105 Bible Verses About The Holy Spirit

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About The Holy Spirit
  1. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

    5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. 9 దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు. 10 క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. 11 చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.

  2. 9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.

    11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. 12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.

    14 సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. 15 ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు. 16 ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.

  3. 13 అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. 14 ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. 15 నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.

  4. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

    16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17 ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18 నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను. 19 కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.

  5. 25 మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

  6. 3 అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు.

    4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. 5 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు. 6 వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. 7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. 8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, 9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. 10 ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. 11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.

  7. 14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.

  8. 26 “తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27 మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు.

  9. 10 అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు.

    కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు.

    11 ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు.

    వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి?

    వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?

    12 మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి?

    13 తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి?

    లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు.

    14 లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు.

    నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు.

  10. 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.

    అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

    గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,

    2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.

    3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.

    నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.

  11. 4 ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5 యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”

    6 వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన, 7 “కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.

    8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.

  12. 44 పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. 46 ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. 47 అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి 48 యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.

  13. 1 యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.

    2 జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

  14. 2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.

    4 కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు. 5 వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.

  15. 1 పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. 2 అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. 3 అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి. 4 అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.

  16. 25 మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.

    26 కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27 నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. 28 నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.

  17. 7 “అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. 9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. 11 ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.

  18. 14 అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు. 15 అయితే ఇప్పటికీ వారు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని 16 వారు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు.

    17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. 18 మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.

  19. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

  20. 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

  21. 15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. 16 అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.

    17 “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు. 18 వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.

  22. 14 ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.

    16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

  23. 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

    25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

  24. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

    30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  25. 7 నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను?

    8 ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు.

    9 నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను.

    10 అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.

  26. 13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

  27. 1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా! 2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా? 3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?

    4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? 5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?

  28. 6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ 7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.

    8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.

  29. 9 అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా” 10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.

    11 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు. 12 కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.

    13 నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే 14 నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.

  30. 19 వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20 మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.

  31. 32 యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను. 33 నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు. 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.”

  32. 9 అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని 10 అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.

  33. 17 దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం.

  34. 6 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు.

  35. 1 దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.

    2 “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.

  36. 31 వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.

  37. 10 మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. 11 వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. 12 తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.

  38. 19 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు. 20 లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి. 21 ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.

  39. 6 యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది. 7 దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి.

  40. 4 దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది.

  41. 16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.

  42. 11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.

  43. 34 “దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. 35 ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. 36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. 37 యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. 38 అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.

  44. 13 మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది. 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  45. 2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.

    4 దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 5 ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.

  46. 11 వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు. 12 మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు.”

  47. 37 ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి. 38 లేఖనాలు చెబుతున్నాయి, నాపై విశ్వాసముంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పాడు. 39 తనపై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.

  48. 5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.

    6 తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు.

  49. 18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.

    పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు.

    చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,

    19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు”

    అని రాసిన చోటు ఆయనకు దొరికింది.

    20 ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. 21 సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.

  50. 31 కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.

  51. 28 ‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’ 29 అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”

  52. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  53. 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 2 “యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు. 3 అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను. 4 అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. 5 నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.

    6 దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.

  54. 10 వారు ఆ కొండ దగ్గరకి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు.

  55. 13 సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.

    14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది,

  56. 21 ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”

  57. 8 పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, 9 ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 10 మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. 11 ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

  58. 28 తరువాత నేను ప్రజలందరి మీద

    నా ఆత్మను కుమ్మరిస్తాను.

    మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు.

    మీ ముసలివారు కలలుకంటారు.

    మీ యువకులకు దర్శనాలు వస్తాయి.

    29 ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.

    30 ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను.

    భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.

    31 యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు

    సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.

    32 యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది.

    యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు.

    యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”

  59. 21 ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది. 22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”

  60. 5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. 7 నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు అదొక విడ్డూరంగా భావించవద్దు. 8 గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”

  61. 16 యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే,

    17 ‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను.

    మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు.

    మీ యువకులు దర్శనాలు చూస్తారు.

    మీ వృద్ధులు కలలు కంటారు,

    18 ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.

  62. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

  63. 27 ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి.

  64. 9 నూను కొడుకు యెహోషువ, జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

  65. 20 వారికి ఉపదేశించడానికి దయ గల నీ ఆత్మను ఇచ్చావు. నువ్వు కురిపించే మన్నాను ఆపివేయ లేదు. వారి దాహం తీర్చడానికి నీళ్ళిచ్చావు.

  66. 1 ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు.

    ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు.

  67. 21 “నేను వారితో చేసే నిబంధన ఇది. నీ మీద ఉన్న నా ఆత్మ, నేను నీ నోట ఉంచిన మాటలు, నీ నోటినుంచీ నీ పిల్లల నోటి నుంచీ ఇది మొదలుకుని ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా చెబుతున్నాడు.

  68. 10 యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.

  69. 25 యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. 26 అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. 27 ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. 28 సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు,

    29 “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!

    30-32 అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా

    నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”

  70. 29 ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు.

  71. 10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిషాతాయిమును జయించాడు.

  72. 1 యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు. 2 తండ్రి అయిన దేవుని భవిష్యద్‌ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక.

  73. 16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?

  74. 35 ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.

  75. 33 కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు.

  76. 8 అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ

    ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి

    యెహోవా ఆత్మమూలంగా

    సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.

  77. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.

    46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.

    49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.

  78. 34 దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన అపరిమితంగా ఆత్మను దయ చేస్తాడు.

  79. 63 జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.

  80. 3 కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. 4 మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు.

    5 ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు.

  81. 6 నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే కాదు. నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా కూడా వచ్చాడు. దేవుడు ఆత్మ రూపి గనక ఆత్మే ఇది సత్యమని సాక్షమిస్తున్నాడు.

    7 సాక్ష్యం ఇచ్చే వారు ముగ్గురున్నారు. 8 ఆత్మ, నీళ్ళు, రక్తం-ఈ మూడూ ఒకే సాక్ష్యం చెబుతున్నాయి. 9 మనుషుల సాక్ష్యం మనం స్వీకరిస్తాం. కాని దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. దేవుని సాక్ష్యం ఆయన కుమారుణ్ణి గూర్చినదే. 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం ఆ వ్యక్తి నమ్మలేదు.

  82. 3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.

  83. 14 ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండుగాక.

  84. 14 అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 15 ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు.

  85. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

    19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  86. 16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  87. 7 కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా,

    “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే

    8 అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు

    తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా

    మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.

    9 నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా

    మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు.

    10 కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను.

    కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు.

    11 వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.”

  88. 14 శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. 15 దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు,

    16 “‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు.

    ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’”

    17 తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు.

  89. 18 చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19 వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.

    20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.

  90. 7 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”

  91. 38 ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు. 39 ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.

  92. 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.

    26 ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 27 నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.

    29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు.

  93. 14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.

  94. 24 దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.

  95. 3 యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.

  96. 6 యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.

  97. 16 నా దగ్గరికి రండి. ఈ విషయం వినండి.

    మొదటినుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. అది జరిగేటప్పుడు నేనక్కడే ఉన్నాను.

    ఇప్పుడు యెహోవా ప్రభువు తన ఆత్మతో నన్ను పంపాడు.

    17 నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు.

    “నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను.

    నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను.

  98. 11 పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.

    12 తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.

  99. 15-16 యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,

    18 “ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను.

    ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను.

    ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.

  100. 16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. 17 తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”

  101. 21 అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22 ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23 మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.

  102. 18 అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను. 20 నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను.

  103. 3 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను.

    4 మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. 5 అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను.

  104. 21 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి 22 మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.

  105. 13 దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు.