75 Bible Verses About Worrying
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.
25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?
27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
-
4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
-
6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11 ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్.
-
22 తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు. 23 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. 25 పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? 26 కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి. 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.
28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. 30 లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు.
-
25 విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
-
18 నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
19 నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
20 దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
-
27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. 28 ‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.
30 ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు. 31 నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.”
-
22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.
23 దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.
-
దావీదు కీర్తన
1 చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.
2 ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.
3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.
4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.
5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.
6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.
7 యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.
8 కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.
9 దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
10 ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.
11 నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.
-
28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”
-
10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.
నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.
దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.
నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.
11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.
నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు
12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.
నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.
13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.
14 పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’” అని యెహోవా సెలవిస్తున్నాడు.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు.
-
22 ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
-
ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన.
1 దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.
2 గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు.
3 నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.
4 నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?
-
32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది. 35 మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
-
1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.
-
38 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.
41 అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.
-
5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు. 6 కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.
7 మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి.
-
4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.
5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.
6 అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.
7 యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.
8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.
-
5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.
6 వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు.
7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.
8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.
-
25 మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?
-
28 ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది.
-
14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.
-
11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
-
18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు. 19 కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
-
4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.
-
3 తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
-
33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.
-
10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
-
7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.
-
5 నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.
7 అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”
-
6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”
-
23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. 24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. 26 యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. 27 శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
-
16 శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!
-
35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,
“నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.
వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”
37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.
-
దావీదు కీర్తన.
1 యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?
2 నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.
3 నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను.
-
యాత్రల కీర్తన
1 కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.
-
3 బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి.
4 బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు.
చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”
-
30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.
31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
-
8 అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు. 9 చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు. 10 యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము.
-
6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.
-
17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.
18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.
19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.
-
7 అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై,
-
5 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని
-
6 దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
-
7 నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను.
నా దేవునికి విన్నవించుకున్నాను.
ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు.
నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
-
13 అందుకు దావీదు “నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను. యెహోవా మహా కృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను” అని గాదుతో అన్నాడు.
-
2 ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక.
-
17 నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
-
9 యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
10 నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
-
8 నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను.
-
10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.
-
2 నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు.
-
2 నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
-
6 వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
-
143 బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
-
యాత్రల కీర్తన
1 నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు.
-
25 భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
-
13 ఆకాశం కింద జరుగుతున్న దాన్ని తెలివిగా వెతికి గ్రహించడంపై నా మనస్సు నిలిపాను. మానవులు నేర్చుకోవడం కోసం దేవుడు వారికి ఏర్పాటు చేసిన పని చాలా కష్టంతో నిండి ఉంది.
-
19 నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను.
-
20 యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది.
నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది.
వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది.
-
9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు. 10 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.
11 వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది. 12 యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.
-
27 ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను.
-
21 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, “మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
-
13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.
-
17 మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వారు లెక్క అప్పజెప్పే వారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వారు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారుగా ఉండడానికి వారికి లోబడండి. వారు విచారంగా ఉండడం మీకు మేలుకరం కాదు.
-
16 ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు.
యెరూషలేమూ, భయపడకు.
సీయోనూ, ధైర్యం తెచ్చుకో.
17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.
ఆయన శక్తిశాలి.
ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు.
నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.
-
5 ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.
6 యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?
7 యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.
8 మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
-
19 దుర్మార్గులను చూసి అందోళన చెందకు. భక్తిహీనుల విషయం మత్సరపడకు.
20 దుర్జనుడికి పుట్టగతులుండవు. భక్తిహీనుల దీపం కొడిగడుతుంది.
21 కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు.
22 అలాటి వారికి హఠాత్తుగా ఆపద వాటిల్లుతుంది. వారి కాలం ఎప్పుడు ముగిసి పోతుందో ఎవరికి తెలుసు?
-
11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.
-
6 అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
-
13 మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు? 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.
-
3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
-
19 వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20 మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.
-
29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.
Shows Read in context, Share and Copy.