59 Bible Verses About Disaster

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Disaster
  1. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

    31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

  2. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  3. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

    5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.

    7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.

  4. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  5. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

  6. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.

  7. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

    1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

    2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

    3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

  8. 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.

    అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

    గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,

    2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.

    3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.

    నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.

  9. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  10. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  11. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

    10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు.

  12. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

  13. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  14. 6 అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు. 7 జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. 8 ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.

    9 “అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు. 10 ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు. 11 అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు. 12 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. 13 కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. 14 రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.

    15 “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక), 16 యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. 17 మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు. 18 పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.

    19 అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం. 20 అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి. 21 ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు. 22 ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.

  15. 3 తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.

    4 నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!

  16. 1 కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు. 2 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా? 3 కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.

    4 అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా? 5 కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.”

  17. 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. 28 ‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు.

  18. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

  19. 4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

  20. 50 నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.

  21. 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు?

  22. 4 నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను. మాకు బాధలెన్నున్నా సరే ఆనందంతో పొంగి పోతున్నాను. 5 మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి.

    6 కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు. 7 తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.

  23. యాత్రల కీర్తన

    1 కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?

    2 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.

  24. 2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

    3 యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి.

    నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను.

  25. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.

  26. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  27. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.

    28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు.

  28. 11 తన రాజ్యానికీ, మహిమకూ మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండాలని మేము మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ సాక్ష్యం ఇస్తూ 12 తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.

  29. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

  30. 7 వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.

  31. 31 ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.

    32 ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.

    33 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.

  32. 7 యెహోవా ఉత్తముడు, బాధ కలిగినప్పుడు ఆయన ఆశ్రయం కలిగిస్తాడు. తనపై నమ్మకం ఉంచేవాళ్ళు ఆయనకు తెలుసు.

  33. 13 వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. 14 యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు. 15 హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు.

    ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’

    అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.

    16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.

    17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.

    రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.

    వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది”

    అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.

  34. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  35. 7 సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. 8 అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. 9 అతని భార్య వచ్చి అతనితో “నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో” అంది.

    10 అప్పుడు యోబు “నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేళ్ళు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి గదా” అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు తన నోటిమాటతో ఎలాంటి పాపమూ చేయలేదు.

  36. ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు దగ్గర నుండి పారిపోయి గుహలో చేరినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).

    1 దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.

    2 మహోన్నతుడైన దేవునికి, నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను.

  37. 1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.

    2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.

  38. 11 బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.

  39. 4 దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.

  40. 7 మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.

    8 జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. 9 మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.

    11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.

    12 సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. 13 నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.

  41. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,

    “విజయం మరణాన్ని మింగివేసింది”

    అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

    55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

    56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

    57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.

  42. 16 అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.

    17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.

  43. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  44. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”

  45. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

    10 అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి,

  46. 6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.

    7 అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.

  47. 5 నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.

  48. 76 నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.

  49. 25 అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.

    26 యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.

  50. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  51. 13 బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు.

    ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.

  52. 5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

  53. 12 యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను.

    రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను.

    మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు.

    13 తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.”

    14 మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి.

    యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు.

  54. 7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.

    8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.

  55. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు.

  56. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  57. 8 అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు. 9 చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు. 10 యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము.

  58. 1 భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.

  59. 17 ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. 18 అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది.

    19 ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. 20 ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది. 21 ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.