43 Bible Verses About Friends
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.
15 “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను.
-
5 లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
6 స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
7 కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.
8 తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.
9 పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.
10 నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.
-
24 ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.
-
17 స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.
18 తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు.
-
9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.
కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.
10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.
అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.
11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!
12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.
అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.
మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?
-
17 ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.
-
12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.
14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
-
1 దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు. 2 ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.
3 యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. 4 యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.
5 దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.
-
24 కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.
25 నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.
26 అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.
27 ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?
-
20 జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
-
28 మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.
-
33 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”
-
1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
-
9 ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.
-
26 ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.
27 సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.
-
4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
-
9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి.
-
9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.
-
16 అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. 17 నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.
18 తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది.
-
11 తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు.
12 వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతణ్ణి చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదికి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. 13 అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.
-
20 నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
21 ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమిలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి.
-
8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
-
దావీదు రాసిన యాత్రల కీర్తన
1 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది!
-
46 ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.”
47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. 49 అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. 50 యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.
-
10 ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారాన నిలవడం చూసిన ప్రజలందరూ తమ తమ గుడారాల ద్వారాల్లో లేచి నిలబడి నమస్కారం చేసేవారు. 11 ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు.
-
12 నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.
13 ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.
14 మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.
-
42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.
-
1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి.
-
24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
-
23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.
-
10 యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి దయచేశాడు. యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు.
-
9 నేను నమ్మిన నా సన్నిహిత మిత్రుడు, నా ఆహారం పంచుకున్నవాడు నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు.
-
8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
-
15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.
-
27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.
29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. 31 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
-
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
-
3 సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా?
ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?
-
16 నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.
-
6 మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు, 7 ఎవరైనా సరే, భూమి ఈ చివరి నుండి ఆ చివర వరకూ మీకు దగ్గరైనా, దూరమైనా, మీరు, మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే 8 వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారి మీద దయ చూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి. 9 వారిని చంపడానికి ప్రజలందరి కంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి. 10 రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు. 11 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అది విని భయపడి, మళ్ళీ అలాంటి చెడ్డ పని మీ మధ్య చేయరు.
-
19 మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”
-
5 తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు. “మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ‘మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు. 6 నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని చెప్పారనుకోండి. 7 అతడు లోపలే ఉండి, ‘నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను’ అని చెబుతాడా?
8 మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెబుతున్నాను.
-
15 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి.
-
16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
Shows Read in context, Share and Copy.