 ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. 7 కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి.

    8 ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. 9 దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. 10 తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.

    11 మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి.

    12 నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. 13 మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.

  31. 11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను. 12 వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.” 13 అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.

  32. 26 రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు.

    శకునాలు చూడకూడదు.

    మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.

  33. 31 మీరు నాకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు గనుక పొలాల్లో మృగాలు చీల్చిన జంతు మాంసం తినకూడదు. దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.”

  34. 15 అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.

  35. 2 ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను. 3 మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.

  36. 20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. 21 అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు.

    22 “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. 23 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. 24 నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.

  37. 26 యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. 27 పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. 28 అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు. 29 దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు. 30 వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? 31 ‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు. 32 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు. 33 అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.” 34 అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు.

    35 దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు. 36 కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు. 37 తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను. 38 ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. 39 ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”

  38. 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా!

  39. 4 తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. 5 యేసు, “పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” 6 అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు.

    7 అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. 8 ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9 ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. 10 అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి.

    అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. 12 అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. 13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు. 14 యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.

  40. 25 అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.

  41. 6 అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు. 7 తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు. 8 తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.

    9 వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు.

  42. 1 తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు. 2 అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు. 3 ప్రజలు వారితో “మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు” అన్నారు.

  43. 29 నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి. ముంగిస, ఎలుక, బల్లి జాతికి చెందిన ప్రతి జీవీ, 30 తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఊసరవెల్లి.

    31 పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.

  44. 27 మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.

  45. 33 “ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు” అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు “మీరు దేవునికి విశ్వాస ఘాతకులయ్యారు. ఒక పెద్ద రాయి నా దగ్గరకి దొర్లించి తీసుకురండి” అని చెప్పి, 34 “అందరూ తమ తమ ఎద్దులను, గొర్రెలను నా దగ్గరికి తీసుకు వచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలసిన మాసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు” అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు.

  46. 1 జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది.

    2 పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది.

    3 తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది.

    4 “జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది.

    5 తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి.

    6 ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.”

  47. 6 ఈ పర్వతంపై సేనల ప్రభువు యెహోవా ప్రజలందరి కోసం కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేస్తాడు. మూలుగు ఉన్న కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేస్తాడు.

  48. 21 సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి.

  49. 14 కానీ నేను “అయ్యో, ప్రభూ! యెహోవా! నేను ఏనాడూ అపవిత్రం కాలేదు. చిన్నప్పట్నించి చనిపోయిన దాన్ని గానీ, మృగాలు చంపిన దాన్ని గానీ నేను తినలేదు. అపవిత్రమైన మాంసం ఏనాడూ నా నోట్లో ప్రవేశించలేదు” అన్నాను.