51 Bible Verses About Overcoming Hard Times

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Overcoming Hard Times
  1. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  2. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

    10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు.

  3. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

    11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.

    నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు

    12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.

    నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.

    13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.

  4. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”

    7 మోషే యెహోషువను పిలిచి, “నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

  5. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  6. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.

    7 అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  7. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.

  8. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

    27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. 28 ‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.

    30 ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు. 31 నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.”

  9. 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  10. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

    1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

    2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

    3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

  11. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

  12. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  13. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  14. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

    5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.

  15. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.

  16. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  17. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  18. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  19. 1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు,

    “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

    2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

    నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

    నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

    3 యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి.

    నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను.

  20. 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

  21. 22 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. 23 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. 24 అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.

  22. 3 తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.

    4 నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!

  23. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  24. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

  25. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.

    18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.

  26. 4 ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.

  27. 5 కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు.

    “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు.

    ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”

    6 ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు.

  28. దావీదు కీర్తన.

    1 యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?

    2 నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.

    3 నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను.

  29. 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి. 16 అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.

    17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.

  30. 6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.

    7 నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.

    8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.

  31. 6 దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.

  32. 9 పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.

    10 యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.

  33. 1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.

    2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.

    3 వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.

    4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.

  34. 21 వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నెగోల నిలువుటంగీలు, పైదుస్తులు, మిగిలిన దుస్తులు ఏమీ తియ్యకుండానే బంధించి మండుతున్న ఆ గుండం మధ్యలో పడేలా విసిరివేశారు. 22 రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన ఆ బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు.

    23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు. 24 తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. 25 అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు.

    26 తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు.

  35. 31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?

  36. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి.

  37. 1 ఇక ఇతర విషయాలకు వస్తే సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా, 2 మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు. 3 అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.

    4 మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది. 5 దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!

  38. 12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

    14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  39. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.

  40. 4 ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలు పెట్టు. మేమంతా నీతోనే ఉంటాం.”

  41. 4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

  42. 4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

    5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.

    6 అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.

    7 యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

    8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.

    9 యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.

    10 సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.

  43. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

  44. 13 బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు.

    ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.

  45. 7 యెహోవా ఉత్తముడు, బాధ కలిగినప్పుడు ఆయన ఆశ్రయం కలిగిస్తాడు. తనపై నమ్మకం ఉంచేవాళ్ళు ఆయనకు తెలుసు.

  46. 11 ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.

  47. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  48. 8 సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.

    9 వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది. 10 ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. 11 మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.

  49. 17 అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.

  50. 23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.

  51. 4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.