78 Bible Verses About Deliverance

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Deliverance
  1. 17 యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే,

    18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.

    పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు.

    చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,

    19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు”

    అని రాసిన చోటు ఆయనకు దొరికింది.

  2. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

    6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

  3. 14 కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు. 15 మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు. 16 ఆయన కచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. అబ్రాహాము సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. 17 దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది. 18 ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.

  4. 1 యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు.

    అతడిలా ప్రార్థించాడు.

    2 యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.

    3 నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను.

    నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం.

    హింస నుండి నన్ను కాపాడేవాడు.

  5. 14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో, 15 అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి.

    16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  6. 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

  7. 21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.

    22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. 24 అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

  8. 13 అందుకు మోషే “భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. 14 మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు.

  9. 13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

    18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.

  10. 23 కాబట్టి పరలోకంలో ఉన్నవాటికి నకలుగా ఉన్న వస్తువులు జంతు బలుల వల్ల శుద్ధి కావలసి ఉంది. అయితే అసలు పరలోకానికి సంబంధించినవి శుద్ధి కావాలంటే అంతకంటే శ్రేష్ఠమైన బలులు జరగాలి. 24 అందుచేత చేతులతో నిర్మాణం జరిగి, నిజమైన దానికి నకలుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశించలేదు, ప్రస్తుతం ఆయన మనందరి కోసమూ దేవుని సన్నిధిలో కనిపించడానికి ఏకంగా పరలోకంలోకే ప్రవేశించాడు.

    25 అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని వేరే రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అయితే యేసు పదే పదే తనను తాను అర్పించుకోడానికి అక్కడికి వెళ్ళలేదు. 26 ఒకవేళ ఆయన పదేపదే అక్కడికి వెళ్ళాల్సి వస్తే భూమి ప్రారంభం నుండి ఆయన అనేకసార్లు హింస పొందాల్సి వచ్చేది. కానీ ఆయన ఈ కాలాంతంలో ప్రత్యక్షమై ఒకేసారి తనను తాను బలిగా అర్పించడం ద్వారా పాపాన్ని తీసివేశాడు.

    27 మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది. 28 అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.

  11. 2 యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.

  12. 18 ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్‌.

  13. 7 నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.

  14. 24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.

  15. 9 అందుకు యేసు, “ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. 10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు” అని చెప్పాడు.

  16. 12 “అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు 13 రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను. 14 మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.

    15 అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని. 16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు, 17-18 నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

  17. 16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి.

  18. 7 యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. 8 కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. 9 నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. 10 నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”

  19. 16 అటు తరువాత యెహోవా వాళ్ళ కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. దోచుకొనేవాళ్ళ చేతిలో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులను రక్షించారు. అయినా ఇస్రాయేల్ ప్రజ ఆ న్యాయాధిపతుల మాట వినలేదు.

  20. 1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,

    “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.

    యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది.

    నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.

    నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

  21. 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

  22. 55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

    56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

    57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.

  23. 8 సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.

    9 వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది. 10 ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. 11 మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.

  24. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి. 18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.

  25. 3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

    4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. 5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  26. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  27. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

  28. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

  29. 6 కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. 7 మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.

  30. 15 సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.

  31. 13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”

  32. 14 మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు. 15 అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

    19 మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.

  33. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

  34. 25 కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు.

  35. 5 అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.

    7 మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.

  36. 37 సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు” అని చెప్పాడు. సౌలు “యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు” అని దావీదుతో అన్నాడు.

  37. 46 యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక.

    47 ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.

    48 ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు.

  38. 4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

  39. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

  40. దావీదు కీర్తన.

    1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

    2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

    3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

    4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

    5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.

  41. 32 యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది.

    యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు.

    యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”

  42. 9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

    11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.

  43. 38 కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.

    39 మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి.

  44. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

  45. 13 అయితే ప్రభువు ప్రేమించిన సోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మడం ద్వారా, పరిశుద్ధాత్మ చేసే శుద్ధీకరణ ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని తొలిపంటగా ఎంచుకున్నాడు.

  46. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

  47. 19 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే 20 అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

  48. 1 అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ,

    సముద్రంలో ముంచి వేశాడు.

    గొప్ప విజయం సాధించాడు.

    2 యెహోవాయే నా బలం, నా గానం,

    నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను.

    ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను.

  49. 8 రక్షణ యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. సెలా.

  50. 36 కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”

  51. 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

  52. 6 హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.

    7 ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. 8 దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు. 9 అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు. 10 మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

    11 పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు.

  53. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  54. 13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

  55. 11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

  56. 8 యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.

    9 నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.

  57. 19 సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు.

    20 మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.

  58. 17 బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.

    18 భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.

    19 కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.

    20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.

    21 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

    22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.

  59. 1 “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.

  60. 23 వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. 24 కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. 25 అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.

  61. 24 కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25 మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.

  62. 16 పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది. 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.

    18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది. 19 ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది.

  63. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

  64. 13 ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. 14 మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు. 15 ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ ఓడించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు.

  65. 10 మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.

  66. 18 యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.

  67. 16 పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు.

    17 నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు.

    18 ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు.

    19 విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.

  68. ప్రధాన సంగీతకారుడి కోసం. దావీదు కీర్తన

    1 యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు.

    2 భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు.

    3 తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు.

  69. 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.

    అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

    గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,

    2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.

  70. 18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.

  71. 4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

    6 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు. 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.

  72. 12 అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. 13 నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.

  73. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”

  74. 12 దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు.

    13 అందుకే నేను నీకు మొక్కుకున్నాను. నీకు స్తుతియాగాలు అర్పిస్తాను.

  75. ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).

    1 నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.

    2 పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.

  76. 13 యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.

    14 ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు.

    15 వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు.

  77. 11 ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.”

  78. 12 అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. 13 ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. 14 ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది. 16 ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.

    17 నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే. 18 జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.