37 Bible Verses About New Year
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. 4 మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.
5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.
7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.
11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
-
11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
-
17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.
-
12 వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. 13 సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను. 14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.
15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
-
22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.
నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.
కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
25 తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.
-
30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.
31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
-
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
-
3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.
-
11 యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి.
ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12 ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా,
ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా,
13 ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
-
12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.
14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.
16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
-
9 ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.
-
11 సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.
-
12 కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
-
11 కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. 12 రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం. 13 పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.
-
17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
-
24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
-
17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.
18 దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు.
-
1 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.
2 యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.
3 రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.
-
13 “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
-
1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి. 4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.
6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7-8 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.
-
5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు. 10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
-
4 నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక.
-
25 మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.
26 కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27 నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. 28 నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
-
17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.
ఆయన శక్తిశాలి.
ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు.
నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.
-
15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 19 కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి. 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
-
6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.
-
11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
-
2 “నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట.
-
18 నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు.
-
18 వారు అక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ప్రతి అసహ్యమైన దాన్నీ నీచమైన దాన్నీ అక్కడనుండి తీసివేస్తారు.
19 వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. 20 దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
-
13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
-
11 దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.
-
26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?
27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
-
18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
-
20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.
-
2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.
Shows Read in context, Share and Copy.