88 Bible Verses About Character

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Character
  1. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

    6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము.

  2. 1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, 3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. 4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. 5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.

    6 ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు. 7 వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు. 8 యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు. 9 అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.

  3. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  4. 1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు. 2 దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!

    3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

    5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.

    9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు. 10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు. 11 దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది.

  5. 1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2 ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.

    3 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.

    4 దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.

    5 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.

    6 నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.

    7 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.

    8 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.

    9 శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.

    10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.

    11 “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. 12 అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.

  6. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  7. 12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. 14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

  8. 8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  9. 21 ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు.

    22 అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు. 23 ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటించిన సువార్త వల్ల కలిగిన నిబ్బరం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను.

  10. 10 సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.

    11 ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు.

    12 ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు.

    13 ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది.

    14 వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.

    15 ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.

    16 ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.

    17 ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.

    18 తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.

    19 ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది.

    20 దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.

    21 తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.

    22 ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు.

    23 ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి.

    24 ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది.

    25 బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.

    26 ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది.

    27 ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు.

    28 ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.

    29 “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు.

    30 చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.

    31 ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.

  11. 16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.

    18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

    25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

  12. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  13. 7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. 9 దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.

    11 ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.

  14. 33 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”

  15. దావీదు కీర్తన.

    1 యెహోవా, నీ మందిరంలో ఉండదగినవాడు ఎవరు? నీ పవిత్ర పర్వతం మీద నివసించ గలవాడు ఎవరు?

    2 అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుంచి సత్యం పలుకుతాడు.

    3 అతడు నాలుకతో కొండేలు చెప్పడు. ఇతరులకు హాని చెయ్యడు, తన పొరుగు వాణ్ణి కించపరచడు.

    4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా పట్ల భయభక్తులు గలవాళ్ళను అతడు సన్మానిస్తాడు. అతడు మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినా తన మాట వెనక్కి తీసుకోడు.

    5 అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోడు. నిరపరాధికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు. ఇలా చేసేవాడు ఎన్నడూ చలించడు.

  16. 1 ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.

  17. 4 వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి.

  18. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

    26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

    28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

    30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

  19. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.

  20. 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

    20 అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22 కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23 మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24 దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

  21. 12 వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. 13 సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను. 14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.

    15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము.

    17 సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి. 18 చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను. 19 నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.

    20 ఎందుకంటే మనం అయితే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. 21 సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.

  22. 11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. 13 అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా 14 నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.

    15 భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.

  23. 16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  24. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

    8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.

    9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. 10 మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. 11 నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.

  25. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.

  26. 5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు. 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.

    8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

  27. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.

  28. 51 “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.

  29. 9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.

    11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.

  30. 11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

  31. 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.

  32. 5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.

  33. ఆలెఫ్‌

    1 ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.

  34. 4 యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిది. భర్తకు సిగ్గు కలిగించే ఇల్లాలు అతని ఎముకలకు పట్టిన కుళ్లు.

  35. 19 అణచివేతకి గురైన వాళ్ళు యెహోవాలో ఆనందిస్తారు. మనుషుల్లో పేదలైన వాళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.

  36. 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.

  37. 1 కనికరం ఎలా పొందామో అలానే ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము. 2 అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాడి మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.

    3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.

    5 కాబట్టి మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా క్రీస్తు యేసును మా ప్రభువుగా, యేసు కోసం మీ పనివాళ్ళంగా ప్రకటిస్తున్నాము. 6 “చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.

  38. 12 కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. 13 మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి 14 అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. 15 దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.

    16 లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి. 17 ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.

  39. 13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.

    14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.

    15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.

    16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.

  40. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  41. 2 నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.

  42. 14 యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!

  43. 2 వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు.

    “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.

  44. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

  45. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  46. 12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

  47. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి. 4 మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.

  48. 9 నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.

  49. 3 వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి.

    అధికారి డబ్బులు అడుగుతాడు.

    న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు.

    గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు.

    ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.

  50. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  51. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి. 14 మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు. 15 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి. 16 ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.

    17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

    19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

    20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

  52. 22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.

  53. 19 నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. 20 ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు.

    21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.

    22 వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.

  54. 2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.

    3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.

  55. 18 మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19 ఆయన “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు.

    20 ఆయన ఇంకా “నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు” అన్నాడు. 21 యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు. 22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను. 23 నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు” అని మోషేతో చెప్పాడు.

  56. 7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”

  57. 17 విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.

  58. 19 దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.

  59. 1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.

  60. 8 కీడు చేయాలని పన్నాగాలు పన్నే వాడికి జిత్తులమారి అని పేరు పెడతారు.

  61. 15 ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.

  62. 7 కానీ ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు.

  63. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

  64. 17 సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.

  65. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  66. 12 “అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి

  67. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

    19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

  68. 5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.

  69. 1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

  70. 15 పవిత్రులకు అన్నీ పవిత్రమే. కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. కానీ వారి హృదయం, వారి మనస్సాక్షి కూడా అపవిత్రాలే. 16 దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.

  71. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.

  72. 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి.

  73. 17 కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. 18 చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19 వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.

    20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. 22 అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. 23 అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.

  74. 9 నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు.

  75. 5 అప్పుడు యెహోవా మోషేతో “నీవు ఇశ్రాయేలు ప్రజలతో ‘మీరు అవిధేయులైన ప్రజలు. ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చినా మిమ్మల్ని హతం చేస్తాను. మీరు ధరించుకొన్న ఆభరణాలన్నీ తీసివెయ్యండి. అప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చూస్తాను’ అని చెప్పు” అన్నాడు.

  76. 26 వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.

  77. 16 ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు.

  78. 10 కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.

  79. 29 దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.

  80. 4 మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు.

    అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.

  81. 5 యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు. 6 వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు. 7 అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.

  82. 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు.

  83. 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

    14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

  84. 1 కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. 2 అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు.

  85. 23 శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!

    24 మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.

  86. 3 అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.

  87. 9 ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గులను ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు.

    10 ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం. 11 దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వారిని దూషించి వారి మీద నేరం మోపడానికి భయపడతారు.

    12 పశుప్రవృత్తి గల ఈ మనుషులైతే తమకు తెలియని సంగతులను గురించి దూషిస్తారు. వారు బంధకాలకు, నాశనానికి తగినవారు. వారు తమ దుర్మార్గత వల్ల పూర్తిగా నశించిపోతారు. 13 వారి చెడుతనానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్టపగలు సుఖభోగాల్లో ఉంటారు. మచ్చలుగా, కళంకాలుగా ఉంటారు. వారు, మీతో కూడా విందుల్లో పాల్గొంటూనే తమ భోగాల్లో సుఖిస్తూ ఉంటారు. 14 వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.

    15 వారు, అవినీతి సంబంధమైన జీతం కోసం ఆశపడిన బెయోరు కుమారుడు బిలామును అనుసరించి తప్పిపోయారు. సక్రమ మార్గాన్ని వదిలిపెట్టారు. 16 కాని, బిలాము చేసిన అతిక్రమానికి మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా అతన్ని గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.

    17 ఈ మనుషులు నీళ్ళులేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటి వారు. గాడాంధకారం వీరి కోసం సిద్ధంగా ఉంది.

    18 వారు పనికిమాలిన గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వారు చెడు మార్గంలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని తమ శరీర సంబంధమైన చెడు కోరికలతో వెనుదిరిగేలా ప్రేరేపిస్తారు.

    19 వారే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు. 20 ఎవరైనా ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు విషయంలో అనుభవజ్ఞానం వల్ల ఈ లోకపు అపవిత్రతను తప్పించుకొన్న తరువాత దానిలో మళ్లీ ఇరుక్కుని దాని వశమైతే, వారి మొదటి స్థితి కన్నా చివరి స్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది.

    21 వారు, నీతి మార్గాన్ని తెలుసుకున్న తరువాత తమకు అందిన పవిత్ర ఆజ్ఞ నుండి తప్పిపోవడం కన్నా అసలు ఆ మార్గం వారికి తెలియకుండా ఉండడమే మేలు. 22 “కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్ళినట్టుగా” అని చెప్పిన సామెతలు వీళ్ళ విషయంలో నిజం.

  88. 3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు. 4 దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే.