63 Bible Verses About Prayer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Prayer
  1. 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు.

    8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.

    “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.

    10 నీ రాజ్యం వస్తుంది గాక.

    పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.

    11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.

    12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.

    13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”

    14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.

  2. 13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి. 14 మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. 15 విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.

    16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది. 17 ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు. 18 అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.

  3. 9 అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది. 10 అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను.

    11 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? 12 గుడ్డు అడిగితే తేలునిస్తాడా? 13 కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా” అని చెప్పాడు.

  4. 22 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. 23 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. 24 అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. 25 అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

  5. 12 నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.

    13 “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. 14 మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

    16 “నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17 ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు.

  6. 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.

    12 “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.

  7. 6 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా! 7 తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా? 8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”

    9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  8. 14 ఆయన దగ్గర మనకున్న ధైర్యం ఇదే, ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు. 15 మనం అడిగిన విషయాలన్నీ ఆయన వింటాడని తెలిస్తే, మనం అడిగినవి మనకు కలిగాయని మనకు తెలుసు.

    16 తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతణ్ణి బట్టి మరణం కలిగించని పాపం చేసిన వాడికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతడు ప్రార్థించాలని నేను చెప్పను.

    17 సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.

  9. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  10. 10 ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు. 11 ఆ వ్యక్తులు గుంపుగా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయనను వేడుకోవడం చూశారు.

  11. 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8 అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.

  12. 18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.

  13. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

  14. 41 వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు. 42 “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.” 43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.

    44 ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.

  15. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

  16. 4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.

  17. 14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.

  18. 1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

    3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.

  19. 13 నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. 15 ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి.

  20. 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  21. 1 రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.

    2 కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.

    3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

    6 రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.

    7 ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!

  22. 38 అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

    39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.

  23. 19 కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. 20 తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. 21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, 22 విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.

    23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.

  24. 23 ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు.

    24 ఇంతవరకూ నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు.

  25. 5 అప్పుడు సమూయేలు “ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పినప్పుడు 6 వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.

    7 ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి 8 “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలును వేడుకున్నారు.

    9 సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.

    10 సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.

  26. 2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.

    3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4 నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.

  27. 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  28. 16 అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.

    17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.

    18 నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.

    19 పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.

    20 నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.

    21 అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.

  29. 32 సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33 ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. 34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.

    35 ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36 సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. 37 ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు.

  30. 1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం, 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.

    3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.

  31. 9 యెహోవా ఇంకా ఇలా అన్నాడు. “నేను ఈ ప్రజలను గమనిస్తున్నాను. వాళ్ళు కఠిన హృదయులయ్యారు. 10 నువ్వు చూస్తూ ఉండు, నా కోపం వారి మీద రగులుకునేలా చేస్తాను. వాళ్ళను దహించివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను.” 11 అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా. 12 ఐగుప్తీయులు ‘వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళను తీసుకు వెళ్ళాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్లుకుని వాళ్లకు కీడు చెయ్యకు. 13 నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు” అన్నాడు.

    14 అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.

  32. 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60 అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

  33. 8 అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.

  34. 5 సాయంత్రం బలి అర్పించే సమయానికి నేను కృంగిన స్థితి నుంచి తేరుకుని లేచాను. నా దుప్పటి, అంగీ చిరిగిపోయి ఉన్న స్థితిలోనే మోకరించి, నా దేవుడైన యెహోవా వైపు చేతులు పైకెత్తి ఇలా ప్రార్ధించాను, 6 “నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి.

  35. 17 యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.

    18 ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.

    19 తన భక్తుల కోరికలు ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను కాపాడతాడు.

    20 తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు.

  36. 15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి, 16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. 17 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

    18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన. 19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.

    20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.

  37. 19 అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు. 20 “యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు. 21 ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు.

    22 యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు. 23 ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు.

  38. 15 మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.

    మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను.

    మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.

    16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.

    మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.

    మీ దుష్టత్వం మానండి.”

    17 మంచి చెయ్యడం నేర్చుకోండి.

    న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.

    తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.

    వితంతువు పక్షాన నిలబడండి.

  39. 13 వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఉద్యమ కారుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా. 14 వీరూ, వీరితో కూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.

  40. 4 ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను. 5 “ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు. 6 నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం. 7 నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు.

  41. 21 ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22 అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం.

  42. 20 నేను ఇంకా పలుకుతూ ప్రార్థనచేస్తూ, పవిత్ర పర్వతం కోసం నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపాన్ని నా ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ నా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను.

    21 నేను ఇలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా, మొదట నేను దర్శనంలో చూసిన మహా తేజోవంతుడైన గాబ్రియేలూ అనే ఆ వ్యక్తి సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను తాకాడు.

    22 అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇలా అన్నాడు. “దానియేలూ, నీకు గ్రహించగలిగే శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను. 23 నీవు చాలా ఇష్టమైన వాడివి గనక నీవు విన్నపం చేయడం మొదలు పెట్టినప్పుడే ఈ సంగతిని నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఈ సంగతిని తెలుసుకుని నీకు వచ్చిన దర్శన భావాన్ని గ్రహించు.

  43. 14 హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి, 15 యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.

    16 యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు. 17 యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి 18 వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.

    19 యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.

    20 అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.

  44. 5 పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. 6 హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.

    7 ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. 8 దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు.

  45. 4 రాజు బలశాలి. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. నువ్వు నీతి న్యాయాలను సుస్థిరం చేశావు, యాకోబు ప్రజల పట్ల నీతి పాలన స్థాపించావు.

    5 మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పాదపీఠం ముందర ఆరాధించండి. ఆయన పవిత్రుడు.

    6 ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళలో సమూయేలు ఉన్నాడు. వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చాడు.

    7 మేఘస్తంభంలో నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఆయన శాసనాలను పాటించారు. ఆయన తమకిచ్చిన కట్టడను అనుసరించారు.

    8 యెహోవా మా దేవా, నువ్వు వాళ్లకు జవాబిచ్చావు. వాళ్ళ అక్రమ కార్యాలకు వాళ్ళను శిక్షించినా, నువ్వు వాళ్ళను క్షమించిన దేవుడివి.

  46. 9 అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు.

    ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే,

    10 ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది.

    11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.

    నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.

    ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.

  47. 24 వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను.

  48. 5 గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. 6 సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.

    7 నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు. 8 నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం. 9 నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”

  49. 36 సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. 37 యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు.

    38 అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది.

  50. 1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు.

  51. 22 అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. 23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.

    25 మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.

  52. 9 ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10 ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

    12 వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13 ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

  53. 6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.

  54. 34 అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.

  55. 2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.

  56. 18 అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మా కోసం ప్రార్ధించండి. 19 మీ దగ్గరికి త్వరలో తిరిగి రాగలిగేలా మరింత ప్రార్థించాలని కోరుతున్నాను.

    20 గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు 21 ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక! తన దృష్టిలో ప్రీతికరమైన దాన్ని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక! ఆ యేసు క్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమెన్.

  57. 25 కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవా సన్నిధిలో నలభై పగళ్లు, నలభై రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు. 26 నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను ప్రభూ, యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు. 27 నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు.

    28 ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు, యెహోవా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక, వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో. 29 నువ్వు నీ మహాబలం చేత, చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యమూ నీ ప్రజలూ వీరే.”

  58. 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.

  59. 21 “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.

    24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”

  60. 31 వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.

    32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.

  61. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.

  62. 42 తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43 అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  63. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు.