87 Bible Verses About Giving to Others

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Giving to Others
  1. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

    9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.

    10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

    12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. 14 మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. 15 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

  2. 1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.

    3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  3. 1 సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. 2 విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది. 3 వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు. 4 వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు.

    5 అంతేకాక వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమెన్నడూ తలంచలేదు. 6 కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము.

    7 మీరు ప్రతి విషయంలో అంటే విశ్వాసంలో ఉపదేశంలో జ్ఞానంలో శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి.

    8 ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను. 9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.

    10 ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే. 11 కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి. 12 అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి కాదు. 13 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే.

    14 “ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.

    15 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.

  4. 27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.

    29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. 31 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.

    32 మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. 33 మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!

    34 మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.

    35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

  5. 7 మీ పూర్వీకుల కాలం నుండి మీరు నా నియమాలను లక్ష్యపెట్టకుండా వాటిని తిరస్కరించారు. అయితే ఇప్పుడు మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీవైపు తిరుగుతానని సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పినప్పుడు, ‘మేము దేని విషయంలో తిరగాలి?’ అని మీరు అంటారు. 8 మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు.

    9 ఈ ప్రజలందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపానికి పాత్రులయ్యారు. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

    11 “మీ పంటను పురుగులు తినివేయకుండా నేను గద్దిస్తాను. అవి మీ భూమిపై ఉన్న పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్షచెట్ల ఫలాలు అకాలంలో రాలిపోవు. ఇది సైన్యాలకు అధిపతియైన యెహోవా వాక్కు. 12 ఇక అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అన్య దేశాల ప్రజలంతా మిమ్మల్ని ధన్య జీవులు అంటారు అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  6. 32 ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి. 33 నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. 34 నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.

    35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”

  7. 24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.

    25 ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.

  8. 7 మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. 8 మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. 9 అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.

    10 కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 11 పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  9. 7 వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8 రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

  10. 15 ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు. 16 ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు.

    17 నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను. 18 నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి. 19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.

  11. 41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. 42 అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. 43 ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. 44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.

  12. 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.

  13. 9 యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

    10 అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

    11 కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.

    12 ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.

  14. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.

  15. 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.

  16. 1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. 2 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. 3 అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.

  17. 34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

    37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.

  18. 9 ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.

  19. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

  20. 27 పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.

  21. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

  22. 1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. 2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి. 3 నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను. 4 నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.

  23. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  24. 2 నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను.

    3 ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను. 4 గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను.

    5 ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు. 6 అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి 7 మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3, 750 మణుగుల ఇనుము ఇచ్చారు. 8 తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.

  25. 9 వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.

  26. 32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

    36 సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’ 37 ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

  27. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

    8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.

  28. 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.

  29. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.

  30. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.

  31. 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.

  32. 17 వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనిపించకుండా, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడూ తన శక్తి కొలదీ ఇవ్వాలి.

  33. 17 పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

  34. 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24 యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.

  35. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

  36. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

  37. 17 ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

    18 యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

    20 అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు. 21 యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు. 22 అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

  38. 17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి. 18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.

  39. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.

  40. 35 నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే నీవు ఒక పరదేశికి, నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చెయ్యాలి. 36 అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి. 37 డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోకూడదు. నీ దగ్గరున్న ఆహారపదార్థాలను లాభం వేసుకుని అతనికి అమ్మకూడదు.

  41. 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. 34 అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.

    35 మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు.

  42. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  43. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  44. 14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

    15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.

  45. 15 పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్ళు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన యెరికోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళారు.

  46. 9 హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధానయాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు. 10 “యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.”

  47. 68 గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.

    69 ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.

  48. 41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.

    44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

  49. 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ.

  50. 3 నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే. 4 తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా? 5 మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? 6 బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?

    7 ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు?

  51. 14 మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

    16 అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు.

  52. 14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.

    15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి.

  53. 6 అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.

  54. 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు.

  55. 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.

  56. 27 లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతు గాని, స్వాస్థ్యం గాని లేదు.

    28 మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. 29 అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.”

  57. 3 కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

    4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.

    5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.

  58. 14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.

  59. 13 యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. 14 వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? 15 మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు. 16 వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు. 17 అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు.

  60. 10 అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 11 అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.

  61. 10 మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.

  62. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

  63. 2 “నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.

  64. 5 మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,

  65. 17 నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.

  66. 25 నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.

    26 అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు.

  67. 42 శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”

  68. 23 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.

  69. 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”

  70. 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.

  71. 7 అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు.

  72. 10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.

  73. 27 తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.

  74. 53 తరువాత ఆ సేవకుడు వెండీ బంగారు నగలనూ, వస్త్రాలనూ బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికీ, సోదరుడికీ విలువైన కానుకలిచ్చాడు.

  75. 8 ఎవరైనా నీవు నిర్ణయించిన వెల చెల్లించలేనంత పేద వాడైతే అతడు యాజకుని ఎదుటికి రావాలి. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్న వాడి తాహతు చొప్పున వాడికి వెలను నిర్ణయించాలి.

  76. 4 యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.

    5 ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.

    6 యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు.

  77. 21 దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు.

    22 యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు.

  78. 5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

  79. 16 ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.

  80. 26 రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు.

  81. 6 నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,

    దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,

    అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.

    7 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.

    దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.

  82. 6 “కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు. 7 మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ “ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?” అంటారు. “యెహోవా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా 8 గుడ్డి దాన్ని బలిగా అర్పించినప్పుడు అది దోషమే కదా. కుంటి దాన్ని, జబ్బు పడిన దాన్ని అర్పించినప్పుడు అది దోషం కాదా? అలాంటి వాటిని మీ యజమానికి ఇస్తే అతడు మిమ్మల్ని స్వీకరిస్తాడా? మిమ్మల్ని కనికరిస్తాడా?” అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.

    9 ఇప్పుడు దయ చూపమని ఆయనను ప్రాధేయపడండి. మీరే గదా ఆయనను అవమాన పరచారు. మీరు చేసిన పనులను బట్టి మీలో ఎవరినైనా ఆయన స్వీకరిస్తాడా? అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు. 10 “మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను” అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.

  83. 6 యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. 7 ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది. 8 అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! 9 దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు. 10 యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది. 11 బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. 12 ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది. 13 నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.”

  84. 42 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి.

  85. 34 దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన అపరిమితంగా ఆత్మను దయ చేస్తాడు.

  86. 27 ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు. 28 వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది. 29 అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు. 30 వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.

  87. 28 దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.