30 Bible Verses About Envy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Envy
  1. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

    25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

  2. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.

  3. 4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

  4. 30 సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.

  5. 1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2 అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3 కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.

  6. 1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. 2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు. 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?

    4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా

  7. 4 కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. 5 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. 6 రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది.

    7 నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది.

    8 ఒకడు ఒంటరిగా ఉన్నాడు.

    అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు.

    అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.

    ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు.

    సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు.

    ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.

  8. 28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  9. 3 ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4 వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5 ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.

    6 అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.

  10. 1 నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?

    2 తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.

    3 మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.

  11. 1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

    3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

    7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.

  12. 17 పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు.

    18 నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు.

  13. 15 ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. 16 ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. 17 కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” 18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.

  14. దావీదు కీర్తన

    1 చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.

    2 ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.

    3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

    4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

  15. 11 కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. 12 రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం. 13 పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం. 14 చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

  16. 6 వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు. 7 ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ:

    “సౌలు వెయ్యిమందిని,

    దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.

    8 ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు. 9 అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.

  17. 44 మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్కు వినడానికి సమావేశం అయింది. 45 యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి వారిని హేళన చేశారు.

  18. 3 కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు. 4 హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. 5 కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.

    6 యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? 7 నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.

    8 కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.

  19. 31 దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.

    32 కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.

  20. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  21. 3 భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను.

  22. 1 దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు.

    2 వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది.

  23. 15 కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.

  24. 12 ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు. 13 కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు. 14 అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు.

  25. 1 రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో “నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను” అంది. 2 యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు “నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?” అన్నాడు.

  26. 3 యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. 4 అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.

  27. 17 నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.

  28. 16 వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు.

    17 భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.

    18 వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.

  29. 20 ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో.

  30. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.