36 Bible Verses About Forgiveness
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.
10 నీ రాజ్యం వస్తుంది గాక.
పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.
12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”
14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.
-
31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
-
6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.
9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.
-
12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.
-
35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.
37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.
-
25 అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
-
33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.
34 అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
-
3 మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
-
17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.
19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.
20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.
అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”
21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.
-
7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
-
21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.
-
10 మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
11 భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
-
36 “మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.”
37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.
-
23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.
24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.
28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.
31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.
-
5 యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, 7 “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” 8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? 9 ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి 11 ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు. 12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.
-
3 యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.
4 అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు.
-
25 ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.
26 ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో.
-
31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు.
32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.
33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.
34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.
-
26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.
-
21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
-
43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
-
9 ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.
-
18 యెహోవా ఇలా అంటున్నాడు.
“రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”
“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,
అవి మంచులా తెల్లగా అవుతాయి.
కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.
-
47 దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు.
48 తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
-
13 అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.
-
28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29 కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30 ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
-
59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60 అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.
-
30 మరుసటి రోజు మోషే ప్రజలతో “మీరు గొప్ప పాపం చేశారు. నేను యెహోవా దగ్గరికి కొండ ఎక్కి వెళ్తాను. ఒకవేళ మీరు చేసిన పాపం కోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అన్నాడు.
31 మోషే యెహోవా కొండకు మళ్ళీ వెళ్ళాడు. “అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు. 32 అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు” అని బతిమాలుకున్నాడు.
-
21 “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.
23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. 24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.
-
39 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. 40 ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు.
-
31 “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు. 32 మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.
-
43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.
-
1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.
-
7 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
-
4 యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
-
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
Shows Read in context, Share and Copy.