39 Bible Verses About Enemies

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Enemies
  1. 38 “‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 39 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. 40 ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.

    43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  2. 17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

  3. 27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.

    29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు.

  4. 17 నీ శత్రువు పడిపొతే సంతోషించవద్దు. వాడు తూలిపడినప్పుడు నీవు మనస్సులో అనందించవద్దు.

    18 యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో.

    19 దుర్మార్గులను చూసి అందోళన చెందకు. భక్తిహీనుల విషయం మత్సరపడకు.

    20 దుర్జనుడికి పుట్టగతులుండవు. భక్తిహీనుల దీపం కొడిగడుతుంది.

  5. 21 నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు.

    22 అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.

  6. 33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.

    34 అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.

  7. 54 మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి 56 “ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు.

    57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి 58 అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60 అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

  8. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

  9. 4 నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ, గాడిద గానీ తప్పిపోతే అది నీకు కనబడినప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని తోలుకు వచ్చి అతనికి అప్పగించాలి. 5 నీ విరోధి గాడిద బరువు క్రింద పడిపోయి ఉండడం నువ్వు చూస్తే దాని పక్కనుండి దాటిపోకుండా వెంటనే వెళ్లి అతడితో కలసి ఆ గాడిదను విడిపించాలి.

  10. 29 నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే,

    30 (పాపం చేయడానికి నేను నా నోటికి చోటియ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు).

    31 “యోబు పెట్టిన భోజనం తిని, తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు?” అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే,

    32 (పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి).

    33 మానవ జాతి చేసినట్టు నా పాపాలను దాచి పెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు.

    34 జన సమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు.

    35 నా మాట వినడానికి నాకొకడు ఉంటే ఎంత బాగుంటుంది! ఇదిగో నా సంతకం. సర్వశక్తుడు నాకు జవాబిస్తాడు గాక. ఇదిగో నా ప్రతివాది రాసిన అభియోగం ఎవరైనా నాకు చూపిస్తే ఎంత బాగుంటుంది!

    36 నిశ్చయంగా నేను నా భుజం మీద దాన్ని ధరిస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకుంటాను.

    37 నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజు లాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను.

  11. 14 మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు.

  12. 7 ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.

  13. 48 ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు.

  14. ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).

    1 నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.

    2 పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.

  15. 21 అప్పుడు సౌలు “నేను పాపం చేశాను, ఈ రోజు నా ప్రాణం నీ దృష్టిలో విలువైనదిగా ఉన్నదాన్నిబట్టి నేను నీకు ఇక ఎన్నడూ హాని తలపెట్టను. దావీదూ, నా కొడుకా, నా దగ్గరికి తిరిగి వచ్చేయి. పిచ్చి వాడిలాగా ప్రవర్తించి నేను ఎన్నో తప్పులు చేశాను” అని పలికాడు.

  16. ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన

    1 నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు.

    2 దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు.

    3 నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు

    4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను.

    5 నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు.

  17. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము.

  18. 25 ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. 26 చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం. 27 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా. 28 సమస్తమూ కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.

  19. దావీదు కీర్తన

    1 చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.

    2 ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.

    3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

    4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

    5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

    6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

  20. 6 స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.

  21. 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

  22. 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. 4 మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.

    5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.

    7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

    11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.

    12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

  23. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  24. 5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

  25. 34 “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. 35 అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36 ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.

  26. 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.

  27. 20 నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను. 21 ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన క్షమించడు. ఎందుకంటే ఆయనకు నా పేరు పెట్టాను. 22 మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.

  28. 17 నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు.

    నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.

    18 పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.

    నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

  29. 1 “మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  30. 27 నిత్య దేవుడు నీకు ఆశ్రయం,

    శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి.

    శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు.

    నాశనం చెయ్యి! అంటాడు.

  31. 8 నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.

    9 నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.

  32. 13 యెహోవా, దయచేసి నన్ను కాపాడు. నాకు సహాయం చేయడానికి వేగిరపడు.

    14 నా ప్రాణం తీయాలని నా వెంటపడే వాళ్ళు సిగ్గుపడేలా, అయోమయానికి గురయ్యేలా చెయ్యి. నన్ను గాయపరచాలని చూసేవాళ్ళు వెనక్కి మళ్లేలా, అవమానానికి గురయ్యేలా చెయ్యి.

    15 నన్ను చూసి ఆహా, ఆహా అనే వాళ్ళు తమకు కలిగిన అవమానం చూసి విభ్రాంతి చెందాలి.

  33. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

    1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

  34. 12 దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.

  35. 5 ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు.

    ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు.

    నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు.

    6 కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు.

    కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు.

    తన సొంత ఇంటివారే తన శత్రువులు.

  36. 25 నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో.

  37. 28 “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

  38. 4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.

  39. 1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో! 2 అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

    3 మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.

    4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”