113 Bible Verses About The Heart

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About The Heart
  1. 10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

    11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

    12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.

    13 అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు.

    14 నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.

    15 ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది.

    16 నీకు బలుల్లో సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు.

    17 విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.

  2. 9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?

    10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.

  3. 22 కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను. 23 మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవా ప్రభువునని వారు తెలుసుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

    24 “ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను. 25 మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.

    26 కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27 నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. 28 నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.

  4. 23 అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.

  5. బేత్‌

    9 యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

    10 నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

    11 నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

    12 యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.

    13 నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.

    14 సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.

    15 నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.

    16 నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.

  6. 8 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.

  7. 11 ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం. 12 దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు. 13 రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. 14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు. 15 మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.

  8. 12 కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు.

    13 వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు.

    14 వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.

    15 అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు.

    16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  9. 7 అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.

    8 అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.

  10. 19 వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. 20 దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను. 21 అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.” ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.

  11. 30 నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.

    31 “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. 32 మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.

    33 “చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు. 34 విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 35 మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.

  12. 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  13. 18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి. 20 మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.

    21 ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.

  14. 5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.

  15. 35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, 36 “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

    37 అందుకు యేసు,

    “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

    40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.

  16. 8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,

    “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,

    మీ హృదయంలో ఉంది.”

    మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు.

  17. 14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.

  18. 21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

  19. 21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.

  20. 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

    7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

    8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

  21. 4 మూర్ఖంగా ఆలోచించేవాడు నాకు దూరంగా ఉండాలి. దుష్టకార్యాలంటే నాకు అసహ్యం.

    5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.

  22. 13 ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.

    14 తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.

    15 దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.

  23. 7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”

  24. 5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.

  25. 3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

  26. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  27. 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు.

  28. 5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.

    9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.

  29. 1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి.

    2 ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు.

    3 వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.

    లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.

    4 వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది.

    5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.

    నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.

    6 అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు.

    7 “ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.

    8 అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను.

    అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.

    9 ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు.

    ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.

    10 వారు కళ్ళతో చూసి, చెవులతో విని,

    హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని,

    స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి,

    వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు.

  30. 30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.

  31. 22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.

  32. 12 ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. 13 ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు. 15 అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది. 16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.

  33. 9 సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.

  34. 20 మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు.

  35. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి.

  36. 21 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు. 22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.

  37. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  38. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

  39. 22 దాసులారా, మనుషులను మెప్పించాలని చూసే వారిలా పైకి కనిపించాలని కాకుండా ప్రభువుకు భయపడుతూ చిత్తశుద్ధితో అన్ని విషయాల్లో మీ ఇహలోక యజమానులకు లోబడి ఉండండి.

    23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు. 25 అక్రమం చేసేవాడికి తాను చేసిన అక్రమానికి తగిన శాస్తి జరుగుతుంది. ఎలాంటి పక్షపాతం ఉండదు.

  40. 12 సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి. 13 పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.

  41. 1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,

    “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.

    యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది.

    నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.

    నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

  42. 14 యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!

  43. 112 నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.

  44. 26 కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి.

    27 వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట.

  45. 6 “చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.

  46. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

  47. 22 సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.

  48. 21 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు.

  49. 14 అతడు యెహోవాను వెతకడంలో స్థిరంగా నిలబడక చెడు క్రియలు చేశాడు.

  50. 7 వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి.

  51. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  52. 1 మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.

  53. 19 “భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.

  54. 4 యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు?

  55. 14 యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది.

    ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు.

    చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.

    15 ఈ ప్రజల హృదయం బండబారి పోయింది.

    వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది.

    వారి కళ్ళు మూసుకుపోయాయి.

    వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి,

    మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’

  56. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

  57. 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. 15 దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

    16 మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. 17 కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.

  58. 37 ఉదయాన నాబాలు మత్తు దిగిన తరువాత అతని భార్య అతనితో ఆ విషయం చెప్పగానే భయంతో అతని గుండె పగిలింది. అతడు రాయి లాగా బిగుసుకు పోయాడు.

  59. 9 నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”

  60. 11 కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు. 12 నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు.

  61. 7 ధాన్యం, కొత్త ద్రాక్షారసం పుష్కలంగా ఉన్న వారి ఆనందం కన్నా అధికమైన ఆనందం నువ్వు నా హృదయానికి ఇచ్చావు.

  62. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం.

    1 హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.

  63. 6 దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు.

    7 ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.

  64. 3 అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.

  65. 9 ‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు.

  66. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  67. 23 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది.

  68. 14 లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు. 15 ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.

  69. 26 వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి.

    27 ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి

    నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి.

    వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’

    అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే.

  70. 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. 29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.

  71. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

    12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.

  72. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

  73. 3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. 5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

    6 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. 7 వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.

  74. 19 కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. 20 తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. 21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, 22 విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.

  75. 13 ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె స్వరం వినబడడం లేదు. అందువల్ల ఏలీ ఆమె మద్యం సేవించి ఉంది అనుకున్నాడు.

  76. 1 దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, 2 “మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. 3 నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు. 4 అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.

  77. 3 అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్ధంగా ఉన్నట్టుగా అతని హృదయం యథార్ధంగా లేదు.

  78. 27 యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి ఘనత కలిగేలా చేయడానికి రాజుకు అలాంటి ఆలోచన పుట్టించినందుకు మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగు గాక. రాజు, అతని మంత్రులు, ఆస్థాన అధిపతులు నాపై దయ చూపేలా దేవుడు అనుగ్రహించాడు. 28 నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను.

  79. 3 దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.

  80. తృతీయ పరిచ్ఛేదము

    ఆసాపు కీర్తన

    1 ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు.

  81. 2 యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.

  82. 11 యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.

  83. 12 కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.

  84. 1 కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.

    2 జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, 3 తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, 4 పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, 5 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.

  85. 33 తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.

  86. 1 దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు.

    2 వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది.

  87. 13 ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు.

    వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.

    14 కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను.

    వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.”

  88. 17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.

  89. 29 మోయాబు గర్వం గురించీ, అహంకారం గురించీ విన్నాం.

    అతడి అహంకారం, గర్వం, ఆత్మ స్తుతీ, హృదయంలో అతిశయం, అన్నీ విన్నాం.”

  90. 16 కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు,

    నీ భీకరత్వం విషయంలో నీ హృదయంలో గర్వం నిన్ను మోసం చేసింది.

    గద్దలాగా ఉన్నత స్థలాల్లో గూడు కట్టుకుని ఉన్నావు.

    అయినా నిన్ను అక్కడనుండి కిందకు లాగి పడవేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

  91. 31 మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి?

  92. 2 వారి హృదయం కపటమైనది,

    వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు.

    యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు.

    వారి దేవతా స్థంభాలను ధ్వంసం చేస్తాడు.

  93. 27 “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.

  94. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  95. 1-2 నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది.

  96. 11 కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది. 12 మీ విషయంలో మా అంతరంగం సంకుచితంగా లేదు, మీ అంతరంగమే సంకుచితంగా ఉంది. 13 మేము చేసినట్టే మీరూ చేయండి. మీరూ మీ హృదయాలను విశాలంగా తెరవండి. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.

  97. 6 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు. 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.

  98. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

    21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.

  99. 61 కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోడానికి, ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి, మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థంగా ఉండుగాక.”

  100. 8 ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను.

  101. 69 గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.

  102. ఖొఫ్‌

    145 యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.

  103. 20 దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు.

  104. 12 విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.

  105. 15 కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది.

  106. 12 సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు.

  107. 20 వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు.

    ‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు.

  108. 14 యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?

  109. 19 నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను.

  110. 12 సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు.

  111. 20 “అయితే అతని హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. అతని హృదయం కఠినం చేసుకుని చెడ్డ పనులు జరిగించినప్పుడు దేవుడు అతని నుండి రాజ్యాన్ని తీసివేసి అతని ఘనతనంతా పోగొట్టాడు.

  112. 7-9 వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”

  113. 2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు. 3 తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4 ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.