36 Bible Verses About Generosity
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.
-
9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.
10 ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే. 11 కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి. 12 అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి కాదు. 13 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే.
14 “ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.
15 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.
-
24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.
25 ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.
26 ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.
27 మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది.
28 సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు.
-
34 మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.
37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.
38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”
-
8 మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు.
9 ఈ ప్రజలందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపానికి పాత్రులయ్యారు. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
-
1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.
3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
-
41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. 42 అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. 43 ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. 44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.
-
16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
-
17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.
-
12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు.
-
32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
-
9 ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.
-
5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.
-
32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.
-
16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.
-
22 తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.
-
35 నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే నీవు ఒక పరదేశికి, నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చెయ్యాలి. 36 అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి. 37 డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోకూడదు. నీ దగ్గరున్న ఆహారపదార్థాలను లాభం వేసుకుని అతనికి అమ్మకూడదు.
-
7 వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8 రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.
-
42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.
-
7 మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. 8 మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి.
-
17 పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.
-
33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. 34 అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.
35 మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు. 36 అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు. 37 దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.
-
1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
-
9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
-
2 బెసలేలు, అహోలీయాబులతో పాటు యెహోవా ఎవరి హృదయాల్లో జ్ఞాన వివేకాలు ఉంచి ఆ పని చేయడానికి ప్రేరేపణ కలిగించాడో వాళ్ళందరినీ మోషే పిలిపించాడు.
3 వాళ్ళు వచ్చి పవిత్ర స్థలం లో సేవ జరగడానికి, పవిత్ర స్థలం కట్టించడానికి ఇశ్రాయేలు ప్రజలు తీసుకువచ్చిన సామగ్రి అంతటినీ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మోషే దగ్గరికి కానుకలు తెస్తూనే ఉన్నారు. 4 అప్పుడు పవిత్ర స్థలానికి చెందిన వేరు వేరు పనులు చేసే నిపుణులందరూ తాము చేస్తున్న పని వదిలిపెట్టి మోషే దగ్గరికి వచ్చారు. 5 “సేవ జరిగించడానికి యెహోవా చేయమని చెప్పిన పని కోసం ప్రజలు కావలసిన దానికంటే చాలా ఎక్కువగా తీసుకు వస్తున్నారు” అని మోషేతో చెప్పారు.
6 మోషే “ఇక నుండి ఏ పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు” అని ప్రకటించాడు. శిబిరం అంతటా ఈ విషయం చాటింపు వేయించారు. ఆ పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది. 7 ఇక ప్రజలు కానుకలు తేవడం మానుకున్నారు.
-
9 యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.
10 అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.
-
42 శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”
-
30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. 31 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
32 మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా.
-
13 కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.
-
15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”
-
8 జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు.
-
3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
-
1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. 2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి. 3 నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను. 4 నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
-
6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.
-
5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు.
Shows Read in context, Share and Copy.