89 Bible Verses About God's Sovereignty

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About God's Sovereignty
  1. 14 కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. 15 అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.” 16 కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.

    17 దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.” 18 కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. 19 అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. 20 అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? 21 ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?

    22 ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? 23 తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, 24 అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి?

    25 దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు,

    “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ,

    ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను.

    26 మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.”

  2. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

    31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?

  3. 7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

    10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. 11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని, 12 దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.

  4. 8 ఈ విషయాలు ఆలోచించండి. వాటిని మర్చిపోవద్దు. తిరుగుబాటు చేసే మీరు దీన్ని ఆలోచించండి.

    9 చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు.

    10 ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను.

    “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను.

    11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నా సంకల్పాన్ని జరిగించే వ్యక్తిని పిలుస్తున్నాను.

    నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించినదాన్ని సఫలం చేస్తాను.

  5. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.

  6. 32 రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది.

    33 ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి. 34 ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.

    35 భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.

  7. 3 మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు

  8. 15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

    18 సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. 19 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

  9. 1 రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.

  10. 1 అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు.

    2 నువ్వు సమస్త క్రియలను చేయగలవనీ నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదనీ నేనిప్పుడు తెలుసుకున్నాను.

    3 “జ్ఞానం లేని మాటలతో ఆలోచనను నిరర్థకం చేసే వీడెవడు?” అలా వివేచన లేక ఏమీ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను.

    4 నువ్వు అన్నావు. “నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను. దాన్ని నాకు తెలియజెప్పు.”

    5 నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను.

    6 కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని, ధూళిలో, బూడిదెలో, పడి పశ్చాత్తాపపడుతున్నాను.

  11. 6 భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.

    7 భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.

  12. 23 నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.

    24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25 ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.

    26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27 అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,

    28 మనం ఆయనలో బతుకుతున్నాం,

    ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

    ‘మనమాయన సంతానం,’

    అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

    29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

    30 ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”

  13. 33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.

    34 “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు?

    ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?

    35 ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”

    36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  14. 6 తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా

    నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.

    7 వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.

    8 అంతరిక్షమా, పైనుండి కురిపించు. ఆకాశాలు నీతిన్యాయలు వర్షించనీ.

    భూమి విచ్చుకుని రక్షణ మొలకెత్తేలా నీతిని దానితో బాటు మొలిచేలా చెయ్యనీ. యెహోవానైన నేను దాన్ని కలిగించాను.

    9 మట్టికుండ పెంకుల్లో ఒక పెంకులాటి ఒకడు తనను చేసిన వానితో వాదిస్తే వాడికి బాధ.

    బంకమట్టి కుమ్మరితో ‘నువ్వేం చేస్తున్నావ్?’ అనవచ్చా? ‘నువ్వు చేసినపుడు నీకు చేతులు లేవా?’ అనగలదా?

    10 ‘నీకు పుట్టినదేమిటి?’ అని తన తండ్రినీ, ‘నువ్వు దేనిని గర్భం ధరించావు?’ అని తల్లినీ అడిగే వాడికి బాధ తప్పదు.”

    11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చెబుతున్నాడు,

    “జరగబోయే విషయాలకు సంబంధించి, నా పిల్లలను గురించీ, నా చేతి పనులను గురించీ నాకే ఆజ్ఞాపిస్తారా?

    12 భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.

    13 నీతిని బట్టి కోరెషును ప్రేరేపించాను, అతని మార్గాలన్నిటినీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు,

    ఏమీ వెల గానీ, లంచం గానీ పుచ్చుకోకుండానే చెరలో ఉన్నవారిని అతడు విడిపిస్తాడు.”

  15. 26 కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు. 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.

    28 “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31 కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

    32 మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను. 33 ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.

  16. 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.

    15 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.

  17. 20 మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.

  18. 5 యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి, 6 “మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు.

  19. 33 చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

  20. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు. 4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

    6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.

  21. 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.

  22. 14 చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15 అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.

    16 కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17 ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.

  23. 9 ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

  24. 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

    3 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.

  25. 9 ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.

  26. 21 మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.

  27. 13 దేవుడు చేసిన పనులను గమనించు.

    ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా?

    14 మంచి రోజుల్లో సంతోషంగా గడుపు. చెడ్డ రోజుల్లో దీన్ని ఆలోచించు,

    తాము గతించి పోయిన తరువాత ఏం జరగబోతుందో తెలియకుండా ఉండడానికి దేవుడు సుఖదుఃఖాలను పక్కపక్కనే ఉంచాడు.

  28. 24 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా అంటున్నాడు. “కచ్చితంగా నేను ఉద్దేశించినట్టే అది జరుగుతుంది. నేను యోచన చేసినట్టే అది ఉంటుంది.

    25 నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను. నా పర్వతాల మీద అతన్ని నా కాళ్ళ కింద తొక్కుతాను. అప్పుడు అతని కాడి నా ప్రజల మీద నుంచి తొలగిపోతుంది. అతని భారం వాళ్ళ భుజాల మీద నుంచి తేలిపోతుంది.

    26 సర్వలోకం గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జాతులన్నిటి మీదా చాపిన చెయ్యి ఇదే.

    27 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దాన్ని ఆలోచించాడు. ఆయన్ని ఆపేవాడెవడు? ఆయన చెయ్యి ఎత్తి ఉంది. దాన్ని ఎవడు వెనక్కి తిప్పుతాడు?”

  29. 26 యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.

  30. 13 “నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?”

  31. 37 ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?

    38 మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?

    39 బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?

    40 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.

  32. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  33. 12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.

  34. 19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.

    20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.

    21 యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.

    22 యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

  35. 51 ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.

    52 బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు

    53 ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.

  36. 44 తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను.

  37. 65 ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.

  38. 10 యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు.

  39. 1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి.

    2 ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు.

    3 వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.

    లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.

    4 వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది.

    5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.

    నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.

    6 అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు.

    7 “ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.

  40. 27 ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా 28 హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.

  41. 38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది. 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.”

  42. 26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

    30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

  43. 1 పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. 2 ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.

    4 దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.

  44. 11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

    13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.

  45. 39 కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి.

  46. 10 యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు.

    పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు.

    భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు.

    తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు.

    తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”

  47. 31 యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి.

    ఆకాశాలు ఆనందించు గాక.

    భూమి సంతోషించు గాక

  48. 28 ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే.

  49. 9 ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.

    10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.

    11 యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.

  50. 2 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.

  51. 4 యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.

  52. 21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా?

    భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా?

    22 ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు

    దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు.

    ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు.

    23 రాజులను ఆయన శక్తిహీనులుగా చేస్తాడు. భూమిని పాలించే వారిని నిరర్ధకం చేస్తాడు.

    24 చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు.

    సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు.

    25 “ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు.

    26 మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా.

    తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు.

  53. 15 మీ పరిశుద్ధ దేవుణ్ణి, యెహోవాను నేనే. ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజుని.”

  54. 37 దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.

  55. 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.

  56. 11 తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు. 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.

    14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు. 15 వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు. 16 ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.

    17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి. 18 రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు.

    19 క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.

    20 అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.

    21 మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.

  57. 11 అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా.

  58. 39 చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి.

    నేను తప్ప మరో దేవుడు లేడు.

    చంపేది నేనే, బతికించేది నేనే.

    దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే.

    నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.

  59. 11 వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు.

  60. 1 యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు. 2 “పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. 3 మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి. 4 యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయాలి.”

  61. 6 ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

  62. దావీదు కీర్తన.

    1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.

    2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

  63. 6 దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం.

  64. 2 అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు.

  65. 1 యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.

  66. 2 ప్రాచీన కాలంనుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. నువ్వు శాశ్వతకాలం ఉన్నావు.

  67. యాత్రల కీర్తన

    1 పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను.

  68. 3 భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవా సీయోనులోనుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.

  69. 16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

  70. 8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.

    9 “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

  71. 1 యెహోవా ఇలా చెబుతున్నాడు,

    “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?

  72. 7 లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.

  73. 7 దాన్ని వెళ్ళగొడతాననీ పడదోసి నాశనం చేస్తాననీ ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ నేను చెబుతున్నాను.

    8 ఏ రాజ్యం గురించి నేను చెప్పానో ఆ రాజ్యం దుర్మార్గం చేయడం మానితే నేను వారి మీదికి రప్పిస్తానని నేననుకున్న విపత్తు విషయం నేను జాలిపడి దాన్ని రప్పించను.

    9 ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ ‘నేను కడతాను, లేకపోతే సుస్థిరం చేస్తాను’ అని చెప్పినప్పుడు,

    10 ఆ ప్రజలు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేస్తే దానికి చేయదలచిన మేలు చేయకుండా ఆపుతాను.”

  74. 17 “అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.

  75. 27 “చూడు! నేను యెహోవాను. సమస్త మానవాళికి దేవుణ్ణి. చెయ్యడానికి అసాధ్యమైనది ఏదైనా నాకు ఉందా?”

  76. 19 యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.

  77. 26 వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.

    27 అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. 28 అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.

  78. 19 ఆ రాత్రి సమయంలో దానియేలుకు దర్శనంలో ఆ కల, కల అర్థం వెల్లడైనాయి. దీన్నిబట్టి దానియేలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు, 20 “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు. 21 ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే, 22 ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. 23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.”

  79. 9 నేను ఇంకా చూస్తూ ఉండగా,

    ఇంకా సింహాసనాలను వేయడం చూశాను.

    మహా వృద్ధుడు కూర్చున్నాడు.

    ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా,

    ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి.

    ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది.

    దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి.

    10 అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది.

    వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు.

    కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు.

    తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.

  80. 9 ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.

  81. 6 ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు. 7 మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.

  82. 3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. 4 ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది.

  83. 12 తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. 13 వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.

  84. 1 “నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు. 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు. 3 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు.

    4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి.

  85. 10 అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.

    11 యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు.

  86. 5 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, 6 మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.

  87. 8 అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు.

    “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది.

    నీ రాజదండం న్యాయదండం.

  88. 17 కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.

  89. 6 తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.