38 Bible Verses About Sorcery

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Sorcery
  1. 9 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు. 10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, 11 ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు. 12 వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.

    13 మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. 14 మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.

  2. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  3. 9 పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి.

    నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి.

    10 నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు.

    నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి.

    11 వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు.

    కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు.

    నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది.

    12 నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు.

    ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో.

    13 నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు.

    జ్యోతిష్యులనూ, నక్షత్రాలు చూసి, నెలలు లెక్కించి శకునాలు చెప్పేవారినీ పిలిచి,

    నీకు జరగబోయేవి నీ మీదికి రాకుండా తప్పించి నిన్ను రక్షిస్తారేమో ఆలోచించు.

    14 వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది.

    అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు.

    అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు.

    15 నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు.

    నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు.

    నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు.

  4. 10 మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.

    11 అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. 12 వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.

  5. 9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు. 10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు. 11 అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట వినేవారు.

    12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు. 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.

    14 సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు. 15 వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు. 16 అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిసం మాత్రం పొందారు.

    17 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. 18 అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం చూసి, సీమోను, 19 వారికి డబ్బులివ్వ జూపి “నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండి” అని అడిగాడు.

    20 అందుకు పేతురు, “నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశిస్తుంది గాక. 21 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు. 22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు. 23 నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. నీ నిలువెల్లా చేదు విషమే నాకు కనిపిస్తున్నది.” అని చెప్పాడు.

    24 అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.

  6. 11 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి. 13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.

    14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు. 15 అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది. 16 ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.

    17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది. 18 విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.

    19 అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది. 20 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది.

  7. 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  8. 6 వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్‌ యేసు అనే ఒకణ్ణి చూశారు. 7 ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.

    8 అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి 10 అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. 12 అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.

  9. 1 మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు. 2 ఇతడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్లగొట్టిన రాజ్యాల ప్రజలు చేసిన నీచమైన పనులు అనుసరించి, యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు. 3 ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠాలను నిలిపి, అషేరా దేవతాస్తంభాలను చేయించి, ఆకాశనక్షత్రాలన్నిటిని పూజించి కొలిచాడు.

    4 “యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది” అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు. 5 యెహోవా మందిరపు రెండు ఆవరణాల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు. 6 బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

    7 “ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నాపేరు ఎల్లప్పుడూ ఉంచుతాను.

  10. 23 దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.”

  11. 18 మంత్రగత్తెను బతకనివ్వకూడదు.

  12. 19 వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా?

    బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?

    20 ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి.

    వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.

    21 అలాటి వారు ఇబ్బంది పడుతూ ఆకలితో దేశమంతా తిరుగులాడుతారు.

    ఆకలేసి కోపపడతారు. తమ ముఖాలు ఆకాశం వైపుకు ఎత్తి తమ రాజును, తమ దేవుణ్ణి దూషిస్తారు.

    22 భూమి వైపు తేరి చూసి, దురవస్థ, అంధకారం, భరించరాని వేదన అనుభవిస్తారు. ఇతరులు వారిని వారు గాఢాంధకార దేశంలోకి తోలివేస్తారు.

  13. 16 అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు. 17 అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి. 18 మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు 19 మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.

  14. 31 చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.

  15. 6 చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.

  16. 1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

    2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

    3 అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

    4 అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

    5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  17. 9 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు. 10 మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరు నాశనమవుతారు.

  18. 26 మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను.

    27 పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”

  19. 13 సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. 14 మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

  20. 10 యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను.

    నీ రథాలను ధ్వంసం చేస్తాను.

    11 నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను.

    నీ కోటలన్నిటినీ పడగొడతాను.

    12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను.

    జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.

  21. 16 మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.

    17 ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. 18 ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.

  22. 12 “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.

    13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.

    14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

    15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

  23. 22 అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. 23 తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.

  24. 23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు.

    ఏ శకునం హాని చెయ్యదు.

    దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ ‘దేవుడు ఏం చేశాడో చూడు’ అని చెప్పుకోవాలి.

    24 చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు,

    ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది.

    చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు.

    25 అప్పుడు బాలాకు బిలాముతో “వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు” అన్నాడు. 26 కాని బిలాము “యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?” అని బాలాకుకు జవాబిచ్చాడు.

    27 బాలాకు బిలాముతో “నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో” అన్నాడు.

  25. 6 అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

  26. 2 గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.

  27. 17 నరపుత్రుడా, తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవచనం పలికే ఇశ్రాయేలు ప్రజల కూతుళ్ళకు విరోధంగా ప్రవచించు. 18 ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ప్రజలను ఉచ్చులోకి లాగేందుకు తమ చేతుల నిండా తాయెత్తులు కట్టుకుని తమ తలలపై రకరకాల ముసుగులు వేసుకునే స్త్రీలకు బాధ. నా ప్రజల ప్రాణాలను ఉచ్చులోకి లాగుతూ మీ ప్రాణాలను కాపాడుకోగలరా?

    19 చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.

    20 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. పక్షులకు వల విసిరినట్టుగా ప్రజల ప్రాణాలకు ఉచ్చు వేయడానికి మీరు ఉపయోగించే తాయెత్తులకి నేను వ్యతిరేకం. వాటిని మీ చేతులనుండి నేను కచ్చితంగా తెంపి వేస్తాను. పక్షులను పట్టినట్టు మీరు వల వేసి పట్టిన ప్రజలను నేను విడిపిస్తాను. 21 వాళ్ళు ఇకపై మీ చేతుల్లో బందీలుగా ఉండకుండాా నేను మీ ముసుగులను చింపి వాళ్ళని విడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

    22 నీతిగల వ్యక్తి నిరుత్సాహపడాలని నేను కోరుకోను. కానీ మీరు మీ అబద్దాల చేత నీతిగల వ్యక్తులను నిరుత్సాహపరిచారు. దుర్మార్గుడు తన పాపం వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకోకుండా మీరు వాడి దుర్మార్గతను ప్రోత్సహించారు. 23 కాబట్టి మీరు ఇకనుండి అబద్ధపు దర్శనాలు చూడరు. జోస్యాలూ చెప్పరు. నా ప్రజలను నేను మీ స్వాధీనం నుండి విడిపిస్తాను. అప్పుడు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

  28. 20 ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు. 21 అలాగే వారు సాగిస్తున్న నరహత్యలనూ, మాయమంత్రాలనూ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేదు.

  29. 20 యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.

    21 నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది. 22 ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.

  30. 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.

    నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

  31. 16 వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు. 17 ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు.

  32. 6 యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు.

    వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ,

    పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు.

  33. 27 దానియేలు రాజు ఎదుట నిలబడి ఇలా జవాబిచ్చాడు. “రాజు కోరినట్టు ఈ మర్మం వివరించడం జ్ఞానులకైనా, గారడీ విద్యలు చేసేవాళ్ళకైనా, శకునం చెప్పేవాళ్ళకైనా, జ్యోతిష్యులకైనా సాధ్యం కాదు. 28 అయితే గుప్తంగా ఉన్న విషయాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మీరు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మనస్సులోకి వచ్చిన దర్శనం ఏమిటో మీకు తెలియజేస్తాను.

  34. 1 ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.

    2 ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది.

  35. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

    10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12 అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

  36. 4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.

  37. 24 ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు.

  38. 7 అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది.

    సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు.

    నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.