46 Bible Verses About Going to Heaven
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు. 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.
-
1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు. 5 తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.
-
20 ఎందుకంటే మనం అయితే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. 21 సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.
-
4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.
8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు.
-
1 భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2 పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాం. 3 ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం. 4 ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడాలి అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలని మన ఆశ.
5 దీని కోసం మనలను సిద్ధపరచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు. 6 అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం. 9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”
-
13 వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు. 14 ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. 15 ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. 16 కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు.
-
13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.
-
1 అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ, 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు. 4 ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది. 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.
-
39 వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు.
40 కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41 మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.
42 తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43 అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.
-
9 ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
10 ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి, 11 “గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.
-
21 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. 22 అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. 23 ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. 24 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.
-
10 అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి. 11 ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
-
2 క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 3 అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 4 దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు.
-
2 అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
4 అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.
5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
-
12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
-
10 వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.
11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.
13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.
-
19 “భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
-
13 ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. 14 జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.
-
13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
-
22 ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు. 23 పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు. 24 ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
-
13 అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. 14 అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు. 15 అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. 16 వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు.
17 ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”
-
22 అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం. 24 వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
25 రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు. 26 వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు. 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
-
21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
-
13 అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లలను ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు. అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని గద్దించారు. 14 అప్పుడు యేసు, “చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే” అని వారితో చెప్పాడు.
-
31 “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.
34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.
37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.
41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.
44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”
-
25 మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
27 అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. 28 అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు.
29 చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, 30 వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. 31 అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.
34 అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
-
5 ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. 6 అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి). 7 లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.”
8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,
“దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,
మీ హృదయంలో ఉంది.”
మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15 ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది. 16 అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా? 17 కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.
-
1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. 4 మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.
-
7 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”
-
4 యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.
5 యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.
6 దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.
7 ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.
-
2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.
-
5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, 6 “ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. 7 “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. 8 ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. 9 నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు.
10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. 11 తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. 12 అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” 13 యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు.
-
19 “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు. 20 లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు. 21 ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి. 22 ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
23 “అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి. 24 ‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.
25 దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. 26 అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది,’ అన్నాడు.
27-28 అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు. 29 అందుకు అబ్రాహాము, ‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు. 30 అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. 31 అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు.
-
36 కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”
-
26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు.
29 ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30 “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. 31 సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.
-
2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.
3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.
-
29 నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
-
24 కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు.
-
32 మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను. 33 ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.
-
40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.
-
1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు. 2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, 3 “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
-
21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.
-
39 ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”
-
50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.
51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,
“విజయం మరణాన్ని మింగివేసింది”
అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.
-
19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.
Shows Read in context, Share and Copy.