112 Bible Verses About Wealth

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Wealth
  1. 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.

  2. 6 అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.

    11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు.

  3. 1 ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి. 2 మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. 3 మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరిదినాల్లో ధనం పోగు చేసుకున్నారు.

    4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి. 5 మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. 6 మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు.

  4. 13 ఆ జనసమూహంలో ఒకడు, “ఉపదేశకా, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి” అన్నాడు. 14 అందుకు ఆయన, “ఏమయ్యా, మీ మీద పెద్దమనిషిగా మధ్యవర్తిగానో నన్నెవరు నియమించారు?” అన్నాడు. 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”

    16 తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది. 17 అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. 18 నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను. 19 అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు. 20 అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు.

    21 దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు.

  5. 19 “భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.

  6. 10 డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు.

    ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు.

    ఇది కూడా నిష్ప్రయోజనమే.

    11 ఆస్తి ఎక్కువైతే దాన్ని దోచుకునే వారు కూడా ఎక్కువవుతారు.

    కేవలం కళ్ళతో చూడడం తప్ప ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది?

    12 కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు.

    అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.

    13 సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను.

    అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది.

    14 అతడు దురదృష్టవశాత్తూ తన ఆస్తిని పోగొట్టుకుంటే అతని కొడుకు చేతిలో ఏమీ లేనివాడు అవుతాడు.

  7. 7 ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. 8 దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం. 9 మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.

    10 మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి. 11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. 13 మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

    14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

    15 బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. 16 చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. 17 అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

    18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.

  8. 9 అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నాను. 10 చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు. 11 కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే, ఇక నిజమైన ధనం మీకెవరిస్తారు? 12 మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు?

  9. 4 ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి.

    5 డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.

  10. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

    14 అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. 15 ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు. 16 ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు.

    17 నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను. 18 నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి. 19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.

  11. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

  12. 5 నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?

    6 వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.

    7 వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.

    8 ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.

    9 ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.

    10 వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.

    11 వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.

    12 కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.

  13. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

    23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. 26 యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.

  14. 24 బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే,

    25 నాకు చాలా ఆస్తి ఉందని గానీ నా చేతికి విస్తారమైన సంపద దొరికిందని గానీ నేను సంతోషించినట్టయితే,

    26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గానీ, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గానీ చూసి,

    27 నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే,

    28 అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమౌతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్న వాడినౌతాను.

  15. 28 సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు.

  16. 11 మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.

  17. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.

  18. 17 ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

    18 యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

    20 అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు. 21 యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు. 22 అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

    23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం” అని అన్నాడు. 24 ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం! 25 ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం” అన్నాడు.

    26 ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. 27 యేసు వారి వైపు చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.

  19. 1 నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి.

    2 ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. 3 మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, 4 మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా?

    5 నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? 6 కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా? 7 మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది?

  20. 32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

  21. 10 బలాత్కారంలో, దోచుకోవడంలో నమ్మకం పెట్టుకోవద్దు. ఐశ్వర్యంలో వ్యర్ధంగా మనసు నిలపవద్దు. ఎందుకంటే అవేవీ ఫలించవు.

  22. 9 యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

    10 అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

  23. 23 నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.

    24 డబ్బు శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉంటుందా?

  24. 6 న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు.

    7 చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు.

  25. 19 అంతే గాక దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన వంతు అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోడానికి, తన కష్టార్జితంలో సంతోషించడానికి వీలు కలిగిస్తే అది దేవుని దీవెన అని భావించాలి. 20 అతడు చేసే పనిలో దేవుడు అతనికి సంతోషం కలిగిస్తాడు కాబట్టి అతడు తన జీవితంలోని రోజులను పదే పదే జ్ఞాపకం చేసుకోడు.

  26. 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  27. 1 అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు. 2 అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి.

  28. 7 యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.

    కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

  29. 4 దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు.

  30. 16 తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.

  31. 1 అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. 2 నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 3 నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!

    4 నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు. 5 నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.

    6 కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 7 నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు. 8 వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు. 9 నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు. 10 నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”

  32. 22 ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.

  33. 57 ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు. 58 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు. 59 యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.

    60 తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు.

  34. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు. 6 కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.

  35. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

    18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో.

  36. 8 వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.

    9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.

  37. 18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

    21 దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24 యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.

    26 ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27 అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  38. 12 ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు. 13 కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు. 14 అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు.

  39. 22 యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.

  40. 22 న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది.

    23 పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.

  41. 6 నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.

  42. 17 ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.

    18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.

    19 అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. 20 విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. 21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.

  43. 4 యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.

    5 ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.

    6 నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.

  44. 6 తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ.

    తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు?

    వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా.

    7 పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు.

    నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు.

    నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు.

    8 నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు.

    పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.

    9 తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని,

    తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.

    10 నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు.

    నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు.

    11 గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి.

    దూలాలు వాటికి జవాబిస్తాయి.

  45. 41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. 42 అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. 43 ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. 44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.

  46. 13 ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవుణ్ణీ సిరినీ సేవించలేరు.”

  47. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

  48. 9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. 10 ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి.

    11 సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు.

  49. 23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.

    24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.

    అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”

  50. 8 “నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది.

    నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.

  51. 19 “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు. 20 లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు. 21 ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి. 22 ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.

    23 “అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి. 24 ‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.

    25 దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. 26 అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది,’ అన్నాడు.

    27-28 అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు. 29 అందుకు అబ్రాహాము, ‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు. 30 అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. 31 అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు.

  52. 9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.

  53. 17 నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.

    18 ఐశ్వర్యం, ప్రతిష్ఠ, నీతి న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి.

    19 నా వల్ల కలిగే ఫలం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది.

    20 నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి.

    21 నన్ను ప్రేమించే వాళ్ళను నేను సంపన్నులుగా చేస్తాను. వారికి ధన సమృద్ధి కలిగిస్తాను.

  54. 10 దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది.

    అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.

    11 తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?

    12 ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.

    అక్కడి ప్రజలు అబద్దికులు.

    వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.

    13 కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను.

    నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.

  55. 14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.

  56. 1 ఎందుకంటే మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను ఎంత తీవ్ర పోరాటం చేస్తున్నానో మీరు తెలుసుకోవాలి. 2 వారందరూ తమ హృదయాల్లో ప్రోత్సాహం పొందాలనీ ప్రేమలో ఐక్యం కావాలనీ నా అభిలాష. అప్పుడు వారికి కలిగే వాస్తవమైన అవగాహన వల్ల తమ హృదయాల్లో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును అర్థం చేసుకోగలగాలి. 3 జ్ఞానం, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి.

  57. 1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి.

  58. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.

  59. 1 ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవునిపట్ల భయభక్తులు కలిగి, యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహ్యించుకునేవాడు. 2 అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. 3 అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.

  60. 16 విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.

    17 ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

  61. 27 లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.

  62. 1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.

  63. 11 కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.”

  64. 4 విశ్వాసం లేని కూతురా, నీ బలాన్ని గూర్చి నీకు అంత ఆహంకారమెందుకు? నీ బలం నీళ్ళ లాగా ప్రవహించి పోతుంది.

    నీ సంపదలపై నమ్మకం పెట్టుకున్నావు. ‘నాకు విరోధిగా ఎవరొస్తారు?’ అంటున్నావు.

  65. 23 కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

  66. 6 అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.

  67. 11 ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల పేదవాడు వాడి అసలు రంగు బయట పెడతాడు.

  68. 26 ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.

  69. 8 మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు.

    9 ఈ ప్రజలందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపానికి పాత్రులయ్యారు. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

    11 “మీ పంటను పురుగులు తినివేయకుండా నేను గద్దిస్తాను. అవి మీ భూమిపై ఉన్న పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్షచెట్ల ఫలాలు అకాలంలో రాలిపోవు. ఇది సైన్యాలకు అధిపతియైన యెహోవా వాక్కు. 12 ఇక అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అన్య దేశాల ప్రజలంతా మిమ్మల్ని ధన్య జీవులు అంటారు అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  70. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.

  71. 1 సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. 2 విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది. 3 వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు. 4 వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు.

  72. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

    10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.

  73. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  74. 27 హిజ్కియాకు అత్యంత సంపదా, ఘనతా కలిగాయి. వెండీ, బంగారం, రత్నాలూ సుగంధద్రవ్యాలూ, డాళ్ళూ, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు. 28 ధాన్యం, కొత్తద్రాక్షారసం నూనె నిల్వ చేయడానికి గోదాములు కట్టించాడు. వివిధ రకాల పశువులకు కొట్టాలూ, మందలకు దొడ్లూ కట్టించాడు. 29 దేవుడు అతనికి అతి విస్తారమైన సంపద దయ చేశాడు కాబట్టి ఊళ్ళను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలనూ పశువుల మందలనూ అతడు సంపాదించాడు.

    30 ఈ హిజ్కియా గిహోను ఊటమీది కాలువకు ఎగువ ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోనూ వర్దిల్లాడు. 31 అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోడానికి బబులోను పరిపాలకులు అతని దగ్గరికి రాయబారులను పంపారు. అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు అతణ్ణి పరీక్షకు విడిచిపెట్టాడు.

    32 హిజ్కియా గురించిన ఇతర విషయాలూ భక్తితో చేసిన పనులూ ఆమోజు కుమారుడూ ప్రవక్త అయిన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ రాసి ఉన్నాయి.

  75. 16 ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా బంక మట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా,

    17 వారు అలా సిద్ధపరచుకుంటారే గానీ నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు.

  76. 1 యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.

    2 అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు.

    3 కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

  77. 2 భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.

  78. 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.

    నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  79. 44 “పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.

    45 “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. 46 అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.

  80. 24 “అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు.

  81. 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

  82. 7 నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది. 8 పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ, 9 సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. 10 తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. 11 అది మన ప్రభువైన క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం. 12 క్రీస్తుపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే నిబ్బరం కలిగింది.

    13 కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దని చెబుతున్నాను. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.

  83. 23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. 24 ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.

  84. 1 ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు. 2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.

    5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

  85. 8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.

  86. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

  87. 25 నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.

  88. 13 నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు.

    అతణ్ణి దోచుకోకూడదు.

    కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.

  89. 11 అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. “నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు. 12 కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.”

  90. 3 ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.

    4 శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.

  91. 8 డబ్బు వడ్డీకిచ్చి అన్యాయ లాభం చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించేవాడి కోసం దాన్ని కూడబెడతాడు.

  92. 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?

  93. 8 జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు.

  94. 15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి, 16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. 17 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

    18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన. 19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.

    20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. 22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు. 23 ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.

  95. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

  96. 16 కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రాల వరుసలో రప్పించినప్పుడు యూదాగోత్రం పట్టుబడింది. 17 యూదా వంశాన్ని రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టుబడింది. జెరహీయుల వంశాన్ని ఒక్కొక్కరిని రప్పించినప్పుడు జబ్ది దొరికాడు. 18 అతడినీ అతని ఇంటివారిని పురుషుల వరుస ప్రకారం రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనుమడూ జబ్ది మనుమడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను దొరికాడు.

    19 అప్పుడు యెహోషువ ఆకానుతో “నా కుమారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా, ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో, నీవు చేసినదాన్ని నాకు చెప్పు” అని అన్నాడు. 20 అందుకు ఆకాను యెహోషువతో “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. 21 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది” అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు.

    22 అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరికి పరుగెత్తి చూశారు. వారు ఆ వస్తువులనూ వాటి కింద ఆ వెండినీ కనుక్కున్నారు. 23 కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకు యెహోషువ దగ్గరకూ ఇశ్రాయేలీయుల దగ్గరకూ తెచ్చి యెహోవా సన్నిధిలో పోశారు.

    24 తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానునూ, ఆ వెండినీ పైవస్త్రాన్నీ, బంగారు కమ్మీనీ, ఆకాను కుమారులనూ, కుమార్తెలనూ, ఎద్దులనూ, గాడిదలనూ, మందనూ, డేరానూ, అతనికి కలిగిన సమస్తాన్నీ పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు.

    25 అప్పుడు యెహోషువ “నీవెందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తాడు” అనగానే ఇశ్రాయేలీయులంతా అతణ్ణి రాళ్లతో చావగొట్టారు.

  97. 7 తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు.

    8 ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు.

  98. 23 నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.

  99. 8 ఒకడు ఒంటరిగా ఉన్నాడు.

    అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు.

    అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.

    ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు.

    సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు.

    ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.

  100. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?

  101. 1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”

  102. 22 సొలొమోను రాజు భూమి పైన రాజులందరికంటే ఐశ్వర్యంలో, జ్ఞానంలో అధికుడయ్యాడు.

  103. 22 అంతేకాక, రాజ్యాలను, అన్య దేశ ప్రజలను వారికి లోబరచి, వేరే ప్రదేశాలు వారి స్వాధీనంలోకి వచ్చేలా చేశావు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్నీ, బాషాను రాజు ఓగు దేశాన్నీ ఆక్రమించుకున్నారు. 23 వారి సంతానాన్ని ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే విస్తరింపజేసి, వారి పూర్వికులూ వాగ్దానం చేసినట్టు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునేలా ఆ దేశం లోకి రప్పించావు. 24 ఆ సంతానం వారు ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీన పరచుకున్నారు. కనాను దేశ నివాసులను, కనాను దేశాన్నీ వారికి స్వాధీనపరచి, తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకొనేందుకు ఆ దేశాల రాజులను, ప్రజలను వారి వశం చేశావు.

    25 అప్పుడు వారు సరిహద్దు గోడలున్న పట్టణాలను, ఫలించే భూములను స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల వస్తువులతో నిండి ఉన్న ఇళ్ళను, తవ్వి ఉన్న బావులను, ద్రాక్షతోటలను, ఒలీవ తోటలను, ఎంతో విస్తారంగా ఫలించే చెట్లను వశపరచుకున్నారు. ఆ విధంగా వారు తిని, తృప్తి పొందారు. నువ్వు చేసిన మహోపకారాన్ని బట్టి వారు ఎంతో సంతోషించి మంచి చెడ్డలు మరచిపోయారు. 26 వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.

    27 అందువల్ల నువ్వు వాళ్ళను వారి శత్రువుల వశం చేశావు. ఆ శత్రువులు వారిని బాధించినప్పుడు వారు కష్టాల పాలై నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించడానికి నీ కృపా బాహుళ్యాన్ని బట్టి వారిని విడిపించే రక్షకులను పంపించావు. 28 వారికి శాంతి సమాధానాలు లభించిన తరువాత నీ దృష్టికి విరోధంగా ద్రోహం చేసినప్పుడు వారిపై అధికారం చేసేలా తిరిగి వారి శత్రువుల చేతికి అప్పగించావు. వారు తిరిగి నీకు మొర పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి, నీ కృపను కనుపరచి పలుమార్లు వారిని విడిపించావు.

    29 నీ ఆజ్ఞలను, కట్టడలను ఎవరైనా ఆచరిస్తే వాడు చనిపోకుండా జీవిస్తాడు. కానీ వారు వాటిని మీరి పాపాలు చేశారు. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని నువ్వు హెచ్చరించినప్పటికీ వారు గర్వంతో నీ ఆజ్ఞలకు లోబడక, నీ కట్టడలను నిర్ల్యక్షం చేసి పాపం చేసి, నిన్ను తిరస్కరించారు. తమ మనస్సులను కఠినం చేసుకున్నారు. నీ మాట వినలేదు. 30 నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు.

    31 నువ్వు నిజంగా కృపా కనికరాలు ఉన్న దేవుడవు. నీ కనికరాన్నిబట్టి వారిని పూర్తిగా నాశనం కాకుండా కాపాడావు.

  104. 20 నమ్మకమైనవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడయ్యేటందుకు ఆత్రంగా ఉండే వాడు శిక్ష తప్పించుకోడు.

    21 పక్షపాతం చూపడం మంచిది కాదు. కేవలం ఒక్క రొట్టెముక్క కోసం కొందరు తప్పు చేస్తారు.

    22 చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడు. తనకు దరిద్రత వస్తుందని వాడికి తెలియదు.

  105. 8 “వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

  106. 12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 13 అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.

    14 “మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.

  107. 25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం?

  108. 11 వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.

    12 “గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు. 13 దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు. 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు. 15 అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.

    16 “మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు. 17 దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. 18 ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు. 19 యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.

    20 అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం. 21 దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు. 22 అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా, 23 అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి, 24 తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు. 25 దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు. 26 అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’ 27 మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”

  109. 6 ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు. 7 ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.

    8 ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.

  110. 10 మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.

  111. 6 సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం. 7 మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు. 8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.

    9 మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు. 10 అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా! 11 మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం. 12 అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.

  112. 23 విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు.

    24 విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు. 25 కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు. 26 ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు.

    27 విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు. 28 విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు.