65 Bible Verses About God's Plan

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Plan
  1. 10 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు. 14 అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’

  2. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

    10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.

  3. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

    28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

  4. 10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.

    11 యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.

  5. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  6. 24 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా అంటున్నాడు. “కచ్చితంగా నేను ఉద్దేశించినట్టే అది జరుగుతుంది. నేను యోచన చేసినట్టే అది ఉంటుంది.

    25 నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను. నా పర్వతాల మీద అతన్ని నా కాళ్ళ కింద తొక్కుతాను. అప్పుడు అతని కాడి నా ప్రజల మీద నుంచి తొలగిపోతుంది. అతని భారం వాళ్ళ భుజాల మీద నుంచి తేలిపోతుంది.

    26 సర్వలోకం గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జాతులన్నిటి మీదా చాపిన చెయ్యి ఇదే.

    27 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దాన్ని ఆలోచించాడు. ఆయన్ని ఆపేవాడెవడు? ఆయన చెయ్యి ఎత్తి ఉంది. దాన్ని ఎవడు వెనక్కి తిప్పుతాడు?”

  7. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  8. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  9. 22 “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు. 23 దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.

  10. 21 మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.

  11. 9 ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.

  12. 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.

    7 భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి.

    వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.

    8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.

    9 “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

    10 వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి.

    దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి.

    అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.

    11 ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు.

    అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.

  13. 5 నన్ను ఎవరితో పోల్చి ఎవరిని నాకు సాటివారుగా చేస్తారు? నాకు సమానమని ఎవరిని నాకు పోటీగా చేస్తారు?

    6 ప్రజలు విస్తారమైన బంగారం తెచ్చి పోస్తారు. వెండిని తెచ్చి బరువు తూస్తారు.

    ఒక కంసాలిని జీతానికి పిలిచి అతనికి దాన్ని అప్పగిస్తారు. అతడు దాన్ని ఒక దేవుడుగా రూపొందిస్తాడు. వారు దానికి సాగిలపడి నమస్కారం చేస్తారు.

    7 వారు దాన్ని తమ భుజాల మీద ఎక్కించుకుంటారు. దాన్ని మోసుకుపోయి దాని స్థానంలో నిలబెడతారు.

    అది అక్కడి నుండి కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. ఒకడు దానికి మొర్రపెట్టినా జవాబు చెప్పదు, ఎవరి బాధా తీసివేయలేదు, రక్షించలేదు.

    8 ఈ విషయాలు ఆలోచించండి. వాటిని మర్చిపోవద్దు. తిరుగుబాటు చేసే మీరు దీన్ని ఆలోచించండి.

    9 చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు.

    10 ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను.

    “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను.

    11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నా సంకల్పాన్ని జరిగించే వ్యక్తిని పిలుస్తున్నాను.

    నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించినదాన్ని సఫలం చేస్తాను.

  14. 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.

  15. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

  16. 8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

  17. 6 ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. 7 అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.

    8 దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. 9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.

  18. 2 నువ్వు సమస్త క్రియలను చేయగలవనీ నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదనీ నేనిప్పుడు తెలుసుకున్నాను.

  19. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  20. 5 “నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.

    జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.”

    6 అందుకు నేను “అయ్యో, యెహోవా ప్రభూ, నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నాకు మాట్లాడడం చేత కాదు” అన్నాను.

    7 అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి.

    నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి.

    8 వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.”

  21. 1 చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు. 2 మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నేర్పించాము. మీరూ ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము. 3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.

    4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.

    8 కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు. 9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.

    11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.

  22. 4 మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి. 5 ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.

    6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది,

    “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను.

    అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.

    ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”

    7 కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి,

    “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.”

    8 అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది.

    వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.

    9 చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

    10 ఒకప్పుడు మీరు ప్రజ కాదు.

    కానీ ఇప్పుడు దేవుని ప్రజ.

    పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు.

    అయితే ఇప్పుడు కనికరం పొందారు.

    11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.

  23. 8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.

  24. 38 ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. 39 ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”

  25. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  26. 3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను. 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే. 5 సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు. 6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.

  27. 26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

    28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

    30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  28. 12 తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. 13 వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.

  29. 13 కానీ పౌలు, “ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు. 14 అతడు మనసు మార్చుకోడని గ్రహించాక మేము, “ప్రభువు చిత్తం జరుగుతుంది గాక” అని ఊరుకున్నాం.

  30. 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.

    22 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23 అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. 24 అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25 ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.

    26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

    30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

  31. 23 దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు.

    24 యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు.

  32. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

  33. 5 క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు,

    “నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు.

    కానీ నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు.

    6 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు.

    7 అప్పుడు నేను నీతో ఇలా అన్నాను, ‘చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను.’”

    8 పైన చెప్పినట్టుగా ఆయన, “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవి” అన్నాడు. 9 ఆ తరువాత ఆయన, “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు. 10 ఈ రెండవ ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది.

  34. 20 గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు 21 ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక! తన దృష్టిలో ప్రీతికరమైన దాన్ని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక! ఆ యేసు క్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమెన్.

  35. 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.

  36. 14 ఆయన దగ్గర మనకున్న ధైర్యం ఇదే, ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు.

  37. 20 మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.

  38. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  39. 31 ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు. 32 దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు. 33 “ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

    34 యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం.

  40. 30 “నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.

  41. 3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

    4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. 5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  42. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  43. 33 ఆయన వారితో, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అన్నాడు. 34 తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి” అని అన్నాడు.

  44. 25 సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.

    26 “విమోచకుడు సీయోనులో నుండి వచ్చి

    యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.

    27 నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే”

    అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు.

    28 సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు. 29 ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు. 30 గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు. 31 అలాగే మీపై చూపిన కనికరాన్ని బట్టి ఇప్పుడు కనికరం పొందడం కోసం, వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు. 32 అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు.

    33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.

    34 “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు?

    ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?

    35 ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”

    36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  45. 35 కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.

    37 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు.

    ఆయన ఆలస్యం చేయడు.

    38 నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు.

    అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.”

  46. 14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.

  47. 15 చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను. 16 మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

    17 అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే 18 మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను. 19 ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. 20 మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

  48. 20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.

    21 యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.

  49. 13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

    14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

    15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

    16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

    17 దేవా, నీ ఆలోచనలు నాకెంతో ప్రశస్తమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది.

  50. 10 నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.

  51. 21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.

  52. 50 నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.

  53. 10 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు.

    11 “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, 12 మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా? 13 అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 14 అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.

  54. 39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు. 40 శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?

  55. 42 యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు.

  56. 42 “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”

  57. 22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.

  58. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. 6 రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.

    7 నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. 8 మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. 9 మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు.

    10 మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. 11 వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. 12 తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.

  59. 19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

  60. 5 బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.

    6 కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు. 7 ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది. 8 భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.

  61. 4 అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. 5 అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.

    7 మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 8 కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.

  62. 8 నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం.

  63. 6 తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.

    7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.

    8 పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది.

    9 నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

  64. 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

  65. 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు. 14 “నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు. 15 ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.

    16 సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

    18 అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు. 19 ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది. 20 మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.