107 Bible Verses About Liars

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Liars
  1. 43 నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.

    45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. 46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? 47 ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.”

  2. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

  3. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

    3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  4. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

    20 కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.

  5. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

    25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. 26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి.

  6. 7 అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు. 8 అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు, 9 నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.

    10 ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా సున్నతి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు. 11 వారి నోళ్ళు మూయించడం అవసరం. వారు సిగ్గుకరమైన స్వలాభం కోసం బోధించకూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలను పాడు చేస్తున్నారు.

    12 వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తే ఇలా అన్నాడు, ‘క్రేతు ప్రజలు ఎంతసేపూ అబద్ధికులు, ప్రమాదకరమైన దుష్టమృగాలు, సోమరులైన తిండిబోతులు.’ 13-14 ఈ మాటలు నిజమే. అందుచేత వారు యూదుల కల్పిత గాథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి ఆజ్ఞల గురించి సమయం వ్యర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.

    15 పవిత్రులకు అన్నీ పవిత్రమే. కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. కానీ వారి హృదయం, వారి మనస్సాక్షి కూడా అపవిత్రాలే. 16 దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.

  7. 22 అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.

  8. 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.

    8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  9. 1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

    3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.

    5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది.

  10. 16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.

  11. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు.

  12. 5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.

    6 దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.

    7 మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

    8 ప్రతిరోజూ ఉదయాన్నే దేశంలో దుర్మార్గులందరినీ నేను సంహరిస్తాను. యెహోవా పట్టణంలో పాపం చేసేవాళ్ళు లేకుండా చేస్తాను.

  13. 23 చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

    24 పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

    25 వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

    26 వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.

    27 గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.

    28 అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

  14. 11 నేను మీ దేవుడైన యెహోవాను.

    మీరు దొంగతనం చేయకూడదు.

    అబద్ధం ఆడకూడదు.

    ఒకడినొకడు దగా చెయ్యకూడదు.

    12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు.

    నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

  15. 13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.

    14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

    15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

  16. 4 నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.

    5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.

    6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.

  17. 9 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.

  18. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది.

  19. 8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.

    9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10 వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

    11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.

  20. 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

  21. 1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక.

    ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.

    2 నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు.

    నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.

    3 విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.

    4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.

    ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.

    5 ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.

    6 కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.

    7 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?

    8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.

    ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.

    9 ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా?

    ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.

  22. 8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

    9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

  23. 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

    మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

    ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

    ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

  24. 1 యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు.

    మీ అపరాధాలు మీకూ మీ దేవునికీ అడ్డంగా వచ్చాయి.

    2 మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు.

    3 మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి.

    మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది.

    4 ఎవడూ న్యాయంగా దావా వేయడం లేదు. ఎవడూ నిజాయితీతో తన వాదన వినిపించడం లేదు.

    వాళ్ళు వట్టి మాటలను నమ్ముకుని అబద్ధాలు చెబుతారు. చెడును గర్భం ధరించి పాపాన్ని కంటారు.

  25. 19 నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.

    20 కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.

  26. 5 నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.

  27. 5 దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు.

    6 ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.

  28. 21 ఇలా అనుకుని గేహజీ నయమాను వెనకాలే వెళ్ళాడు. తన వెనకాలే ఎవరో పరుగెత్తుకుంటూ రావడం నయమాను చూసి తన రథంపై నుండి దిగి అతణ్ణి కలుసుకుని “అంతా క్షేమమేనా?” అని అడిగాడు. 22 గేహాజీ “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. ‘ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై నాలుగు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.

    23 అందుకు నయమాను “నీకు డెబ్భై కిలోలు సంతోషంగా ఇస్తాను” అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి రెండు బస్తాల్లో డెబ్భై కిలోల వెండి ఉంచి, రెండు జతల బట్టలూ ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళను పంపాడు. వారు వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు. 24 వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు. 25 తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి “గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?” అని అడిగాడు. దానికి గేహాజీ “నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అన్నాడు.

    26 అప్పుడు ఎలీషా గేహజీతో “ఆ వ్యక్తి నిన్ను కలుసుకోడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బూ, మంచి బట్టలూ, ఒలీవ తోటలూ, ద్రాక్ష తోటలూ, గొర్రెలూ, పశువులూ, సేవకులూ, సేవకురాళ్ళూ వీటిని సంపాదించుకోడానికి ఇదా సమయం? 27 అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది” అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్టురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.

  29. 11 పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.

    12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

    13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

    14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.

    15 యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.

  30. 10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.

  31. 5 నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

  32. 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

    సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.

    యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

    2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

    హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.

    ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

    3 కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.

    దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు.

    సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.

  33. 11 అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో “చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు, 12 ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు. 13 నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.

  34. 20 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.

  35. 19 అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు. 20 ‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.

    21 అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు. 22 అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు. 23 చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”

  36. 3 దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.

  37. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  38. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

    10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12 అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

  39. 5 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.

  40. 9 అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు.

  41. 18 అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు. 19 దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.

  42. 3 కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? 4 కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.

  43. 16 సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

    18 అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు.

  44. 6 అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.

  45. 9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?

    10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.

  46. 1 నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు.

  47. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

  48. 6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. 7 అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు “ఆమె నా చెల్లి” అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు. 8 అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.

    9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి “చూడు, ఆమె కచ్చితంగా నీ భార్యే, ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. దానికి ఇస్సాకు “ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను” అన్నాడు. 10 అందుకు అబీమెలెకు “నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!” అన్నాడు. 11 కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ “ఈ వ్యక్తిని గానీ ఇతని భార్యను గానీ ముట్టుకునే వాడు కచ్చితంగా మరణశిక్ష పొందుతాడు” అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.

  49. 2 నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.

    3 నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం.

    4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.

    5 కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.

  50. 163 అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

  51. 4 చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు.

  52. 7 అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.

  53. 22 మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు.

  54. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

    21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”

  55. 8 స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు. 9 అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని 10 అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.

    11 అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు. 12 ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు. 13 అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు.

  56. 13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

  57. 31 వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. 32 వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు. 33 అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు.

    34 యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. 35 అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

  58. 15 ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. 16 “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు. 17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. 18 ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.

    19 అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు. 20 మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది. 21 ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు.

  59. 1 పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు. 2 దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.

  60. 15 ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి. 16 ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే 17 ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.

    18 ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి. 19 ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు. 20 ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు. 21 దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”

  61. 32 “మోసపు కలలను పలికే వాళ్లకు నేను విరోధిని. వాళ్ళు అబద్ధాలు చెబుతూ మోసంతో గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.” ఇది యెహోవా వాక్కు. “నేను వాళ్ళను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళ వలన ఈ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు.” ఇదే యెహోవా వాక్కు.

  62. 16 మీరు చేయవలసిన వేమిటంటే ప్రతివాడూ తన పొరుగు వాడితో సత్యమే మాటలాడాలి.

    సత్యాన్ని బట్టి శాంతికరమైన న్యాయాన్నిబట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి.

    17 తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు.

    అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు.

    ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు.

  63. 13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18 శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

  64. 18 అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

  65. 14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.

    15 అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”

  66. 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

  67. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.

  68. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

  69. 12 శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.

    13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? 14 యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. 15 అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.

  70. 29 ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు.”

  71. 2 మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు? సెలా.

  72. 29 మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.

    30 విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.

  73. 25 నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

  74. 13 ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు.

    అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు.

    వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.”

  75. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

    30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  76. 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.

  77. దావీదు కీర్తన.

    1 యెహోవా, నీ మందిరంలో ఉండదగినవాడు ఎవరు? నీ పవిత్ర పర్వతం మీద నివసించ గలవాడు ఎవరు?

    2 అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుంచి సత్యం పలుకుతాడు.

    3 అతడు నాలుకతో కొండేలు చెప్పడు. ఇతరులకు హాని చెయ్యడు, తన పొరుగు వాణ్ణి కించపరచడు.

    4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా పట్ల భయభక్తులు గలవాళ్ళను అతడు సన్మానిస్తాడు. అతడు మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినా తన మాట వెనక్కి తీసుకోడు.

    5 అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోడు. నిరపరాధికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు. ఇలా చేసేవాడు ఎన్నడూ చలించడు.

  78. 11 నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.

  79. 2 యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.

  80. 7 మోసగాడి పద్ధతులన్నీ దుర్మార్గంగా ఉంటాయి. పేదవాళ్ళు సరైనదేదో చెప్పినా, పేదవాళ్ళని నాశనం చేయడానికి వాడు అబద్దాలతో పన్నాగాలు పన్నుతాడు.

  81. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

  82. 12 క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు. 13 అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు. 14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. 15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

    16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  83. 1 గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. 2 అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది. 3 ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.

  84. 23 దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.

  85. 28 అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా?

  86. 18 తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.

  87. 11 “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. 12 అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.

  88. 59 ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. 60 అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. 61 చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు.

  89. 55 మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేనూ అబద్ధికుడిని అవుతాను. కానీ నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను.

  90. 8 మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.

  91. 20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు.

  92. 7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు. 9 వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.

    10 వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.

  93. 1 యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. 2 “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా 3 అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది. 4 ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి.

    5 తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.

  94. 2 నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.

    3 నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,

    4 నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.

    5 మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.

  95. 3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

    4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

    5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

  96. 4 యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి.

  97. 14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.

  98. 21 ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు. 22 ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.

    23 “ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు. 24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు. 25 ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను. 26 కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.

    27 “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.

  99. 17 సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.

  100. 17 సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. 18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.

  101. 24 “నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు.

  102. 18 అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.

  103. 5 నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.

  104. 28 అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.

  105. 18-19 తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.

  106. 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

    18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.

    20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

  107. 13 అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.