50 Bible Verses About God's Creation

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Creation
  1. 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

    3 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4 ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5 దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.

    6 దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7 దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8 దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.

    9 దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10 దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.

    11 దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12 వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13 రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.

    14 దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. 15 భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.

    16 దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూమికి వెలుగు ఇవ్వడానికీ, 18 పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 19 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు.

    20 దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21 దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    22 దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.

    24 దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25 దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

    26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

    28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

    30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

  2. 8 దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.

    9 దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు. 10 ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది. 11 మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. 12 ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. 13 రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. 14 మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు. 15 దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. 16 దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు. 18 దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. 19 దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. 20 అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.

    23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.

    మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.

    24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. 25 అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.

  3. 15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

    18 సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

  4. 1 ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. 2 ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 3 దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.

  5. 1 పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. 2 ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.

    4 దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.

  6. 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

    24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

  7. 1 ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. 2 ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.

    3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. 4 ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది. 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.

  8. 5 ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.

    6 యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.

    7 ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు.

    8 భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.

    9 ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.

  9. 3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,

    4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?

    5 అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.

    6 నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు.

    7 గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,

    8 ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.

    9 యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

  10. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన.

    1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!

    2 రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.

    3 వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.

    4 అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.

    5 సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.

    6 ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

  11. 3 విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.

  12. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22 ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. 23 అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.

  13. 22 పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను. 23 నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.

    24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.

    26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,

    28 మనం ఆయనలో బతుకుతున్నాం,

    ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

    ‘మనమాయన సంతానం,’

    అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

    29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

    30 ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”

    32 మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు. 33 ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. 34 అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.

  14. 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  15. 6 ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

  16. 7 దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.

  17. 8 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. 9 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. 10 ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.

    11 ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.

  18. 3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.

    4 భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.

    5 సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.

    6 రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.

    7 ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!

  19. 1 యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.

    2 ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.

    3 సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.

    4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.

    5 అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.

    6 ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.

    7 భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి.

    8 అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి.

    9 పర్వతాలూ, ఎన్నెన్నో కొండలూ, ఫలాలిచ్చే చెట్లూ, అన్ని దేవదారు వృక్షాలూ యెహోవాను స్తుతించండి.

    10 మృగాలూ, పశువులూ, నేల మీద పాకే జీవులూ, రెక్కలతో ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించండి.

    11 భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి.

    12 యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక.

    13 ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది.

    14 ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.

  20. 3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. 4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.

    5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.

  21. దావీదు కీర్తన.

    1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.

    2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

  22. 13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

    14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

    15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

    16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

  23. 5 ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి,

    దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,

    6 “గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు.

    7 యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను.

    నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను.

    8 నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను.

    9 గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.”

    10 సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.

    భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.

  24. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి. 18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.

    20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

  25. 7 ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.

    8 ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు.

    9 దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు.

    10 వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు.

    11 ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.

    12 తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు. తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు.

    13 ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది.

    14 ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు?

  26. 5 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, 6 మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.

  27. 4 “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. 5 చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ, 6 ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ, 7 అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.

    8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

    10 అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి. 11 ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?

    12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.

  28. 16 ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. 17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.

  29. 7 అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి.

    8 భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి.

    9 యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు?

    10 జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.

    11 నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా.

    12 వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది.

  30. 2 ఆనందంగా యెహోవాకు సేవ చేయండి, ఆనంద గీతాలు పాడుతూ ఆయన సన్నిధికి రండి.

    3 యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించాడు. మనం ఆయన వాళ్ళం. మనం ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలం.

  31. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  32. 10 ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు.

    నీ చేతులతోనే ఆకాశాలను చేశావు.

    11 అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు.

    బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి.

    12 వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు.

    బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు.

    కానీ నువ్వు ఒకేలా ఉంటావు.

    నీ సంవత్సరాలు ముగిసిపోవు.”

  33. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

  34. 6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను.

    దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు.

    7 నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.

  35. 11 మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.

    12 ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.

    13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.

  36. 8 అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. 9 అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి, 10 “లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.

    11 ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి, 12 బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు. 13 పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు.

    14 అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి 15 “అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. 16 ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు. 17 అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”

    18 వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.

  37. 1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.

    2 జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు?

    3 పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి.

    4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

    5 నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు?

    6-7 దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు?

    8 సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు?

    9 నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా?

    10 సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు,

    11 “నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?

    12 నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా?

    13 దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా?

    14 ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి.

    15 దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది.

    16 సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా?

    17 మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా?

    18 భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు.

    19 వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది?

    20 వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా?

    21 ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి.

    22-23 నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా?

    ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.

    24 మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పు గాలి ఎక్కడనుండి బయలుదేరి భూమి మీద నఖముఖాలా వీస్తుంది?

    25 మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి,

    26 చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి,

    27 వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు?

    28 వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?

    29 మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు?

    30 జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది.

    31 కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా?

    32 వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా?

    33 ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా?

    34 జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా?

    35 మెరుపులు బయలుదేరి వెళ్లి “చిత్తం ఇదుగో ఉన్నాం” అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా?

    36 మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివినిచ్చిన వాడెవడు?

    37 నైపుణ్యంగా మేఘాలను లెక్కబెట్ట గలవాడెవడు?

    38 మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలికించగలిగింది ఎవరు?

    39 ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా?

    40 సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా?

    41 కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?

  38. 25 పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.

    26 అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.

    27 అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.

  39. 1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.

    2 ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.

    3 జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు.

    4 వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.

    5 భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.

    6 దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి.

    7 నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి.

    8 నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.

    9 అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు.

    10 ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి.

    11 అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.

    12 వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.

    13 తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది.

    14 పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు

    15 అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.

    16 యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.

    17 అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.

    18 ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.

    19 ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.

    20 నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.

    21 సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.

    22 సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.

    23 సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.

    24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.

    25 అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.

    26 అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి.

    27 తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.

    28 నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.

    29 నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.

    30 నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.

    31 యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక.

    32 ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.

    33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

    34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

    35 పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.

  40. 17 ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను.

    గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను.

    18 అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను.

    19 నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను.

    ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు.

  41. 4 దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది.

  42. 18 ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు.

    నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు.

    ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.

  43. 26 ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?

    27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!

  44. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.

  45. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

  46. 1 ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.

  47. 25 “ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు.

    26 మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా.

    తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు.

  48. 17 “అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.

  49. 10 లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.

  50. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.