63 Bible Verses About God's Character
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము.
-
7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. 9 దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.
11 ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.
-
5 యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.
6 యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 7 ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.
8 మోషే వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు.
-
11 అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు. 12 దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు. 13 మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు.
14 అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు. 15 దేవుడు మోషేతో ఇంకా “మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.
16 నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ‘మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను.
-
1 పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. 2 ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
4 దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. 5 ఎందుకంటే దేవుడు,
“నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.”
అని గానీ,
“నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు”
అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా? 6 అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు,
“దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.
-
17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.
-
1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి.
2 ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు.
3 వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.
4 వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది.
5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.
నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.
-
7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”
-
5 మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.
-
11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. 13 అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా 14 నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.
15 భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్.
-
1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.
-
23 నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.
24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,
28 మనం ఆయనలో బతుకుతున్నాం,
ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.
‘మనమాయన సంతానం,’
అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.
29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
-
8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
10 అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి. 11 ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
-
17 అప్పుడు యెహోవా “నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను” అని మోషేతో చెప్పాడు. 18 మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19 ఆయన “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు.
20 ఆయన ఇంకా “నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు” అన్నాడు. 21 యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు. 22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను. 23 నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు” అని మోషేతో చెప్పాడు.
-
43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
-
చతుర్థ పరిచ్ఛేదము
దేవుని మనిషి మోషే ప్రార్థన.
1 ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
2 పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
3 నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.
4 నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.
-
27 యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు?
28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?
భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.
ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.
29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.
30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.
31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
-
33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
34 “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు?
ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?
35 ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”
36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్.
-
24 నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
25 పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
26 అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.
27 అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.
-
24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”
-
22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.
-
14-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. 16-17 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.
20 మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి, 21 సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్.
-
26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.
28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
-
19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.
మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.
ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?
ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
-
10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
11 యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
12 యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.
13 ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు.
-
12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.
-
30 దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.
-
6 యెహోవానైన నేను మార్పు చెందను గనుక యాకోబు సంతతివారైన మీరు నాశనం కారు.
-
18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.
-
1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
-
18 దేవుణ్ణి ఇంతవరకూ ఎవరూ చూడలేదు. తండ్రిని అనునిత్యం హత్తుకుని ఉండే దేవుడైన ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు.
-
15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.
-
8 యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు.
-
5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
-
9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.
-
6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.
7 మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. 8 ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. 9 యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు.
-
17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్.
-
11 “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.
12 కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం.
ఆయన ఎవరో మనకు తెలియదు అంటే
ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.
13 ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి,
మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,”
అనే మాటలు నమ్మదగినవి.
-
8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.
9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
13 మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
-
5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి.
-
11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.
-
4 ఆయన మనకు ఆశ్రయ దుర్గం.
ఆయన పని పరిపూర్ణం.
ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి.
ఆయన నమ్మదగిన దేవుడు.
ఆయన పక్షపాతం చూపని దేవుడు.
ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
-
8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.
-
10 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
-
17 “అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
-
25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం. 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
-
3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.
-
21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
-
14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.
15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.
-
8 “ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.
-
11 పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?
-
10 రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే. 13 మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.
14 ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.
-
దావీదు కీర్తన.
1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.
2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.
3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?
4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.
-
4 తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.
5 బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.
6 ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.
7 నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.
8 నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.
9 నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.
10 ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
11 కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.
12 నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.
-
లామెద్.
89 యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
90 నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
91 అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.
-
9 చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు.
10 ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను.
“నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను.
-
10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు.
ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
11 మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.
-
26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
-
10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.
-
6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
-
1 మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
-
3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.
-
1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
Shows Read in context, Share and Copy.