49 Bible Verses About The Devil

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About The Devil
  1. 3 ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి. 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.

    5 ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు. 6 ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1, 260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.

    7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.

    10 అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. 11 వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.

    12 కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.

    13 తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ రెక్కల సర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు. 14 కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెండు రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది.

  2. 1 తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు. 3 వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి.

    4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.

    5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.

    7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు. 9 వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.

    10 వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.

    11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

    13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.

  3. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

  4. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

    10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11 ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌.

  5. 11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 12 వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.

    13 వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.

    15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.

  6. 6 ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. 7 యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. 8 అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు.

    9 అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? 10 నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. 11 అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు. 12 అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.

  7. 7 పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

  8. 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.

  9. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

    7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.

  10. 12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?

    13 నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను,

    14 మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. 15 అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.

  11. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

  12. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.

  13. 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.

    13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

  14. 1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. 2 సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు. 3 యెహోషువ మురికి దుస్తులు ధరించుకుని దూత సమక్షంలో ఇంకా నిలబడి ఉన్నాడు.

    4 అప్పుడు దూత అక్కడ నిలబడి ఉన్నవారిని పిలిచి, ఇతని మురికి దుస్తులు తీసివేయమని ఆజ్ఞాపించాడు. “నేను నీ అపరాధాలను తొలగించాను. ప్రశస్తమైన దుస్తులతో నిన్ను అలంకరిస్తున్నాను” అని చెప్పాడు. 5 “అతని తల మీద తెల్లని పాగా పెట్టించండి” అని ఆయన చెప్పినప్పుడు వారు యెహోవా దూత సమక్షంలో అతని తలకు తెల్లని పాగా పెట్టి, దుస్తులు ధరింపజేసి అతణ్ణి అలంకరించారు.

    6 అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలా చెప్పాడు. 7 సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.

    8 ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుని ఉన్న నీ సహకారులు జరగబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నువ్వూ, వాళ్ళూ నా మాట ఆలకించాలి. అది ఏమిటంటే,

    ‘చిగురు’ అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను.

    9 యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని జాగ్రత్తగా చూడండి.

    ఆ రాయికి ఏడు కళ్ళు ఉన్నాయి.

    నేను దాని మీద అక్షరాలు చెక్కుతాను.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

    “ఒక్క రోజులో నేను ఈ దేశ ప్రజల అపరాధాలను తొలగిస్తాను. 10 ఆ రోజుల్లో మీరు ద్రాక్షచెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చోవడానికి ఒకరినొకరు పిలుచుకుంటారు.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

  15. 17 ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18 అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19 ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20 అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.

  16. 30 అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది. 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం.

  17. 41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి.

  18. 13 దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది. 14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.

  19. 1 మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. 2 యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అపవాదిని అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని యెహోవాకు జవాబిచ్చాడు.

    3 అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు.

    4 అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. 5 మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీదా, దేహం మీదా దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు” అన్నాడు. 6 అప్పుడు యెహోవా “అతణ్ణి నీకు స్వాధీనం చేస్తున్నాను. అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు” అని చెప్పాడు.

    7 సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు.

  20. 24 పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.

    26 ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 27 నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు. 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.

    29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు. 30 నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.

  21. 1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు. 5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, 6 “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే,

    ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.

    నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు.

    7 అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు. 8 అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. 9 “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు. 10 అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.

    11 అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.

  22. 31 “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32 నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” 33 కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. 34 అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.

  23. 10 మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను. 11 నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.

  24. 30 ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు.

  25. 7 అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు. 8 అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

    10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు.

  26. 21 అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు. 22 అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు.

  27. 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

    4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.

  28. 26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి.

  29. 1 ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.

    2 ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. 4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.

    5 ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది.

  30. 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు. 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.

  31. 36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37 అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

  32. 19 ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.

  33. 1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

    3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.

    5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. 6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు.

  34. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  35. 17 సోదరులారా, మేము కొంతకాలం హృదయం విషయంలో కాకున్నా శరీర రీతిగా దూరంగా ఉన్నాము. అందుచేత మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.

    18 కాబట్టి మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు.

  36. 5 అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.

  37. 27 అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి” అన్నాడు.

  38. 1 పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది. 2 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.

    3 అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. 4 దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు. 5 దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు. 6 అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.

  39. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  40. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  41. 22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు.

    23 యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? 24 చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25 చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా.

  42. 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  43. 20 అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.

  44. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

  45. 13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.

  46. 8 వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు.

    9 తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. “ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా 10 వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.

    11 వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు. 12 దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి.”

  47. 13 పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.

  48. 1 మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.

    2 ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి ఈ విషయమై మీరు విలపించాలి గదా. ఇలాటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి. 3 నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను. 4 ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా, 5 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.

  49. 9 ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్నకొమ్ము మొలిచింది. అది దక్షిణానికి, తూర్పుకు, ఇశ్రాయేలు మహిమాన్విత దేశం వైపుకు అత్యధికంగా ప్రబలింది.

    10 ఆకాశ సైన్యంతో యుద్ధమాడేటంతగా అది పెరిగిపోయి నక్షత్రాల్లో కొన్నిటిని పడేసి కాళ్లతో తొక్కేస్తూ ఉంది. 11 ఆ సైన్యాధిపతికి విరోధంగా గొప్పదైపోయి, అనుదిన బలి అర్పణలను ఆపి వేసి ఆయన ఆలయాన్ని పాడు చేసింది. 12 తిరుగుబాటు మూలంగా ఆ మేకపోతు కొమ్ముకు ఒక సేన ఇవ్వడం జరిగింది. అతడు సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టానుసారంగా జరిగిస్తూ వర్థిల్లాడు.