52 Bible Verses About Hypocrisy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Hypocrisy
  1. 23 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.

    24 అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. 25 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.

    26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.

    27 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. 28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.

  2. 5 మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.

    6 నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  3. 1 “ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు. 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది. 3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు? 4 నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు? 5 కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.

  4. 13 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు. 14 మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.

    15 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు.

  5. 1 అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, 2 “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. 3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. 4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.

    5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. 6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.

    7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.

  6. 1 అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు.

    “పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అంటే వారి వేషధారణ విషయం జాగ్రత్త పడండి. 2 కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు. 3 అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.

  7. 7-9 వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”

  8. 13 ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు.

    వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.

  9. 1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

    2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?

    5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు.

  10. 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా?

  11. 18 అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను.

    19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి. 20 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?

  12. 22 వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 23 ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. 24 అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. 25 కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.

  13. 15 “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.

    21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.

  14. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.

  15. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  16. 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49 తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51 వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”

  17. 20 ‘మా కోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు. మన దేవుడైన యెహోవా చెప్పినదంతా మాకు తెలియజెయ్యి. మేం దాన్ని జరిగిస్తాం’ అంటూ మీరే యిర్మీయా అనే నన్ను మీ దేవుడైన యెహోవా దగ్గరికి పంపించారు. కాబట్టి మీరు మీ ప్రాణాలనే చెల్లించాల్సి ఉంటుంది. 21 ఈ రోజు నేను మీకు తెలియజేశాను. కానీ మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు. ఆయన నా ద్వారా మీకు తెలియజేసిన వాటిలో దేనినీ వినలేదు. 22 కాబట్టి ఎక్కడ నివాసముండాలని మీరు కోరుకుంటున్నారో అక్కడే మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. అది మీకు తప్పకుండా తెలుసుకోవాలి.”

  18. 13 ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది.

    14 యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు. 15 అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా. 16 ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు.

    17 ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.

  19. 13 యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. 14 వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? 15 మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు. 16 వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు. 17 అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు.

  20. 54 తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, “మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది. 55 దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది. 56 కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.

    57 ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు?

  21. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.

  22. 10 సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి.

    గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి.

    11 “యెహోవా ఇలా అంటున్నాడు.

    విస్తారమైన మీ బలులు నాకెందుకు?”

    “దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి.

    దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు.

    12 మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు,

    నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు?

    13 అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.

    అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.

    14 మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.

    వాటిని సహించలేక విసిగిపోయాను.

    15 మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.

    మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను.

    మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.

  23. 1 ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం.

    వారి ఫలం విరగ గాసింది.

    ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు.

    తమ భూమి సారవంతమైన కొద్దీ,

    వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు.

    2 వారి హృదయం కపటమైనది,

    వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు.

    యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు.

    వారి దేవతా స్థంభాలను ధ్వంసం చేస్తాడు.

  24. 11 అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను. 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు. 14 వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను.

  25. 23 చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

    24 పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

    25 వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

    26 వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.

  26. 1 ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి, 2 “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.

    3 అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు.

  27. 46 వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు. 47 వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.

  28. 1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, 3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. 4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. 5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.

  29. 20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు.

  30. 14 సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది.

    మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?

  31. 2 దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు. 3 అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు.

  32. 16 దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.

  33. 16 స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి. 17 అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.

  34. 1 గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. 2 అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది. 3 ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.

  35. 1 అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు. 2 ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ, 3 అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.

  36. 46 నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు?

  37. 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.

  38. 3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  39. 28 ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు. 29 అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకుని వెళ్ళాడు.

    30 అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు. 31 ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. 32 యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు.

  40. 47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. 49 అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. 50 యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.

  41. 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా?

  42. 8 అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు.

  43. 14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

  44. 7 మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

  45. 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

  46. 41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.

    44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు.

  47. 3 అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా?” అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు. 4 వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు. 5 “మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా?” అని వారిని అడిగాడు. 6 ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు.

  48. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  49. 13 అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.

  50. 17 ఈ మనుషులు నీళ్ళులేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటి వారు. గాడాంధకారం వీరి కోసం సిద్ధంగా ఉంది.

  51. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.

  52. 8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.